శుభం కార్డు అంచున సినీ సమూహాలు..
గతంలో సాహిత్యంతో పాటు, సినిమా కూడా అత్యంత ప్రభావవంతమైన మాధ్యమమని భావించారు. సినిమాను కేవలం వినోదమూ, వ్యాపార రూపంగానే కాకుండా
గతంలో సాహిత్యంతో పాటు, సినిమా కూడా అత్యంత ప్రభావవంతమైన మాధ్యమమని భావించారు. సినిమాను కేవలం వినోదమూ, వ్యాపార రూపంగానే కాకుండా సామాజిక చైతన్య గమనంలో ఒక మాధ్యమంగా భావించారు. కొంతమంది ఆలోచనాపరులు ఫిలిం సోసైటీలుగా ఏర్పడి దశాబ్దాల పాటు అవిరళ కృషి చేశారు. కానీ ఇవాళ సమాజం, సమూహం, సమిష్టితనం అన్న మాటలకు స్థానం లేకుండా పోయింది. అవన్నీ అపురూపమయిన విషయాలుగా మారిపోయాయి. సామాజిక చైతన్యమూ, దాని కోసం భావసారూప్యం కలిగిన కొంతమంది కలిసి సంఘంగా ఏర్పడే కాలం పోయింది.
ఇప్పుడు లాభాపేక్ష లేకుండా తమ సమయమిచ్చి కృషి చేయడం అరుదయిన అంశాలయి పోయాయి. అభివృద్ధి ప్రపంచీకరణ, నగరీకరణల ఫలితంగా మనుషుల్లో తాము తమ కుటుంబం ఆర్థికంగా ఎదగడం, ఆధునిక వసతులు కల్పించుకోవడం. అవిచ్చే సుఖాలు, సౌకర్యాల పట్లా ఆసక్తి విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో వర్తమాన కాలంలో సమిష్టి తత్వం దాదాపుగా అంతరించిపోవడం అత్యంత విషాదకరం. మిగతా అన్ని సృజనాత్మక రంగాల లాగే ఫిలింసొసైటీలు కూడా దాదాపు అంతరించిపోతున్నాయి. అవన్నీ శుభం కార్డు వేసేందుకు కాగితాల మీద సిద్ధంగా వున్నాయి.
ఇతర దేశాల్లోని ఫిల్మ్ సొసైటీల ప్రభావంతో..
ఫిలిం సొసైటీలు వాస్తవిక, కళాత్మక, అర్థవంతమైన సినిమాలను వీక్షించే గణనీయమైన ప్రేక్షకులను తాయారు చేయడం, ప్రజలలో మంచి సినిమా సంస్కృతిని వ్యాప్తి చేయడం ముఖ్య లక్ష్యాలుగా ఆ రోజుల్లో ఏర్పడ్డాయి. ఆ దిశలో కృషి చేసాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అది ఒక ఉద్యమంగా మూడు నాలుగు దశాబ్దాలపాటు చైతన్య వంతంగా సాగింది. కానీ ఇవ్వాళ పరిస్థితి మొత్తం ఎడారిలా మారిపోయింది. ఈ ఫిల్మ్ సొసైటీలు మొదట్లో రచయితలు, కళాకారులు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ చేత స్థాపించబడ్డాయి. ప్రపంచంలో మొదటి ఫ్రెంచ్ ఫిల్మ్ క్లబ్ 1924లో ప్రారంభించబడింది, ఆ తర్వాత 1925లో లండన్ ఫిల్మ్ సొసైటీ ఏర్పాటయింది.. ప్రొలెటేరియట్ ఫిల్మ్, ఫోటో లీగ్‌లు జపాన్‌లో ప్రారంభమయ్యాయి. ఆ రోజుల్లో చాలా మంది నిర్వాహకులు కూడా డాక్యుమెంటరీ చిత్రాలను నిర్మించారు.. అందులో కొందరు మంచి సినీ విమర్శకులుగా ఎదిగారు.
వివిధ దేశాల్లోని ఫిల్మ్ సొసైటీల ప్రభావంతో భారతదేశంలో మొట్టమొదటి అమెచ్యూర్ ఫిల్మ్ సొసైటీ 22 ఏప్రిల్ 1937న బొంబాయిలో ప్రారంభమైంది. ఇలస్ట్రేటెడ్ వీక్లీకి చెందిన డెరిక్ జెఫెర్సన్, స్టాన్లీ జెప్సన్, ఆర్ట్ క్రిటిక్ వాన్ లాడెన్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ పీ.వీ..పతి సొసైటీ ఏర్పాటులో చొరవ తీసుకున్నారు. అనంతరం 1947లో కల కత్తా ఫిల్మ్ సొసైటీని సత్యజిత్ రే, చిదానంద్ దాస్ గుప్తా, నిమాయ్ గోష్ వంటి లెజెండ్‌లు స్థాపించా రు. ఈ ఉద్యమం భారతదేశంలోని సమాంతర సినిమా నిర్మాణాలపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ ఫిలిం సొసైటీల నుండే సత్యజిత్ రే, నిమాయ్ ఘోష్, మృణాల్‌సేన్, రిత్విక్ ఘటక్, సుబ్రతో మిత్ర, చిదానాద్ దాస్ గుప్తా, అదూర్, బుద్దదేవ్, అరవిందన్ వంటి వ్యక్తులు ఉద్భవించారు. కలకత్తా ఫిల్మ్ సొసైటీ ప్రేరణతో ఢిల్లీ, ఆగ్రా, బొంబాయి, మద్రాస్, ఇతర నగరాల్లో అనేక ఇతర సంఘాలు ఉనికిలోకి వచ్చాయి.
