టీబీ కాంట్రాక్టు ఉద్యోగుల బాధలు తీర్చండి

Govt of Telangana care about the plight of TB contract employees

Update: 2024-03-30 00:45 GMT

తెలంగాణ రాష్ట్రంలో టీబీ నిర్మూలన 2025 చేయాలని రాష్ట్రం పిలుపునిచ్చింది. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో టీబీ ఉద్యోగులు ప్రజల్లో అవగాహన టీబీ లక్షణాలున్న వారి శాంపిళ్ల సేకరణ కార్యక్రమాలు చేస్తున్నారు. టీబీ వ్యాధి గ్రస్తులకు మెరుగైన మందులు సలహాలు సూచనలు అందిస్తూ ప్రజల ఆరోగ్య అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. అయినప్పటికీ వారిపై ప్రభుత్వం శీత కన్ను చూపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ టీబీ ఉద్యోగుల గోస ఎవరు వింటారు! ఎవరు చూస్తారు! కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్నా కాంట్రాక్ట్ టీబీ ఉద్యోగుల జీవితాలలో మాత్రం వెలుగు నిండలేదు. 2018లో 510 జీవో ద్వారా ఎన్‌హెచ్ఎంలో పనిచేస్తున్న కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే 100% జీతాలు పెంచి అందులో టీబీ ఉద్యోగులందరినీ మర్చిపోయిన గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది. ఇందులో ఉద్యోగులుగా పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయిపోయారు. ఎలాంటి బెనిఫిట్స్ లేకుండానే రిటైర్డ్ అయిపోయారు. కాంట్రాక్ట్ ఉద్యోగంలోకి వచ్చి కాంట్రాక్ట్ పరిధిలోనే రిటైర్ అవడం ఒక ఉద్యోగికి ఎంత బాధాకరం. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని వేడుకుంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. న్యాయస్థానాలకు కూడా విలువ లేకుండా పోతుందేమో అని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

అర్హతకు తగ్గ జీతభత్యాలు ఉండాలి

ప్రభుత్వం మారితేనైనా మా జీవితాలు మారుతాయి అని ఆశపడ్డాం కానీ నిరాశే ఎదురైంది. కాంట్రాక్టు ఉద్యోగిగా మొదలు పెట్టిన జీవితం అన్ని అర్హతలు ఉండి కూడా కాంట్రాక్టు ఉద్యోగిగా జీవితాన్నీ ముగించాల్సి వస్తోంది. న్యాయం చేయమని మంత్రులు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగినా కూడా ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాకంటే తక్కువ అర్హతలు ఉన్న ఉద్యోగులు ఎక్కువ జీతం తీసుకుంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పోల్చుకుంటే అందులో టీబీ నిర్మూలనలో పనిచేసే సూపర్వైజర్ కేడర్లు ఇంకా చాలా తక్కువ జీతం అందిస్తున్నారు. ఇందులో సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్లు, టీబీహెచ్, డీఈవోలు. డిపిపిఎంలు. డిపిఎస్లు. స్టాటసికల్ అసిస్టెంట్. వివిధ కేటగిరీలవారున్నారు. అందుకే ప్రతి ఉద్యోగికి కూడా వారి అర్హతకు తగ్గట్టు జీతభత్యాలు నిర్ణయించాలని అధికారులను వేడుకుంటున్నారు. దీనిపై సమీక్ష నిర్వహించి టీబీ ఉద్యోగులకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నారు.

దేశాన్ని గడగడలాడించిన కరోనా సమయంలోనూ టీబీ వ్యాధిగ్రస్తులకు వెనుకాడకుండా సేవలందించారు. కరోనా కంటే టీబీ చాలా భయంకరమైనది కుటుంబంలో ఒకరికి వస్తే కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఎందుకంటే టీబీ వ్యాధిగ్రస్తులు వ్యాధి తీవ్రతను బట్టి ఆరు నుంచి 18 నెలల వరకు మందులు క్రమం తప్పకుండా వాడాలి. వాటి వల్ల వారికి దుష్ప్రభావాలు కూడా ఎదురవుతాయి. వాటిని తట్టుకొని నిలబడగలగాలి. అలాంటి అంటువ్యాధిని నిర్మూలించడంలో టీబీ ఉద్యోగులు ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.

న్యాయమైన జీతభత్యాలు ఇవ్వాలి..

టీబీ నిర్మూలనలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలామంది ఈ వ్యాధి బారిన పడి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి హెల్త్ రిస్క్ ఇన్సూరెన్స్‌లు కూడా అమలు చేయడం లేదు. దీనిపై ప్రభుత్వం ఆలోచించాలి. టీబీ ఉద్యోగులు వేడుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో టీబీ నిర్మూలనలో తెలంగాణ రాష్ట్రాన్ని మూడో స్థానంలో ఉంచడంలో టీబీ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వారి జీతాలు తెలంగాణ రాష్ట్రం టీబీ ఉద్యోగుల కంటే రెండు రెట్లు అధికంగా ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో టీబీ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ కూడా చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని విన్నవించుకుంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వమైనా కాంట్రాక్ట్ టీబీ ఉద్యోగుల సమస్యలను తీర్చి వారికి రావాల్సిన న్యాయమైన జీతభత్యాలను అందిస్తారని ఆశిస్తున్నారు.

నంద్యాల కిషన్ రెడ్డి

టీబీసీసీఏ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్

990899826

Tags:    

Similar News