మంత్రివర్గంలో ‘మైనార్టీల’కూ ఛాన్సివ్వండి
Give a chance to 'minorities' in the Telangana cabinet
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మరో 11 మంది మంత్రులు సైతం బాధ్యతలు తీసుకున్నారు. అయితే వీరిలో ఒక్క ముస్లిం కూడా లేకపోవడం గమనార్హం. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేకపోవడం రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి. కాగా, ముస్లింలకు మంత్రివర్గంలోకి తీసుకొని న్యాయం చేయడానికి కాంగ్రెస్ వద్ద అనేక మార్గాలు ఉన్నాయి. ఒక్క సీనియర్ నైనా మంత్రివర్గంలోకి తీసుకొని.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎంపిక చేసుకోవాలనే డిమాండ్ మైనార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నది.
సీట్లను బట్టి చూస్తే..
కాంగ్రెస్ పార్టీ తరఫున 64 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి 39 మంది, బీజేపీ 8, ఎంఐఎం ఏడుగురు, సీపీఐ నుంచి ఒకరు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అయితే వీరిలో ఎంఐఎం మినహా వేరే ఏ ఇతర పార్టీ నుంచి ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేకపోవడం గమనార్హం. ఎంఐఎం పార్టీ నేరుగా ప్రభుత్వంలో చేరిన సందర్భం ఇప్పటికీ లేదు. మరోవైపు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బహిరంగంగా మద్దతు తెలిపిన ఆ పార్టీని కాంగ్రెస్ అక్కున చేర్చుకునే పరిస్థితి లేదు. దీంతో మైనార్టీలకు ఈసారి మంత్రివర్గంలో ఛాన్స్ ఎలా అనే చర్చ మొదలైంది.
ఆరుగురికే కాంగ్రెస్ టికెట్లు
కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఆరు స్థానాలను ముస్లింలకు కేటాయించింది. నిజామాబాద్ అర్బన్ నుంచి మహ్మద్ షబ్బీర్ అలీ, జూబ్లీహిల్స్ నుంచి మహమ్మద్ అజారుద్దీన్, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్, మలక్ పేట్ నుంచి షేక్ అక్బర్, చార్మినార్ నుంచి ముజీబ్ షరీఫ్, కార్వాన్ నుంచి ఉస్మాన్ అల్ హాజ్రీ పోటీ చేశారు. అయితే కార్వాన్, చార్మినార్, మలక్ పేట్‌లో ఎంఐఎం డామినేషన్ ఉన్నందున.. అక్కడ గెలుపుపై ఎవరికీ ఆశలు లేవు. వీరిని ప్రజలు డమ్మీ అభ్యర్థులుగానే భావించారు. అక్కడ ఎంఐఎం గెలిచింది. మరోవైపు జూబ్లిహిల్స్‌లో కూడా ఎంఐఎం తన అభ్యర్థిని నిలబెట్టడంతో అక్కడ అజారుద్దీన్ ఓడిపోయారు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ టఫ్ ఫైట్ ఇచ్చినా.. ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిని చవి చూశారు. మహమ్మద్ షబ్బీర్ అలీ నియోజకవర్గం చేంజ్ చేయడంతో ఆయన ఓడిపోయారనే చర్చ జరుగుతున్నది. ఆయన కామారెడ్డి నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఈసారి అక్కడి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేయడంతో.. టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి సైతం అక్కడి నుంచి బరిలోకి దిగారు. అక్కడ బీజేపీ విజయం సాధించింది. షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించగా, ఆయన ఓడిపోయారు.
మంత్రివర్గంలోకి ఎలా..!
తెలంగాణలో సీఎంతో కలిపి మొత్తం 18 మంది మంత్రులుగా ఉండే అవకాశమున్నది. కేసీఆర్ కేబినెట్‌లో 17 మంది మంత్రులు ఉన్నారు. ఈటలను తొలగించిన తర్వాత చాలా కాలంపాటు ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంచిన కేసీఆర్... ఎన్నికల సమయంలో దాన్ని పట్నం మహేందర్‌తో భర్తీ చేశారు. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్‌తోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అంటే మరో ఆరుగురికి మంత్రి పదవి ఇచ్చే అవకాశముంది. దీంతో రెండో దశ మంత్రి వర్గ విస్తరణ సమయంలో కనీసం ఒక ముస్లింకైనా మంత్రి పదవి కేటాయించాలనే డిమాండ్ వినిపిస్తున్నది. దీంట్లో ముఖ్యంగా కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో నియోజకవర్గం మారి ఓడిపోయిన షబ్బీర్ అలీకి అవకాశం కల్పిస్తే బాగుంటుంది. మహమ్మద్ అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్‌లలో ఒకరికి అవకాశమిచ్చినా సరిపోతుంది. అప్పుడే ప్రమాణస్వీకారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. బానిస సంకెళ్లు బద్దలయ్యాయి. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగొందుతుంది’ అనేది నిజమవుతుంది. కానీ మంత్రివర్గంలో మైనార్టీలు లేకపోవడమంటే.. తెలంగాణలో సామాజిక న్యాయం పూర్తి కానట్లే.
-ఫిరోజ్ ఖాన్,
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,
96404 66464