సినిమా బలం తెలుసుకున్నవారు ఉండటంతో..
1952లో బొంబాయిలో జరిగిన మొదటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం భారతీయ సినిమాపై, దాని ఆలోచనా విధానంపై గొప్ప ప్రభావాన్ని చూపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఫిల్మ్ సొసైటీలు సమన్వయం కోసం ఆలోచించాయి. ఏడు ఫిల్మ్ సొసైటీల ప్రతినిధులు 19 59లో సమావేశమయ్యారు. ఢిల్లీలో కృపలానీ ఇంట్లో జరిగిన ఈ సమన్వయ సమావేశంలో సత్య జిత్ రే అధ్యక్షతన ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. ఇందిరా గాంధీ 1967 వరకు దానికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఈ ఫెడరేషన్‌లో విజయ ములే, ఉషా భగత్, ఐ.కె.గుజ్రాల్ ముఖ్యపాత్ర పోషించారు. ఫిలిం సొసైటీ ఉద్యమం దేశమంతటా జరిగింది. ఈ అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉద్యమం ప్రభావం చూపింది. 1970-80లలో రాష్ట్రంలో 70-80 ఫిల్మ్ సొసైటీలు పనిచేసేవి.
1963లో మొదటి ఫిల్మ్ సొసైటీ హైదరాబాద్‌లో హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీగా తర్వాత సినిమా సర్కిల్, ఆర్ఆర్ ల్యాబ్స్‌లో ప్రారంభమైంది. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చైతన్యవంతమయిన ఆలోచనలతో వున్న వాళ్ల నేతృత్వాల్లో ఆ సొసైటీలు కృషి చేసాయి. వాళ్లంతా సినిమా బలాన్ని తెలుసుకున్నవారు. సామాజిక రాజకీయ మార్పును సాధించడంలో దాని పాత్ర గురించి వారికి బాగా తెలుసు. అందుకే వారి కృషి విజయవంతంగా సాగి మూడు ఫిలిం అప్రిసీయేషన్ కోర్సు లు, ఆరు ఫిలిం ఫెస్టివల్స్‌గా అవి సాగాయి. ఆ దిశలో ఫిల్మ్ సొసైటీలు మంచి సినిమా ప్రదర్శన, నిర్మాణం, పంపిణీ ప్రామాణికమైన సినిమా విమర్శలను తమ బాధ్యతగా తీసుకున్నాయి. ఫిల్మ్ సొసైటీ సర్క్యూట్ కోసం సమాంతర ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్‌ని సృష్టించాలని వారు కలలు కన్నారు. ప్రదర్శనకు సంబంధించి అనేక వసతుల కొరత నడుమ కూడా ఫిల్మ్ సొసైటీలు తమ ఉనికిని చాటాయి. ఆనాటి సమాజంలో తమ ఔచిత్యాన్ని నిరూపించాయి. కానీ ఇవ్వాళ పరిస్థితి తారుమారయింది. తరాలు మారి ఆలోచనలు మారి సొసైటీల ఉనికి ప్రశ్నార్థకమైంది.
ఈ పరిస్థితికి కారణం..
నిజానికి ఈ రోజుల్లో సినిమా సమస్తం పెట్టుబడి లాభాలూ అన్న చక్రంలో పడిపోయిన స్థితిలో మంచి అర్థవంతమైన సినిమా అవసరం ఎంతయినా వుంది. ప్రపంచ సినిమాని చూపరులకు అందించాల్సిన అవసరం వుంది. ఆ దిశలో వివిధ కాలేజీ క్యాంపస్‌లల్లో క్యాంపస్ ఫిలిం క్లబ్స్ కూడా ఏర్పాటయ్యాయి. కానీ నిర్వాహకుల్లో ఉదాసీనత, ప్రభుత్వాల నుండి ఎలాంటి సహకారమూ లేని స్థితి. ఇవ్వాల్టి ఫిలిం సొసైటీల స్థితికి ప్రధాన కారణం. ఒకనాడు ఫిలిం సొసైటీల ప్రదర్శనలకు వినోదపు పన్ను మాఫీ చేసిన ప్రబుత్వాలు ఇవ్వాళ వాటి ఉనికిని కూడా గుర్తించలేని స్థితికి చేరుకున్నాయి. ఆ స్థితి మారాల్సిన అవసరం వుంది. నిర్వాహకుల్లో చొరవ పెరగాలి. ముఖ్యంగా కాలేజీ యూనివర్సిటీల్లో కళాత్మకతతో కూడిన క్యాంపస్ ఫిలిం క్లబ్స్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలివ్వాలి. ప్రదర్శనలకు వసతులు వున్నాయి. ఉత్తమ అర్థవంతమైన సినిమాల వైపు విద్యార్థుల్ని మళ్లించగలిగితే అనేక సామాజిక అవలక్షణాల నుంచి వాళ్లను రక్షించిన వాళ్లు అవుతారు. ఈ విషయంలో లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ప్రభుత్వాలూ ఆలోచించాల్సిన అవసరం వుంది.
వారాల ఆనంద్,
పూర్వ కార్యదర్శి, ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం సొసైటీస్ ఆఫ్ ఇండియా
94405 01281