విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రతిఘటించాలి
విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రతిఘటించాలి... Foreign universities should be resisted
దేశంలో విదేశీ విద్యాలయాలను నెలకొల్పేందుకు వీలుగా యూజీసీ భారతదేశంలో ఉన్నత విద్యాసంస్థల ప్రాంగణాల ఏర్పాటు నిర్వహణ పేరుతో ముసాయిదాను విడుదల చేయడం విస్మయానికి గురిచేసింది. విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతించడానికి యూజీసీ చైర్మన్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. దీనిపై సలహాలు, సూచనలు ఈ నెల 18 వ తేదీ వరకు పంపాలని పేర్కొనడం విద్యార్థులనే కాక విద్యారంగ మేధావులను తీవ్రంగా కలచివేస్తుంది.
దేశ సంపదను దోచి పెట్టేందుకే
నూతన జాతీయ విద్యా విధానం-2020 సిఫార్సులకు అనుగుణంగా దేశాన్ని విశ్వవిద్యాలయాల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ ముసాయిదా ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ, ఇది అంతిమంగా సంపన్న వర్గాల లబ్ధికే దోహదపడుతుందని అంచనా వేయవచ్చు. అంతేకాకుండా ఏటా విదేశీ విద్య అభ్యసించడానికి భారత్ నుంచి ఐదు లక్షల మంది విదేశాలకు వెళ్తున్నారని, అందుకే దేశంలోనే విదేశీ విద్యాలయాలు ఏర్పాటైతే వారికి నివాస వ్యయం, ట్యూషన్ ఫీజు తగ్గి మరింత తక్కువ ఖర్చుతో విదేశీ విద్యని అభ్యసించగలుగుతారనే వాదన ముందుకు తెచ్చారు. అయితే వీటి ఏర్పాటులో విదేశీ విద్యా ప్రమాణాలను దేశంలో ఏర్పరిచే విద్యాసంస్థలలో ఎలా ఏర్పరుస్తారని మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాకుండా వీటిని ఏర్పాటు చేస్తే విద్య మరింత వ్యయంతో కూడుకున్నదిగా మారి బలహీన వర్గాలకు విద్య అందని ద్రాక్షగా పరిణమించే ప్రమాదాన్ని గుర్తించడం లేదు.
అలాగే ఈ ముసాయిదాలో విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటును వీరు ప్రస్తావిస్తున్నారే తప్పా, అందులో చదవడానికి వెనకబడిన వారికి ఎలాంటి వెసులుబాటు కల్పిస్తారో మాత్రం వెల్లడించడం లేదు. ఒకవైపు అనువైన ఫీజులు అంటూనే మరోవైపు నచ్చిన రీతిలో ఫీజుల విధానాన్ని రూపొందించుకునే స్వేచ్ఛని ఆయా విశ్వవిద్యాలయాలకు వదిలివేయడమంటేనే ఫీజులు ఏ స్థాయిలో ఉంటాయో అంచనా వేయవచ్చు. దీనిని బట్టి విదేశీ విద్య మొత్తం కార్పోరేట్ కనుసన్నలలో ఉండి వ్యాపారాత్మకంగా మారబోతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి విశ్వవిద్యాలయాల పేరుతో దేశ సంపదను విదేశాలకు అనువుగా మార్చేలా ముసాయిదా ప్రతిపాదనలు ఉండటం విస్తుగొలుపుతుంది. ఓ పక్క దేశంలో ఆయా సంస్థలు స్థాపించే కోర్సుల ఫీజుల వివరాలను 60 రోజుల ముందుగానే వెల్లడించాలని పేర్కొంటూనే మరోపక్క తమ అడ్మిషన్ ప్రక్రియ, ఫీజుల నిర్మాణం, నిధులను వారి విదేశీ మాతృసంస్థకు పంపించే స్వేచ్ఛని కలిగి ఉంటాయని పేర్కొనడం స్వేచ్ఛా వాణిజ్యానికి దోహదం చేసే విధంగా ఉంది.
అప్పుడు వ్యతిరేకించిన వారే
నిజానికి దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతించేందుకు భారత ప్రభుత్వం 1995 నుండి విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందుకు సంబంధించిన తొలి బిల్లును 1995లో తీసుకురాగా అది పలు కారణాలతో ముందుకు కదలలేదు. మళ్ళీ 2005-06 లోనూ ముసాయిదా చట్టాన్ని తీసుకురాగా అది కూడా కేబినెట్ దాకా వెళ్ళి ఆగిపోయింది. చివరగా 2010లో యూపీఏ ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టగా ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడంతో పార్లమెంట్ ఆమోదాన్ని పొందడంలో విఫలమైంది. కానీ నాడు విదేశీ విధానాలను తూర్పారా బట్టి స్వదేశీ జపం చేసి వాటి ఏర్పాటుని వ్యతిరేకించిన భారతీయ జనతా పార్టీ నేడు ఆ బిల్లుపై అత్యంత ఉత్సుకతని ప్రదర్శించడం విడ్డూరంగా ఉంది.
విదేశీ విద్యని భారతదేశ విద్యార్థులకు చేరువ చేయడమే ప్రధాన ఉద్దేశ్యమని నూతన విద్యా విధానం మార్గదర్శకాల ప్రకారం యూజీసీ వెల్లడించినప్పటికి, అది ముమ్మాటికీ సంపన్నుల కోసమే తప్ప, సామాన్యులకు ఒరిగేది ఏమీ లేదు. వీటి ఏర్పాటు ద్వారా సామాజిక న్యాయం అమలు కానేకాదు. అంతేకాకుండా ఆయా విదేశీ విశ్వవిద్యాలయాలు దేశీయ విశ్వవిద్యాలయాలను మరింత దెబ్బతీస్తాయి అనడంలో సందేహం లేదు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుంది. అందువలన బుద్ధిజీవులు యూజీసీ విడుదల చేసిన విదేశీ విశ్వవిద్యాలయాల ముసాయిదా ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ అంతిమంగా విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జె.జె.సి.పి. బాబూరావు
రీసెర్చ్ స్కాలర్,
94933 19690
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు