ఉపాధ్యాయులపై ఇంత విషప్రచారమా?

ఉపాధ్యాయులపై ఇంత విషప్రచారమా?... government spreading propaganda against teachers says mohan das

Update: 2023-02-02 19:15 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద విషపు ప్రచారం సాగుతోంది. ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టు వెలగబెడుతున్న అధికారి విపరీత ధోరణితో సమాజంలో విద్యావ్యవస్థ కునారిల్లే ప్రమాదం ఏర్పడింది. గడిచిన 3 దశాబ్దాలుగా ప్రభుత్వ విద్యావ్యవస్థలకు పాడిగట్టే ప్రయత్నాలు విజయవంతం చేయగా, రక్షణ కల్పించి కాపాడాల్సిన కొందరు అధికారులు ఇప్పుడు ఘోరంగా మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయ వృత్తి విలువలను దిగజార్చి పత్రికలలో వెటకారపు వార్తలు రాయించి మరీ పరువు తీస్తున్నారు. పర్యటనలకు మీడియా గ్లేర్ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలల ఉనికికి, ఉపాధ్యాయుల విశ్వసనీయతకు ప్రమాదం వాటిల్లేలా చేస్తున్నారు. ఉపాధ్యాయుల నిస్సహాయతపై పధకం ప్రకారం జరుగుతున్న దాడిని అందరూ ఖండించాలి.

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల మనుగడకు కొన్ని అంశాలు తక్షణ అడ్డంకులుగా ఉంటున్నాయి. అవి ఏమిటంటే.. పాఠశాల పనిగంటల్లో మొబైల్ ఫోను దూరంగా ఉంచడం, ఉపాధ్యాయులకు బోధనేతర విధులను లేకుండా చేయడం సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించడం, సకాలంలో ఉపాధ్యాయుల కొరతను తీర్చడం, ఉపాధ్యాయుల ప్రయోజనాలు సక్రమంగా అందించడం, జీఓ 117 ను పక్కన పెట్టడం, జాతీయ విద్యావిధానం అమలును పక్కన పెట్టడం, ప్రాథమికోన్నత పాఠశాలలను బలోపేతం చేయడం, ప్రయివేటు పాఠశాలలను నిబంధనల ప్రకారం నడిచేలా కట్టడిచేసే చర్యలు చేపట్టడం, అకడమిక్ వ్యవహారాల్లో తరచూ జోక్యం నివారించడం, పరీక్షలు విధానాన్ని సంస్కరించడం, ప్రతి యేటా ప్రతి పాఠశాలను మానిటరింగ్ చేయడం. ఏపీలో పాఠశాలల, టీచర్ల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్న కింది సమస్యలను పరిశీలించి ప్రభుత్వం చిత్తశుద్ధితో చక్కదిద్దే ప్రయత్నం చేయాల్సిన అవసరం వుంది.

పెద్దవాళ్లూ... పిదప బుద్ధులూ...

ఉన్నత స్థానానికి ఎదిగిన తర్వాత ఉన్నతస్థాయి ఆలోచనా విధానం ఉండాలి. అంతేకాదు... సదరు అధికారులకు కొన్ని పరిధులు, పరిమితులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. వారి ఆలోచనలు పరిణితి చెందివుండాలి. ఉన్నతాధికారులైనంత మాత్రాన వారికి రాజ్యాంగ పరిధికి మించి హక్కులు, అధికారాలు ఉండవు. మనం రాచరిక వ్యవస్థలో లేము. సర్వ సత్తాక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాం. అంచెలంచెలుగా వివిధ స్థాయిల్లో వివిధ అధికారాలతో, వివిధ బాధ్యతలతో, ఆయా స్థాయిలో జీతభత్యాలతో ఉన్నాం. ఉద్యోగులు రాజ్యంలో భాగం. ఒక్క మాటలో చెప్పాలంటే వారేం దైవంశ సంభూతులు కాదు. అలా భ్రమించి ప్రత్యక్ష పాలకులుగా తమను తాము అన్వయించుకుని, ఎవరో ఉసిగొల్పిన ఊరకుక్కల్లా వ్యవస్థలను కూల్చేసే చర్యలకు పాల్పడడం సమంజసం కాదు. అణచివేతకు గురైనవారు, అణచివేసేవారు ఒకే విధంగా మానవత్వాన్ని దోచుకోవడమనే విధానం ఇక్కడ చూస్తున్నాం...

