నర్సులకు ఆమె ఆదర్శం!

Florence Nightingale is a role model forever!

Update: 2024-05-12 00:30 GMT

వరంగల్ యం.జి.యం.ఆసుపత్రిలో గత పదమూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న నున్న నర్సమ్మ చూడటానికి సాధారణ నర్సింగ్ ఆఫీసర్ మాత్రమే. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆమెతో సంభాషించేటప్పుడు విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఆమె రాత్రికి రాత్రే ఈ స్థాయికి రాలేదు. ఆశయం, పట్టుదల, కఠోర శ్రమ ఫలితంగా ఈ స్థాయికి ‌చేరుకున్నారు.

ఖమ్మం నగరం ఒకటవ డివిజన్ కైకొండాయిగూడెం చెందిన నున్న నర్సమ్మ చిన్నతనంలోనే పోలియో బారిన పడింది. తన ఎడమ కాలుపై పోలియో ప్రభావం తీవ్రంగా చూపింది కానీ ఆత్మ స్థైర్యం కోల్పోలేదు. ఖమ్మం నగరంలోని సెయింట్ మేరీస్ పోలియో హోంలో చేరి విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ సమయంలో సమాజానికి ఏదైనా సేవ చేయాలనే ఆశయంతో నర్సింగ్ వృత్తిని ఎంచుకున్నారు. జనరల్ నర్సింగ్ కోర్సులో చేరి నర్సింగ్ విద్యను అభ్యసించారు.

మొదట ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒప్పంద పద్ధతిలో నర్సింగ్ ఆఫీసర్‌గా ఐదేళ్లపాటు పని చేశారు. ఆ సమయంలో తిర్మలాయపాలెం గ్రామ ప్రజల మన్ననలు పొందారు‌. ఆ తర్వాత 2011 లో శాశ్వత ప్రాతిపదికన వరంగల్ యం.జి.యం.ఆసుపత్రిలో ఉద్యోగం సంపాదించి నర్సింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఆమె అంతటితో ఆగలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగ ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణా దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శిగా కొనసాగుతున్నది. వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేసి 42 జీవో అమలు చేయించారు. ఈమె కృషి ఫలితంగా కొంతమంది నర్సింగ్ ఆఫీసర్లు సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లుగా పదోన్నతులు పొందారు.

నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైనదనీ, ఫ్లారెన్స్ నైటింగేల్ మాత జన్మదిన సందర్భంగా వారి ఆశయాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి యొక్క నర్సింగ్ ఆఫీసర్‌పై ఉన్నదని అన్నారు. ఇటీవల తెలంగాణా ప్రభుత్వం కొన్ని వేల సంఖ్యలో నర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేసిందని, దీంతో కొత్తగా నర్సింగ్ వృత్తిలోకి వచ్చిన కొన్ని వేల మంది, ఫ్లారెన్స్ నైటింగేల్ మాత ఆశయాలు తెలుసుకుని ప్రజలతో మంచి సేవా భావంతో మెలగాలని ఆమె సూచించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని మన తర్వాత వచ్చే జనరేషన్ కూడా ఫ్లారెన్స్ నైటింగేల్ మాత ఆశయాలు, సేవాభావాన్ని కొనసాగించాలని ఆమె నర్సింగ్ సమాజాన్ని కోరారు. (దివ్యాంగ నర్సింగ్ ఆఫీసర్ నున్న నర్సమ్మపై దిశ పత్రిక ప్రత్యేక కథనం..)

(నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం)

కిరణ్

దిశ ప్రతినిధి, వరంగల్

Tags:    

Similar News