రసవత్తరంగా మహారాష్ట్ర రక్తసంబంధీకుల పోరు..

మహారాష్ట్ర ఎన్నికల్లో కుటుంబ సభ్యులు పరస్పరం ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా నిలిచారు. క్రమంగా శత్రువర్గాలుగా మారారు. వావి వరసలు

Update: 2024-11-15 00:45 GMT

మహారాష్ట్ర ఎన్నికల్లో కుటుంబ సభ్యులు పరస్పరం ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా నిలిచారు. క్రమంగా శత్రువర్గాలుగా మారారు. వావి వరసలు, రక్తసంబంధాలు, గౌరవ మర్యాదలు రాజకీయాల్లో బలాదూర్. కుటుంబ సభ్యులు, అత్యంత సమీప బంధువులు ఒకరిపై ఒకరు పోటీపడుతూ కత్తులు దూస్తు న్నారు. దూషణలు చేసుకుంటున్నారు. అనేక స్థానాల్లో తండ్రీ-కూతురు, భార్యా-భర్త, బాబాయ్-అబ్బాయ్ పరస్పరం వైరి వర్గాలుగా ఎన్నికల రణరంగంలో పరస్పరం ఛాలెంజులు విసు రుతూ బరిలో నిలిచారు. మరికొన్ని చోట్ల వీరు వేర్వేరు పార్టీల నుంచి వేర్వేరు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మొత్తంగా మహారా ష్ట్ర ఎన్నికల్లో రక్తసంబంధికుల పోరు రసవత్తరంగా సాగనుంది.

బారామతిలో పవార్ పాలిటిక్స్..

ఎన్సీపీ అధినేత, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి బారామతిలో పోటీ చేస్తుండగా, ఆయనపై తన సోదరుడి కుమారుడు యుగేంద్ర పవార్ ఎన్సీపీ (శరద్ పవార్) తరపున తొలిసారిగా బరిలో నిలిచారు. ఇప్పటికే అజిత్ పవార్ బారామతిలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. బారామతిలో ఒకే కుటుంబానికి చెందిన అభ్యర్థులు ఇలా ముఖాముఖీ తలపడటం ఇది రెండోసారి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై- అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేసి ఓటమి చెందారు. ఇక పొరుగునే ఉన్న కర్జత్- జంఖేడ్‌లో అజిత్ పవార్ మరో మేనల్లుడు రోహిత్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ) నుంచి బీజేపీకి చెందిన రామ్ షిండేను ఢీకొంటున్నారు.

ఠాక్రేల మధ్య పోరు..

ముంబైలో ఠాక్రే కజిన్‌లు వేర్వేరు సీట్లలో పోటీ చేస్తున్నారు. శివసేన (యూబీటీ) సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే వర్లీ నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. ఆయన తల్లి తరపు బంధువు వరుణ్ సర్దేశాయి బాంద్రాలో రంగంలో ఉన్నారు. అలాగే ఆదిత్య కజిన్ అమిత్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే ముంబైలోని మహిమ్ నుంచి పోటీ చేస్తున్నారు. కాగా గడ్చిరోలి జిల్లాలో అహేరి నియోజకవర్గంలో తండ్రిపై కుమార్తె పోటీ చేస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) తరపున తండ్రి బాబా ఆత్రమ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్ పవార్) తరపున కుమార్తె భాగ్యశ్రీ ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా నిలిచారు. మరోవైపు ఛత్రపతి శంభాజీనగర్‌లోని కన్నడ్ నియోజకవర్గంలో హర్షవర్ధన్ జాదవ్ తన మాజీ భార్య, మాజీ కేంద్రమంత్రి రావ్ సాహెబ్ దాన్వే కుమార్తె, శివసేన అభ్యర్థిని సంజనా జాదవ్ పోటీలో ఉన్నారు. అలాగే సంజనా జాదవ్ సోదరుడు సంతోష్ దాన్వే జాల్నాలోని భూకర్షన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ధీరజ్ దేశముఖ్ కుమారులు అమిత్ దేశముఖ్, ధీరజ్ దేశ్ముఖ్ కాంగ్రెస్ అభ్యర్థులుగా లాతూర్, లాతూర్ రూరల్లో ఉన్నారు. అలాగే మరో మాజీ సీఎం, బీజేపీ ఎంపీ నారాయణ రాణే కుమారులు నితీష్ రాణే, నీలేష్ రాణేలు కుడల్, కన్కవలీలా నుంచి శివసేన, బీజేపీ ఎంఎల్ఏ అభ్యర్థులుగా ఎన్నికల రణరంగ క్షేత్రంలో వైరి వర్గాలుగా నిలిచారు.