ఆంధ్రప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద విషపు ప్రచారం సాగుతోంది. ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టు వెలగబెడుతున్న అధికారి విపరీత ధోరణితో సమాజంలో విద్యావ్యవస్థ కునారిల్లే ప్రమాదం ఏర్పడింది. గడిచిన 3 దశాబ్దాలుగా ప్రభుత్వ విద్యావ్యవస్థలకు పాడిగట్టే ప్రయత్నాలు విజయవంతం చేయగా, రక్షణ కల్పించి కాపాడాల్సిన కొందరు అధికారులు ఇప్పుడు ఘోరంగా మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయ వృత్తి విలువలను దిగజార్చి పత్రికలలో వెటకారపు వార్తలు రాయించి మరీ పరువు తీస్తున్నారు. పర్యటనలకు మీడియా గ్లేర్ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలల ఉనికికి, ఉపాధ్యాయుల విశ్వసనీయతకు ప్రమాదం వాటిల్లేలా చేస్తున్నారు.

ఉపాధ్యాయులే దోషులా?

ఈ పరంపరలో కొన్ని విషయాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. విద్యావ్యవస్థను బాగుచేయాలనేది అధికారుల సంకల్పం. దీనిని స్వాగతించాల్సిందే! విద్యావ్యవస్థలో అస్తవ్యస్తతను సవ్యమార్గంలో నడిపించడాన్నీ ఎవరూ తప్పు పట్టరు. కానీ కేవలం ఉపాధ్యాయులను దోషులుగా చూపెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగితే అందుకు తగిన మూల్యం కూడా చెల్లించుకోవల్సివుంటుంది. దాని ప్రభావం పాఠశాలలపై పడుతుంది. పనిదినాల పరంగా 2021-22, 23 విద్యా సంవత్సరాలు మాత్రమే ఒక మోస్తరుగా బోధన నడిచింది. అంతకుముందు రెండేళ్ళూ (కరోనా కాలమంతా) బోధన లేకుండా అస్తవ్యస్తంగా గడిచిందనే వాస్తవం ఎవరూ విస్మరించరానిది. ఆ కాలమంతా విద్యార్థులు పూర్తిగా బోధనకు దూరమయ్యారు.

సిమెంటు గడ్డకడితే...

సిమెంట్ బస్తా గడ్డ కడితే ఉపాధ్యాయులను బాధ్యులు చేసి శిక్షించడం, కొన్ని నిముషాల ఆలస్యాన్ని ఆలసత్వంగా భావించి సస్పెండ్ చేయడం, పాఠ్యప్రణాళికలు రాయకపోవడాన్ని భూతద్దంలో చూడడం, డైరీ వంటి ప్రతి చిన్న సమస్యను జఠిలం చేయడం, మానవ రహిత బోధన అంటే ప్రత్యామ్నాయ బోధనా విధానాలను పేర్కొనడం, ఉపాధ్యాయులకు వేతనాలు వృధాగా ఇస్తున్నామనడం, కిందిస్థాయి తనిఖీ అధికారులను కించపరచడం, మీదుమిక్కిలి తానే ఆన్‌లైన్ పాఠాలు బోధిస్తామని చెప్పడం అనేవి ఒక రాష్ట్ర స్థాయి అధికారి పర్యవేక్షణకు ప్రాతిపదికలు కావడం దురదృష్టకరం. చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఎంపిక చేసుకున్న ప్రశ్నలతో ముంచెత్తితే సాధారణ ఉపాధ్యాయులు సమాధానం చెప్పగలరా? పాఠశాలలు ప్రారంభమైన రెండు నెలల తర్వాత ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు సరఫరా చేయగా పాఠాలు పూర్తి చేయడంలో ఆలస్యం జరిగితే దానికి తనిఖీ అధికారులు, సిబ్బందిని ప్రశ్నిస్తే వారేం చెప్పాలి?

అయినా... నాడు- నేడుకూ టీచర్లకు సంబంధం ఏంటి? నిర్మాణ పనుల్లో నాణ్యత బాధ్యత ఉపాధ్యాయులకు ఎందుకు? సాంకేతిక సమస్యలను కూడా ఉపాధ్యాయులకు అంటగట్టి వారిని బాధ్యులుగా స్పష్టీకరించి చర్యలకు ఉపక్రమిస్తే టీచర్లు బాధితులుగా నిలబడాల్సిందేనా?

ఆలస్యంపై చర్యలు ఒకే..

బడికి రావడంలో టీచర్లు ఆలస్యం చేస్తే తప్పు చర్యలు తీసుకోవచ్చు, అందరూ అంగీకరించాల్సిందే, ఎందుకంటే ఉపాధ్యాయులకోసం పిల్లలు ఎదురుచూస్తుంటారు. బడి నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే పెద్దఎత్తున సాంకేతిక సమస్యలు ఎదురౌతున్న దృష్ట్యా ప్రభుత్వమే డివైజ్‌లు అందించి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తే, ఆ తర్వాత టీచర్లపై నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చు.

పాఠ్యప్రణాళికలు....

