బడి ఫీజుల నిర్దయ పరుగు
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ బడుల వ్యాపారం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా కాలంలో కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి యాజమాన్యాలు ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేశాయి.
పేదలు తాము సంపాదించిన సొమ్ములో 80 శాతం పిల్లల చదువుకు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఫీజులను కఠినంగా నియంత్రించాలి. స్టేషనరీ, యూనిఫామ్, బుక్స్ తక్కువ రేటుకు అందించేలా చూడాలి. పేద, మధ్య తరగతి పిల్లలకు 25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈ నిబంధనలు పాటించని బడుల గుర్తింపు రద్దు చేయాలి. ఇందుకోసం విద్యార్థి, తల్లిదండ్రుల సంఘాలు, ప్రజా సంఘాలు, హక్కుల సంరక్షణ సంస్థలు, విద్యారంగ శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులతో కలిసి ఐక్యవేదికలుగా ఏర్పడి ఉద్యమించాలి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ బడుల వ్యాపారం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా కాలంలో కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి యాజమాన్యాలు ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేశాయి. విచిత్రంగా ఆన్‌లైన్ క్లాసులకు కూడా యూనిఫామ్ వేసుకోవాలని, పాఠ్యపుస్తకాలు కొనాలని ఒత్తిడి చేశాయి. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో అడ్డూ అదుపూ లేకుండా ఈ విద్యా సంవత్సరానికి 20 నుండి 50 శాతం వరకు విచ్చలవిడిగా ఫీజులు పెంచేసాయి. అమీర్‌పేటలోని ఒక కార్పొరేట్ బడి ఒకటవ తరగతికి 2 లక్షల 30 వేల రూపాయలు, 3వ తరగతికి 2 లక్షల 56 వేలు ఫీజుగా నిర్ణయించింది. ఇందులో కరోనా డిస్కౌంట్ పోనూ 2 లక్షల 11 వేల రూపాయలు కట్టించుకుంటున్నారు.
సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో గత సంవత్సరం రూ.62 వేల ఫీజు ఉంది. దీనిని ఏకంగా రూ.80 వేలకు పెంచేశారు. పుస్తకాలు, రవాణా, యూనిఫామ్ అంటూ వసూలు అదనం. ఎల్బీనగర్‌లోని ఓ బడిలో గత ఏడాది ఐదో తరగతి ఫీజు రూ.36 వేలు. ఇప్పుడు ఏకంగా రూ.50 వేలకు పెంచారు. వనస్థలిపురంలోని ఓ పాఠశాల అడ్మిషన్ ఫీజు రూ.40 వేలు కట్టించుకుంటున్నది. రెగ్యూలర్ ట్యూషన్ ఫీజు కింద మరో 60 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. పెట్రో ధరలు పెరిగాయని ట్రాన్స్‌పోర్టు ఫీజులను విపరీతంగా పెంచేశారు. 3, 5, 10 కిలోమీటర్ల చొప్పున స్లాబులు నిర్ణయించి, గరిష్ట స్లాబుకు రూ.60 వేలుగా నిర్ణయించారు. గతంలో ఐదు కిలోమీటర్లకు 15 వేలు ఉంటే, ఇప్పుడు 25 వేలు చేశారు. కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలు ఇంత బహిరంగంగా దోపిడీకి పాల్పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఫీజులు అధికంగా వసూలు చేసిన బడులను, కాలేజీలను తరిమేస్తామని కేసీఆర్ ఉద్యమ కాలంలో చెప్పారు. ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.
జీఓలలో లోపముంచి
ప్రైవేట్ యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద, మధ్య తరగతి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని కాజేస్తున్నాయి. బడుల దోపిడీని నివారించేందుకు ఈ విద్యా సంవత్సరంలోనే నియంత్రణ చట్టం తీసుకువస్తామన్నారు. కానీ, ఆచరణకు రాలేదు. తల్లిదండ్రులు, ప్రతిపక్షాల విమర్శల ఫలితంగా ఫీజుల నియంత్రణకు జీఓలు ఇచ్చినా అవి యాజమాన్యాలకే అనుకూలంగా ఉన్నాయి. జీఓ 1/1994, జీఓ 91, జీఓ 42 మీద యాజమాన్యాలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోగలిగాయి. ఫీజుల నియంత్రణకు ప్రొఫెసర్ టి.తిరుపతి రావు కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలుకు నోచుకోవడం లేదు. ఈ రిపోర్టునూ బహిర్గతం చేయలేదు.
రిపోర్టులో 10 శాతం పెంచుకోవచ్చని ఉందంటూ విచ్చలవిడిగా ఫీజులు పెంచేశారు. ఫలితంగా పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నారు. పేదలు తాము సంపాదించిన సొమ్ములో 80 శాతం పిల్లల చదువుకు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఫీజులను కఠినంగా నియంత్రించాలి. స్టేషనరీ, యూనిఫామ్, బుక్స్ తక్కువ రేటుకు అందించేలా చూడాలి. పేద, మధ్య తరగతి పిల్లలకు 25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈ నిబంధనలు పాటించని బడుల గుర్తింపు రద్దు చేయాలి. ఇందుకోసం విద్యార్థి, తల్లిదండ్రుల సంఘాలు, ప్రజా సంఘాలు, హక్కుల సంరక్షణ సంస్థలు, విద్యారంగ శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులతో కలిసి ఐక్యవేదికలుగా ఏర్పడి ఉద్యమించాలి.
పగడాల లక్ష్మయ్య
తల్లిదండ్రుల సంఘం (TPA) రాష్ట్ర కార్యదర్శి
98498 68145