బీజేపీలోనూ దాయాదుల పోరే..

మాజీ మంత్రి గణేష్ నాయక్ అయిరోలిలో బీజేపీ నుంచి, ఆయన కుమారుడు సందీప్ సింగ్ బేలాపూర్‌లో ఎన్సీపీ (ఎస్సీ) నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి విజయ్ కుమా ర్ గేవిట్ నందూర్ బర్‌లో బీజేపీ తరఫున, ఆయన కుమార్తె, మాజీ ఎంపీ హీనా గేవిట్ స్వతంత్ర అభ్యర్థిగా అక్కల్కువలో బరిలో నిలిచారు. ఎన్సీపీ మంత్రి చగ్గన్ భుజ్బల్ యెవలాలో పార్టీ తరఫున, అతని మేనల్లుడు, మాజీ ఎంపీ సమీర్ భుజ్బాల్ నంద గావ్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఎన్సీపీ స్టేట్ చీఫ్ జయంత్ పాటిల్ ఇస్లాంపూర్, ఆయన మేనల్లుడు ప్రజాక్తో తాన్పురే రాహురి నుంచి పార్టీ టికెట్లతో పోటీ పడుతున్నారు. బీజేపీ ముంబై అధ్యక్షుడు ఆశిష్ షెలార్ బాంద్రా నుంచి అతని సోదరుడు వినోద్ షెలార్ మలాడ్ వెస్ట్ నుంచి, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి సంతుక్ రావు హంబార్డే పోటీలో ఉండగా, ఆయన సోదరుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్‌రావు హంబార్డే కాంగ్రెస్ నుంచి నాందేడ్ సౌత్ అసెంబ్లీ స్థానంలో రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ వసంత్రారావు చవాన్ మరణంతో నాందేడ్ లోక్‌సభ ఉపఎన్నిక ఈ నెల 20న జరుగుతుంది. గత ఎన్నికల్లోనూ ఈ బంధువర్గాలు పరస్పరం కలహించుకొని కుటుంబ బాంధవ్యాలు, రక్తసంబంధాలు మరచి ఎన్నికల పోరులో, బహిరంగ సభల్లో ఒకరి ఇంటి గుట్టు ఒకరు బయట పడేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తంతు..

ఇప్పుడు వైఎస్‌ఆర్ కుటుంబ సభ్యులు ఆస్తులలో వాటాల కోసం అన్న జగన్, చెల్లి షర్మిలా ఇంటి గుట్టు పత్రికలకూ, ఎలక్ట్రానిక్ మీడియాకు అందిస్తున్నారు. అన్నా, చెల్లి మధ్య ఉండాల్సిన ప్రేమ, అనురాగం అంతరించింది. డబ్బు కోసం ఎక్కడెక్కడ వారి కుటుంబానికి ఎన్నెన్ని రకాల ఆస్తులు ఉన్నాయో వారంతట వారే బయట పెట్టుకుంటున్నారు. వీరిద్దరి మధ్య కన్నతల్లి విజయమ్మ తగువులు తీర్చలేక కుటుంబ పరువు బజారున పడేస్తున్నారు. హీన రాజకీయాల కోసం, తుచ్ఛమైన పదవుల కోసం ఒకరిపై ఒకరు రక్తసంబంధం మరచి ఇంటి పరువు బజారులో పెడుతున్నారు. కుటుంబ ఉమ్మడి పరువు గంగలో కలుస్తుంది.

- డాక్టర్. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Tags:    

Similar News