దొంగ ఓట్ల జాతర, ప్రజాస్వామ్యానికి పాతర...
దొంగ ఓట్ల జాతర, ప్రజాస్వామ్యానికి పాతర... fake voter caught in ap mlc elections
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13న పట్టభద్రులు, స్ధానిక సంస్థలు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగిన శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ, ప్రజాస్వామ్య ఉద్దేశానికి, శాసనమండలి చట్టసభ ప్రాధాన్యతలకు తీవ్ర భంగం కలిగిందని చెప్పవచ్చు. సాక్షాత్తు ముఖ్యమంత్రే గతంలో ఎన్నడూ లేని విధంగా నేరుగా ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వకముందే అభ్యర్థుల ఖరారుతో తన రాజకీయ వ్యూహం మొదలు పెట్టారు. ఆయా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలను బాధ్యులను చేసి వారికి గెలుపు టార్గెట్‌గా నిర్దేశించిన సంగతి తెలిసినదే. అక్కడితో ఆగకుండా ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో బినామీ ఓట్ల చేర్పుల నుండి, నేటి దొంగ ఓట్లు పోలింగ్ వరకు అధికార పక్షం తన అధికారంతో అనేక అవకతవకలకు పాల్పడిన సంఘటనలు కోకొల్లలు. అవకాశం లేని ప్రతిపక్షాలు ఎన్నో ఆందోళనలు, ఎన్నో ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి ఇచ్చినప్పటికీ వారికి కలిగింది ఓదార్పు చర్యలు తప్ప మరేమీ జరగలేదు.
పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, సవరించిన చట్టాలు, నిరంతర నిఘా సంస్థలు, ఓటరు చైతన్యం వెరసి ఇవేమీ బినామీ, దొంగ ఓట్ల చేర్పులు, దొంగ ఓట్ల పోలింగ్‌ను నివారించలేక, నిర్ధారించలేక విఫలమయ్యాయనడానికి ఈ శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రులకు బదులుగా 6, 7, 9 తరగతుల వారిని ఓటర్లుగా నమోదు చేయడాన్ని, ఓటర్లు పోలింగ్ బూత్‌లలో ఒప్పుకున్న సంఘటనలు, వారు ధైర్యంగా ఓటేసిన దృశ్యాలు వివిధ మాధ్యమాలలో చూశాం. అంతే కాకుండా ప్రైవేట్ ఉపాధ్యాయుల పేరుతో అనర్హులను అనుమతించిన అధికారులు దీనిపై ఉన్నత న్యాయ స్థానం చివాట్లు పెట్టినప్పటికీ యధాతథంగా కొనసాగించిన తీరు.
స్థానిక సంస్థల ప్రాతినిధ్యంలో రాజకీయ, ఆర్థిక లాలూచీలతో అక్రమ ఏకగ్రీవాలు... ఇవే కాకుండా క్యాంపులు, విందులు, వినోదాలు, హామీలు, చెల్లింపులతో ఎన్నికలను అంతా తామై వ్యవహరించి అధికార పార్టీ నాయకులు, అధికారులు ధన్యులైనారు.
ఓటు విలువ(ధర), దానికై వెంపర్లాడిన ఓటరు చైతన్యం ఈ ఎన్నికలలో బాగానే విజయవంతమైంది. ముఖ్యంగా ఓటుకు నోట్లు డిమాండ్ చేసి మరీ అందుకున్నారన్న అపవాదును ఉపాధ్యాయులు మూట కట్టుకున్నారు. ఐదునుండి పదివేల దాకా ధర పలికిందన్న ప్రచారం కొనసాగింది. ఇది ఆయా వ్యక్తులకే కాదు ఉపాధ్యాయ వృత్తికి జరిగిన అవమానం. నేటి శాసనమండలి ఎన్నికలను ప్రభుత్వంపై అసంతృప్తి వర్గాలుగా ఉన్న ఉద్యోగులు, నిరుద్యోగులు, స్ధానిక సంస్థలు, ఉపాధ్యాయ వర్గాలు ఒడిస్తాయన్న భయాన్ని అధిగమించి విజయం సాధించాలన్న ధీమాతో ఈ ఎన్నికలను 2024 ఎన్నికలలో విజయానికి ట్రయల్ రన్‌గా ముఖ్యమంత్రి భావించి నిర్వహించిన ఎన్నికలుగా మిగిలిపోయాయి.
ఎన్నికల సరళి పరిశీలిస్తే విజయమే కొలమానంగా అధికార పార్టీ ఎన్నికలను వ్యూహాత్మకంగా నిర్వహించిందని చెప్పవచ్చు. పైగా పాలనా విధానాలపై అసంతృప్తులుగా ఉన్న ఉద్యోగులలో, నిరుద్యోగులలో, ఉపాధ్యాయులలో, స్థానిక సంస్థల ప్రతినిధులలో ఆ కసి కనిపించలేదు. అన్ని వర్గాలు నాటి అసంతృప్తి మరచి, నేటి సంతృప్తి కోసం ఎదురు చూసిన సంఘటనలు దీనికి నిదర్శనాలు. ఓటుకు విలువ (ప్రాధాన్యత)తగ్గినా.. ఓటుకు విలువ(ధర) పెరిగిందన్న చర్చ ఓటర్లలో సాగుతోంది.
ఓటును ఆయుధంగా మార్చుకొని, సామాజిక రక్షణకోసం ఉపయోగించుకోవాలన్న డాక్టర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా ఆయుధం కాదు ఆదాయంగా వాడుకుంటామంటున్న చదువుకున్న ఓటర్ల తీరు భవిష్యత్ సమాజానికి, ప్రజాస్వామ్య ప్రక్రియకు ప్రమాదకరంగా భావించాలి. ఓటు అనే ఆయుధాన్ని సక్రమ మార్గంలో ప్రయోగించకుండా, తాత్కాలిక తైలాలతో, తాయిలాలతో నిరంతరం దాన్ని తుప్పు పట్టిస్తూ... అవసరమైనప్పుడు
తమ కోసమే వినియోగించుకోవడానికి రాజకీయ పార్టీలు, నాయకత్వాలు అలవాటుపడిపోయాయి. ఈ నేపథ్యంలో వీరి కనుసన్నల్లో నడుస్తూ బాధితులుగా ఉన్న మధ్యతరగతి ప్రజలలో మార్పు రానంత కాలం అధికారం ఆ రెండు పార్టీల చేతులు మారుతుంది తప్ప ప్రజల తల రాతలు మారవన్నది ఈ ఎన్నికల సారాంశంగా భావించాలి. దేశం బాగుపడాలన్నా... రాష్ట్రం బాగుపడాలన్నా...మంచి పాలన, పాలకులు అవసరం. వారిని ఎన్నుకొనే ఓటరు ఓటుకు నోటు తీసుకునే అవినీతిలో భాగమౌతూనే మరోవైపు పాలకుల నుంచి నీతివంతమైన పాలన కోసం ఎదురుచూస్తుండడం అమాయకత్వమే అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఓటరు చైతన్యమే...అది సాధ్యమా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
(నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు)
జి. వీరభద్రాచారి
అధ్యక్షులు, గ్రామ స్వరాజ్య సాధన సమితి
63017 96606
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672