ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ!

Freedom of the press at risk!

Update: 2024-03-01 01:00 GMT

ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుందని కాళోజీ చెప్పిన మాటలు గుర్తుకువస్తున్నాయి. ప్రజలకు నిజాలు చెప్పడం మీడియా ప్రధాన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని విస్మరించి మౌనంగా ఉంటే ప్రభుత్వ తప్పిదాలను అంగీకరించడమే అవుతుంది. వాస్తవాలు ప్రజలకు చేరవేయడమే నేరంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, పత్రికా స్వేచ్ఛను హరించిన ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని తెలుసుకోలేకపోతోంది.

‘మీ అభిప్రాయం నాకు నచ్చకపోవచ్చు. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా, నిర్భయంగా చెప్పడానికి నీకు గల హక్కును కాపాడటానికి నా ప్రాణాలైనా ధారపోస్తా’ అన్నాడు ఫ్రెంచ్ తత్వవేత్త వాల్తేర్. ప్రజాస్వామ్యానికి పునాది పత్రికా స్వేచ్ఛ. అలాంటి పత్రికా స్వేచ్ఛ దేశంలో, రాష్ట్రంలో ప్రమాదంలో పడింది. ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజాస్వామ్యానికి నాలుగు మూలస్థంబాలు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా వారధిగా పనిచేస్తుంది. ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను, పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ విద్యుత్ ధర్మాన్ని వారి భుజస్కంధాలపై వేసుకుని తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.

దేశ ద్రోహ కేసులు ఇక్కడే ఎక్కువ!

ప్రభుత్వ వైఫల్యాలను, వైసీపీ నేతల అవినీతి, అక్రమాలను వెలికితీస్తున్నారన్న అక్కసుతో ఏపీలో పత్రికా కార్యాలయాలపై, ఫొటో గ్రాఫర్లపైన, విలేకరులపైన భౌతిక దాడులకు తెగబడుతున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అన్ని బహిరంగ సభల్లో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు. పదేపదే దుష్టచతుష్టయం అంటూ ప్రముఖ దినపత్రికలు, మరికొన్ని ఛానల్స్ పేర్లు ప్రస్తావిస్తూ తన స్థాయిని దిగజార్చుకుంటూ మాట్లాడుతున్నారు. కర్నూలులో ఈనాడు కార్యాలయాలపైన, అనంతపురంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్, క్షేత్రస్థాయిలో విలేకర్లపైనా దాడులకు దిగారు. సుప్రీంకోర్టు తప్పుబట్టిన సెక్షన్ 124ఏ కింద దేశద్రోహం కేసులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా ఈ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 79 నమోదైతే ఒక్క ఏపీలో 29 నమోదయ్యాయి. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 2430 జీవో తీసుకువచ్చింది.

పత్రికా స్వేచ్ఛలో భారత్ అధోగతి

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారతదేశం 161 వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 'రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్' అనే ఫ్రాన్స్ కు చెందిన సంస్థ ప్రతి ఏడాది 180 దేశాలలో పత్రికా స్వేచ్ఛ ఏ దేశంలో ఎలా ఉందో రేటింగ్‌లు ఇస్తుంది. ఈ సంస్థ ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకింగ్‌లు ఇస్తుంది. రాజకీయ, చట్టపరమైన, ఆర్థిక, సామాజిక సాంస్కృతిక, జర్నలిస్టుల భద్రత లాంటి ఐదు అంశాలపై సర్వే చేసి నివేదికలను విడుదల చేస్తారు. ఇందులో ప్రధానమైన జర్నలిస్టుల భద్రత అంశంపై మనదేశం 172వ స్థానంలో నిలిచింది. దీనిని బట్టి జర్నలిస్టుల భద్రత దేశంలో, రాష్ట్రంలో అత్యంత ప్రమాదంలో ఉందని అర్థమవుతోంది. ఎప్పుడూ రాజకీయ అనిశ్చితి, తీవ్రవాదంతో అట్టుడికే ఆప్ఘనిస్థాన్ 152వ స్థానం, పాకిస్థాన్ 150, శ్రీలంక 135 వ స్థానాల్లో నిలిచాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రతలో అత్యంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉండటం విచారకరం.

జర్నలిస్టులపై దాడుల్లో నంబర్ వన్

పత్రికా కార్యాలయాలపై జరుగుతున్న దాడులు, జర్నలిస్టులపై వేధింపుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో ఉంది. కేవలం ప్రభుత్వ తప్పిదాలను, లోపాలను ఎత్తిచూడపమే నేరంగా భావించి, వారిపై కేసులు పెట్టి ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1878లో తీసుకువచ్చిన వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ గుర్తుకువస్తోంది. ఈ చట్టం ద్వారా స్థానిక పత్రికల వార్తలను, ఎడిటోరియల్స్‌ను సెన్సార్ చేసేవారు. అతిక్రమిస్తే రాజద్రోహం కేసులు నమోదు చేసేవారు. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ లాంటి చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చి సెన్సార్ విధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కేంద్ర ప్రభుత్వం ది వైర్, న్యూస్ క్లిక్ మీడియాలకు విదేశాల నుంచి నిధులు వస్తున్నాయనే నెపంతో అక్రమ కేసులు పెట్టి ఆంక్షలు విధించారు. గుజరాత్ అల్లర్లపై వీడియో విడుదల చేసిన కారణంగా బీబీసీని సైతం వదలకుండా ఐటీ దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేశారు. మీడియా స్వేచ్ఛపై అమెరికా పరోక్షంగా బీబీసీకి మద్దతు తెలిపి ఈ చర్యలను ఖండించింది. ఇలాంటి దాడుల వల్ల పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడి ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది.

లక్ష మెదళ్లను కదిలించే సిరాపై నిఘా

ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుందని కాళోజీ చెప్పిన మాటలు గుర్తుకువస్తున్నాయి. ప్రజలకు నిజాలు చెప్పడం మీడియా ప్రధాన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని విస్మరించి మౌనంగా ఉంటే ప్రభుత్వ తప్పిదాలను అంగీకరించడమే అవుతుంది. పత్రికా స్వేచ్ఛను హరించిన ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు, మేధావులు అప్రమత్తంగా ఉండి రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 19(1 ఏ)ను కాపాడుకోవాలి. ఇప్పటికే టీవీలు గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయాయి. వీక్షకుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ఓటర్లను ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు మీడియాకు ఉంటుంది. కాబట్టి మీడియా బాధ్యతగా వ్యవహరించి ప్రజలకు మేలు చేసే కోణంలో కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుంది. మీడియాపై జరుగుతున్న దాడులు నిరోధించడానికి కఠినమైన చట్టాలు తీసుకురావాలి. మీడియాపై దాడులు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సరైన సమయంలో గుణపాఠం చెప్పాలి.

మన్నవ సుబ్బారావు

99497 77727

Tags:    

Similar News