చదువుకు ఆటలకు అవినాభావ సంబంధం ఉందన్న సంగతి తెలిసిందే. నేటి విద్యా వ్యవస్థలో మాత్రం ఆటలకు అంతగా ప్రాధాన్యం లభించడం లేదు. మనిషి జీవితంలో బాల్యం అత్యంత విలువైనది. బాల్యం పునాదుల మీదనే మనిషి తదుపరి జీవితం నిర్మించబడుతుందని అంటారు మనో వైజ్ఞానిక వేత్తలు. మన రాష్ట్రంలో రానురాను ఆటలు, మైదానాలు లేని విద్యాలయాలు పెరుగుతున్నాయి. ఆటల గురించి ఆలోచించని తల్లిదండ్రులు ఎక్కువవుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కనీస ఫిట్‌నెస్ లేని మానవాళితో ఈ సమాజం నిండిపోతుంది. నాలుగేండ్లకు ఒకసారి జరిగే ఒలిపింక్స్‌లో మనకు పతకాలు చాలా తక్కువగా వస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటాం.
ప్రపంచస్థాయి వేదిక మీద ఇచ్చే ప్రదర్శన, ఆ దేశం తీసుకునే విధాన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలు అసలు పట్టించుకోకుండా, క్రీడాకారులకు అత్యత్తమ శిక్షణ లేకుండా పతకాలు ఎలా సాధిస్తారో విమర్శకులు ఆలోచించాలి. మన రాష్ట్రంలో 4, 5 తరగతుల విద్యార్థులకు ఉన్న క్రీడా పాఠశాలలు మూడే. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లో మాత్రమే ఉన్నాయి. ఇంటర్ స్థాయిలో అసలు క్రీడా కళాశాలలే లేవు. దీంతో క్రీడా పాఠశాలలో చదివినవారు మామూలు కళాశాలలోనే చేరాలి. అప్పటిదాకా వారు పడిన శ్రమ, నైపుణ్యం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మన దగ్గర ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలలో ఉంటారు. ఒకరు స్కూల్ నిర్వహణ చూసుకుంటే, మరొకరు పాఠాలు చెబుతారు. ఇక పిల్లలకు ఆటలు నేర్పేది ఎవరు?
చదువంటే అంకెలు, అక్షరాలు కాదు
విద్యార్థులలో సామర్థ్యాలు, నైపుణ్యాలు విస్తృతంగా ఉంటాయి. కానీ, వారికి చదువు మాత్రమే ఉపాధి ఇస్తుందనే అపోహను ప్రభుత్వాలే పెంచి పెద్ద చేశాయి. ప్రోత్సహించే విధానం లేకపోవడంతో మన విద్యా వ్యవస్థలో క్రీడలు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చాం. ప్రైవేట్ సంస్థలలో ఆటలు లేవు. ఆటస్థలాలు ఉండవు. ఉన్నా పేరుకు మాత్రమే. పరీక్ష ఫెయిల్ అయితే ఆత్మహత్య ప్రయత్నం చేసే పిల్లలను చూస్తూనే ఉంటాం. ఫెయిల్ అయితే జీవితం అయిపోయినట్టుగా వారిని తయారు చేసాం. ఆటలు ఆడటం వలన చిన్నప్పుడే ఓటమి అంటే ఏమిటో తెలుస్తుంది.
గెలుపు కోసం ఏం చేయాలో అర్థం అవుతుంది. ఏకాగ్రత, మానసిక సమతుల్యత, భావోద్వేగాల నియంత్రణ, పరిణితితో కూడిన ప్రవర్తన, మంచి శరీర సౌష్టవం, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలు, గెలుపోటముల పట్ల సమభావం, జీవితం పట్ల బాధ్యత ,దేశ భక్తి ధైర్యము, ఇవన్నీ ఆటల ద్వారా విద్యార్థులకు చేరే అమూల్య లక్షణాలు, సుగుణాలు. నూతన జాతీయ విద్యా విధానంలో క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అమలు జరపడంలో రాష్ట్రాలు విఫలమయ్యే అవకాశం ఉంది. మొట్టమొదలు ప్రాథమిక స్థాయిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కట్టుదిట్టంగా అమలు జరపాలి. చదువంటే అంకెలు అక్షరాలు కాదని సంపూర్ణ మూర్తిమత్వ వికాసమని సమాజం అర్థం చేసుకోవాలి.
మన దేశ క్రీడ ఏది అంటే టక్కున హాకీ అని చెబుతారు. మన విద్యార్థులు జీవితంలో కనీసం ఒక్కసారైనా హాకీ స్టిక్ పట్టుకున్నారా? దేశం తరుపున ఆడటానికి నూతన క్రీడాకారులు ఎంతమంది తయారు అవుతున్నారో తెలుసా? మన రాష్ట్రంలో ఉన్న ఆటస్థలాలు హర్యానాలో ఉన్న ఒక జిల్లా ఆటస్థలాలతో సమానం. దేశం తరఫున ఆడి విజయం సాధించిన వారికి అక్కడి ప్రభుత్వం సత్కారాలు, వరాలు కురిపిస్తుంది. అదే ఉత్సాహం, అంకుర స్థాయిలో ఉన్న ఎంతో మంది క్రీడాకారులకు మన ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు ఏమిటి? ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న క్రీడాకారులను వెలుగులోకి తేవాల్సిన బాధ్యత ఎవరిది?
ఒడిశా ప్రభుత్వం ఒలింపిక్స్‌లో హాకీకి స్పాన్సర్‌షిప్ అందించింది. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఒక స్టేడియం నిర్మించామా? ఆటస్థలాలు ఆక్రమణకు గురి అవుతుంటే పట్టించుకున్నామా? క్రీడాకారుల గుర్తింపు, తర్ఫీదు, అవకాశాలు, ప్రోత్సాహకాలు సౌకర్యాలు వసతులు కల్పించామా? ఇందుకు కారణం క్రీడా పాలసీలు, ముందు చూపు లేని 'ఇన్‌స్టంట్' ఎడ్యుకేషన్ సిస్టం. గ్రామీణ ప్రాంతాలలో అంకుర క్రీడాకారులకు కొదవ లేదు. జిల్లాకు ఒక క్రీడా గురుకులం ఏర్పాటు చేయాలి. అన్ని పాఠశాలలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి చేయాలి. క్రీడా వర్సిటీని ప్రారంభించాలి. ఏటా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించాలి. క్రీడాకారులకు విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలి.
సుగంధ శ్రీనివాస్
77300 65637