మూగబోయిన న్యూస్ రీడర్ స్వరం

Update: 2024-04-06 00:45 GMT

దూరదర్శన్‌లో తొలి తెలుగు న్యూస్ రీడర్, తెలుగు ప్రజలకు వార్తలు టీవీలో చెప్పిన మొదటి వ్యక్తి అయిన శాంతి స్వరూప్. భాష, ఉచ్ఛారణలో స్పష్టత, గంభీరమైన గొంతు, వార్తకు తగ్గట్లుగా అందులో గాంభీర్యాన్ని, ఉద్వేగాన్ని ఒలికిస్తూ వార్తలు చదివే తీరు, వివిధ అంశాలపై వారికున్న అద్భుతమైన అవగాహన వంటి వాటితో తెలుగు వీక్షకులకు చేరువ అయిన శాంతి స్వరూపం ఏప్రిల్ 5న అనారోగ్యంతో కన్నుమూశారు.

‘‘నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు..’’ అంటూ ఏళ్లపాటు అలరించిన ఆ గాత్రం మూగబోయింది. తడబాటు లేకుండా స్పష్టమైన ఉచ్చరణతో ఎప్పుడు విన్నా టక్కున గుర్తు పట్టే స్వరంతో తెలుగు ప్రజలకు ఆయన చేరువ అయ్యారు. రేడియోల శకం ముగిసి, టీవీ వార్తలు మొదలయ్యాక దూరదర్శన్‌లో మొదట్లో సాయంత్రం పూట మాత్రమే వార్తలు ప్రసారం అయ్యేవి. దూరదర్శన్‌లో తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌గా శాంతి స్వరూప్‌కు ఓ గుర్తింపు ఉంది. తెలుగు టీవీ వార్తలకు ఓ ఐకాన్‌గా వారు తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎంతోమంది న్యూస్ రీడర్లకు వారు స్ఫూర్తిగా నిలిచారు.

న్యూస్ రీడర్లకు గురువుగా..

''నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు.. బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ టీ రామారావు ప్రారంభించారు…'' తెలుగు టీవీ చరిత్రలో తొలిసారి ప్రసారమైన వార్తల్లోని ముఖ్యాంశాలు ఇవి. దూరదర్శన్ చానల్ లో సాయంత్రం 7 గంటలకు 1983 నవంబర్ 14వ తేదీన ఈ వార్తల బులిటెన్ ప్రారంభం అయ్యింది. అప్పట్లో ఒక సంచలనం. వాటిని లైవ్‌లో చదివి వినిపించింది, ఇప్పుడు చాలా మంది న్యూస్ రీడర్లు గురువుగా భావించే శాంతి స్వరూప్. జీవన, సాహిత్య సారాన్ని అవపోసన పట్టి యాంకర్ బాధ్యతను సమర్థంగా నిర్వహించారు. 2011లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు. 41 ఏళ్ల క్రితం నవంబర్ 14వ తేదీన ఈ వార్త బులిటెన్ ప్రారంభం అయ్యింది. మొదటి వార్త బులిటెన్ చదవిన శాంతి స్వరూప్ టీవీ చరిత్ర పుటల్లో తన పేరును శాశ్వతంగా నమోదు చేసుకున్నారు.

అప్పుడు ఉన్నది దూరదర్శన్ ఒక్కటే. అందుకే.. ఊరి మొత్తంలో టీవీ ఉన్న ఒకరిద్దరి ఇంటికే అందరూ వెళ్లేవారు. సాయంత్రం 7 గంటలైతే వార్తలు తెలుసుకునేందుకు టీవీలకు అతుక్కుపోయేవారు. ఆ సమయంలో వచ్చే మ్యూజిక్ వింటే చాలు, ఎక్కడున్నా అందరూ పరిగెత్తుకుని వచ్చే వాళ్లు.

ప్రాంప్టర్ లేకుండా..

