కట్నం వ్యతిరేకించేవారి కోసం..
For those who oppose dowry.. good platform
సమాజం ఎంతో సంస్కారవంతంగా, నాగరికత కలదిగా మారినట్లు పైకి కనబడుతుంది కాని చాలా దురాచారాల దగ్గర దాని పాలిష్డ్ నేచర్ కనిపిస్తుంది. ఇంత ఎదిగినట్లు కనిపిస్తున్న సమాజంలో తమ అబ్బాయిల పెళ్ళికి కట్నం తీసుకోనివారు, వద్దనుకొనేవారు 10% కూడా ఉండరు. పెళ్లంటే రెండు కుటుంబాలకు సంబంధించింది కదా.. ఖర్చు ఇద్దరం భరిస్తామనేవారు అసలే ఉండరు. ఈ ఆలోచనా ధోరణి నుండి సమాజం బయటకు రావాలి. ఈ విధానాల్ని పెకిలించి వేయడానికి తలో చేయి వేయవలసిన అవసరం ఉంది.
పెళ్లి తంతు పూర్తయ్యాక కట్నకానుకలు సర్దుకునే హడావుడిలో పెళ్ళికొడుకు వాళ్ళుంటే, అన్ని బిల్లులు చెల్లిస్తూ ఖర్చెంత అయిందనే లెక్కల్లో పెళ్లి కూతురు కుటుంబం ఉంటుంది. ఆడపిల్లని సాగనంపే అమ్మాయి తండ్రి అశ్రువుల్లో ఒక్కటైనా పెళ్లి ఖర్చుతో తడిసి ఉంటుంది. దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఈ బాధ తప్పనిదే. అమ్మాయి పుట్టి, పెరుగుతుండగా పెళ్లి ఖర్చు అనేది ఆ కుటుంబం ఆదాయవ్యయాల్లో అడ్డమౌతుంటుంది. పెళ్లి ఖర్చులు మొత్తం అమ్మాయి తరఫునవాళ్లు భరించడమే కాకుండా పైనుంచి వరుడికి కట్నం ఈయడం చాలా కుటుంబాలకు తలకి మించిన భారమే అనాలి.
పెళ్లంటే అమ్మాయి వాళ్లే చేయాలి. అబ్బాయి తరఫునవాళ్లు దర్జాగా పెళ్ళికి వచ్చి తప్పొప్పులు ఎంచడం ఓ ఆనవాయితీగా మారింది. అందుకే మన సమాజంలో ఆస్తులు పోగొట్టుకొని, అప్పులు మిగిల్చుకున్న ఆడపిల్లల తండ్రులు ఎందరో ఉన్నారు. మరో కోణంలో ఈ దురాచారం వల్ల దేశంలో రోజుకు 20 మంది వరకట్న సమస్యతో వచ్చిన కష్టాలను భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల్లో ఉంది. ఆడవారి ఆత్మహత్యల్లో 93 శాతానికి వరకట్న వేధింపులే కారణమట. వీటిలో నేర నిరూపణ జరిగి శిక్ష పడేది 34% కేసులకు మాత్రమేనని కోర్టు రికార్డులు చెప్తున్నాయి.
ప్రతి ఏడాది..
సమాజంలో వరకట్న నిషేధ కృషిలో ఐ డోంట్ వాంట్ డౌరీ డాట్ కామ్ వారి కృషిని మెచ్చుకోవలసిందే. గత 18 ఏళ్లుగా ఆ సంస్థ కట్నం వద్దు అనుకొనే వధూవరుల స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తోంది. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తన పెళ్లి సమయంలో 'ఐ డోంట్ వాంట్ డౌరీ' అని ఖచ్చితంగా చెప్పారట. అదే మాటని లక్ష్యంగా తీసుకోని హైదరాబాద్ కేంద్రంగా వెబ్ సొల్యూషన్స్ వ్యాపారం చేసుకునే ఎన్‌కెజి ఆన్‌లైన్ డాట్ కామ్ అనే సంస్థ 2006 ఏప్రిల్ 2న 'ఐ డోంట్ వాంట్ డౌరీ డాట్ కామ్' అనే మాట్రిమోనియల్ సైట్‌ను రూపొందించింది. అన్ని వధూవరుల పరిచయ వేదికల్లాగే ఈ సైట్లోనూ ఎప్పుడైనా పెళ్లి కావాలనుకునే యువతీయువకులు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. వరకట్నం తీసుకోకపోవడం వీరి ప్రథమ, ప్రధాన నిబంధన. ఆరంభించిన 2 నెలలకే 2000 దాకా రిజిస్ట్రేషన్లు కావడం వీరికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇందులో అమెరికా, ఇంగ్లాండుకు చెందినవారు కూడా ఉన్నారు.
ఈ సత్పలితం ప్రేరణగా వధూవరుల ప్రత్యక్ష పరిచయవేదికగా స్వయంవరం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2006 అక్టోబర్ 15న తొలిసారిగా వరకట్నం కోరని యువతతో 'స్వయంవరం' హైద్రాబాద్ లోని రవీంద్రభారతి హాలులో నిర్వహించారు. ఇలా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ స్వయంవరం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సుమారు ఇరవై వేల సభ్యుల నమోదుతో వందల పెళ్లిళ్లు స్వయంవరం సాధించింది. ప్రతి సమ్మేళనంలోనూ గతంలో జంటలైన వారితో ప్రసంగాలు ఇప్పిస్తారు. మరిన్ని కట్న విరోధ కల్యాణాలకు ప్రోత్సాహం కోసం వారి విజయగాథలను వినిపిస్తారు. కరోనా కారణంగా స్వయంవరంను వాయిదా వేయకుండా 2020లో కార్యక్రమాన్ని జూమ్ విధానంలో నడిపారు. ఆ తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ నెల 23వ తేదీన ఆన్‌లైన్లో జూమ్ యాప్ ద్వారా ఈ నిర్వహణ జరుగుతుంది. ఉదయం10 గంటల నుండి మొదలవుతుంది. ఆసక్తి ఉన్నవారు 98858 10100 కి ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు 'ఐ డోంట్ వాంట్ డౌరీ డాట్ కామ్' వెబ్ సెట్లో చూడవచ్చు. పెళ్లి కుదిరింది అనగానే 'కట్నం ఎంత?' అనే ప్రశ్నను రూపుమాపేందుకు తమ వంతు బాధ్యతను పోషిస్తున్న సత్య నరేష్ బృందానికి అభినందనలు.
- బి.నర్సన్,
94401 28169