తరగతి గదిలో వివిధస్థాయిల్లో విద్యార్థుల సామర్థ్యం ఉంటుంది. ఒక్కొస్థాయి విద్యార్థికి ఆ స్థాయికి తగిన పాఠ్య ప్రణాళిక అవసరం. ఉపాధ్యాయులు మూసగా ప్రణాళికలతో తరగతి గదిలో తాను సాధించదలచుకున్న లక్ష్యాలను చేరుకోగలరా? అలాగే బోధనేతర కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసి మొబైల్ ఫోన్ వినియోగాన్ని నిషేధించగలిగితే ఏదైనా సాధ్యమే.

డైరీ....

ఈరోజు ఏ పాఠం చెప్పారో ఇంకా ఏం చెప్పాలో, రాసుకుంటే చాలు. తరగతికి హాజరయ్యారా లేదా అనేదానికి ప్రామాణిక మది. దానికి మళ్లీ ప్రతిస్పందనలేమిటి, ఒక్కో విద్యార్థికి ఒక్కో ప్రతిస్పందన ఉంటుందనే విషయం గుర్తించాలి. ప్రతి తరగతికీ, ప్రతి విద్యార్థికీ స్పందన రాస్తూ పోతే దాన్ని డైరీ అనరు.

బైజూస్- వెర్రివెంగళప్పలూ..

బైజూస్‌ను ఉపాధ్యాయులకు సమాంతర ప్రత్యామ్నాయ యంత్రంగా చూపెట్టడం వెర్రి వెంగళప్పలు చేసే పని. 2011 లో పుట్టిన ఒక సంస్థ వందల సంవత్సరాలుగా ఉనికిలో ఉంటున్న ఉపాధ్యాయ వ్యవస్థకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాబోదు. అలాంటి ప్రయివేటు సంస్థల చేత ఉపాధ్యాయులను చేతగాని వారీగా చూపెట్టే ప్రయత్నం చేయడం ప్రమాదకరం. అదీ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ధారాదత్తం చేసి బైజూస్‌ని తేవడం ఘోరం. దీన్ని ఉపాధ్యాయుల విశ్వసనీయతను దెబ్బతీసే యత్నాలుగా భావిస్తున్నారు. సామాజిక, కాల, ప్రాంత, సమయ సందర్భ, పరిస్థితులకు అనుగుణంగా కుటుంబాలను కూడా విస్మరించి బోధన చేస్తూ సేవా దృక్పథంతో సామాజిక చైతన్యానికి పాటుపడుతున్న ఉపాధ్యాయలోకానికి ప్రభుత్వమూ, విద్యాధికారులూ ఇచ్చే బహుమతి చాలా విలువైనదిగా ఉంది. కానీ సస్పెన్షన్ అనేది ప్రధమ చికిత్సగా చూడకూడదు.

ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు నిత్యం పర్యవేక్షణలోనే వుంటారు. మండల స్థాయిలో విద్యాశాఖాధికారి తన పరిధిలో ప్రతిరోజూ ఒకటి రెండు పాఠశాలలు, ఉప విద్యాశాఖాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి ఇలా అంచెలంచెలుగా తనిఖీ వ్యవస్థ ఉంది. క్షేత్రస్థాయిలో అంచెలంచెలుగా ఇన్‌స్పెక్టింగ్ వ్యవస్థ ఉండగా ఒక ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయి అధికారి పర్యటనల పేరుతో ఠారెత్తిస్తుంటే వారి విలువ ఏమవుతుంది? కింది స్థాయిలో కట్టుదిట్టమైన వ్యవస్థలను నిర్వీర్యం చేయడం సహేతుకంగా లేదు.

ఇంత జరుగుతున్నా ఉపాధ్యాయుల తరపున ప్రశ్నించే వారు కరువయ్యారు. ఉపాధ్యాయుల తరపున చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధులు సైతం క్షేత్రస్థాయిలో ఎదురౌతున్న సమస్యలను సంబంధిత అధికారులకు నివేదించడంలో ప్రేక్షక పాత్ర వహించారు. తమ ప్రతిస్పందనను వినిపించలేకపోయారు. ఇప్పుడిపుడే కొందరు గొంతు సవరించుకొని యూట్యూబ్‌లో సందేశాలు ఇస్తుండగా, మరికొందరు మీడియాలో ప్రకటనలు చేస్తూ చేతులు దులుపుకొన్నారు. కొన్ని సంఘాలు నేరుగా అధికారుల చర్యలను సమర్థిస్తున్నారు. ఉపాధ్యాయులకు సంఘీభావంగా నిలబడి స్థైర్యం నింపాల్సిన సంఘాలు కొన్ని అధికారులకు వంతపాడుతూ ఉపాధ్యాయులను సంఘర్షణకు గురిచేస్తున్నాయి. ఇది నిస్సందేహంగా ఉపాధ్యాయుల నిస్సహాయతపై పధకం ప్రకారం జరుగుతున్న దాడి.

- మోహన్ దాస్,

రాష్ట్ర కౌన్సిలర్, ఏపిటిఎఫ్

94908 09909

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Tags:    

Similar News