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ చిన్ననాటనే తండ్రి, ఆ తర్వాత... పెంచి పెద్దచేసిన అన్నయ్య కాలం చేయడంతో కుటుంబ భారం మోసారు. శ్రద్ధాసక్తులతో వార్తలు చదివిన ఆయన 1980లో సహ సీనియర్ యాంకర్ రోజా రాణిని జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. వారిద్దరూ ఐఐటీ చేసి అమెరికాలో స్థిరపడ్డారు.

1977 అక్టోబర్ 23 లోనే లాంఛన ప్రాయంగా హైదరాబాద్ వచ్చిన దూరదర్శన్ ఎదుగుదలను దగ్గరి నుంచి చూసిన శాంతి స్వరూప్ తెలియని నాటి తరం తెలుగు వాళ్ళు బహుశా ఉండరేమో! వార్తలు చదవడం కోసం ఆయన 1978లో ఉద్యోగంలో చేరినా ఆయన వార్తలు చదవడానికి 1983 దాకా వేచి చూడాల్సి వచ్చింది. నాలుగు దశాబ్దాల క్రితం కనీసం టెలీ ప్రాంప్టర్ కూడా లేదు. దీంతో స్క్రిప్ట్ పేపర్లనే బట్టీ పట్టి వార్తలు చెప్పేవారు శాంతి స్వరూప్. వార్తలు ప్రారంభమైన పదేళ్ల పాటు అదే పరిస్థితి. టెలీ ప్రాంప్టర్ లేదు.. ''తప్పులు జరగకుండా చాలా బట్టీ పట్టి వార్తలు చదివే వాడిని.. మిగిలిన వారు అందరూ భయపడ్డారు ఎక్కడ తప్పులు చదువుతానోనని” అంటూ ఆనాటి జ్ఞాపకాలని ఆయన అంటారు. అలా పదేళ్ల పాటు స్క్రిప్ట్‌ పేపర్లతోనే వార్తలు చదువుతూ వచ్చారు.

సాహిత్యంపై ఎంతో పట్టు..

దూరదర్శన్‌లో 2011లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు. చాలా మంది న్యూస్ రీడర్లు శాంతి స్వరూప్‌ను తమ గురువుగా భావిస్తుంటారు. సాహిత్యంపై పట్టున్న శాంతి స్వరూప్‌.. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన మీద ‘‘రాతి మేఘం’ అనే నవల రాశారు. క్రికెట్‌ మీద మక్కువతో ‘క్రేజ్‌’, సతీ సహగమన దురాచారానికి వ్యతిరేకంగా ‘అర్ధాగ్ని’ అనే నవల రాశారాయన. యాంకరింగ్‌లో లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. న్యూస్ రీడర్‌గా లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును కూడా అందుకున్న శాంతి స్వరూప్‌ గుండెపోటుతో హైదారాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2024 ఏప్రిల్ 5న తుదిశ్వాస విడిచారు. ఆయన సహచారిణి రోజారాణి కాలం చేశారు.  అక్షరాలా శాంతి స్వరూపమే అయిన ఈ విశిష్ట వ్యక్తికి నివాళులు !

24 గంటలూ వార్తలు లేవని..

తెలుగులో మొట్ట మొదటి న్యూస్ యాంకర్ అయిన శాంతి స్వరూప్ ఈ మధ్యన పలు టీవీ ఛానళ్లలో దర్శనం ఇస్తూ వచ్చారు. ఎంతో ఉత్సాహంగా ఆయన పలు విషయాలు చెప్పేవారు. అయితే 24/7 పేరిట న్యూస్‌ రంగంలో తర్వాతి కాలంలో వచ్చిన మార్పుల్ని ఆయన స్వాగతించలేకపోయారు. 'వార్తలు చదవకండి.. వార్తలు చెప్పండి..' అని తర్వాతి తరం యాంకర్లకు సూచించారాయన. 24 గంటలూ ఇచ్చే వార్తలు లేవని, అయినా వండి వార్చడం ఘోరంగా తయారయ్యిందని అని ఆయన అంటారు.

(శాంతిస్వరూప్‌కు నివాళి)

మొగిలిచెండు సురేశ్

94408 63723

Tags:    

Similar News