ప్రాణాలు ఎగుమతి.. శవాలు దిగుమతి

Update: 2022-04-28 18:45 GMT

భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు కార్మికులను ఎగుమతి చేసి ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నది. కార్మికులు తమ భార్యాబిడ్డలను, తల్లి దండ్రులను, కుటుంబాన్ని, కన్న ఊరును, ఈ దేశాన్ని వదిలి విదేశాలలో ఒంటరిగా జీవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎడబాటుతో బాధపడుతున్నారు. వీరి త్యాగాలు మనం వెలకట్టగలమా? దేశం కోసం ఎడారిలో దిక్కులేనివారిగా చనిపోయిన గల్ఫ్ కార్మికులను 'గల్ఫ్ అమరులు' అని పిలుచుకుందాం అని ప్రవాసీ సంఘాలు అంటున్నాయి. వలస కార్మికులు దేశానికి విరివిగా విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. వీరు ప్రతి నెలా రూ. 1,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్‌కు పంపిస్తున్నారు. దీంతోనే కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నది.

ప్రపంచవ్యాప్తంగా యేటా ఏప్రిల్ 28న 'అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం' జరుపుకుంటారు. విధి నిర్వహణలో చనిపోయిన, గాయపడిన, వికలాంగులైన, అనారోగ్యానికి గురైన కార్మికుల స్మారకార్థం జరిపే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గల్ఫ్ కార్మిక సంఘాలు 'గల్ఫ్ అమరుల దినోత్సవం' గా నిర్వహిస్తున్నాయి. 'చనిపోయినవారిని స్మరించండి- బతికున్నవారి కోసం పోరాడండి' అనే నినాదంతో వలస కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ రికార్డుల ప్రకారం, ప్రతి సంవత్సరం దాదాపు 200 శవపేటికలు గల్ఫ్ దేశాల నుంచి తెలంగాణకు చేరుతున్నాయి.

తెలంగాణ ఏర్పడిన 2 జూన్ 2014 నుండి ఏప్రిల్ 2022 వరకు దాదాపు ఎనిమిదేండ్ల కాలంలో సుమారు 1,600 మంది తెలంగాణ వలస కార్మికుల శవపేటికలు రాష్ట్రానికి చేరుకున్నాయి. బతుకుదెరువు కోసం ఎడారి బాట పట్టిన 15 లక్షల మంది తెలంగాణ గల్ఫ్ వలస కార్మికుల కన్నీటి గాథ ఇది. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని ప్రవాసీ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. జన్మభూమిని వదిలి వలస వెళ్లిన అభాగ్యులు గల్ఫ్ దేశాలలో అసువులు బాస్తున్నారు. శవపేటికల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది. కొందరిని అక్కడే ఖననం చేస్తున్నారు. గల్ఫ్ దేశాల ఆసుపత్రుల మార్చురీలలో వందలాది భారతీయుల మృతదేహాలు మగ్గుతున్నాయి.

స్వరాష్ట్రంలో మొండి చేయి

2007లో యూఏఈ నుంచి వాపస్ వచ్చి అప్పుల బాధతో ఉత్తర తెలంగాణకు చెందిన 29 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. 9 మే 2008న దీనికి సంబంధించి జీఓ నం. 266 జారీ చేసింది. ఆ తర్వాతి కాలంలో గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో చనిపోయిన పేద కార్మికుల కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేయడం ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లాలోని 34 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తూ జీఓ నం.1840 24 ఏప్రిల్ 2013 న జారీ చేసింది. వేలాది మంది గల్ఫ్ దేశాలలో మృతిచెందారు.అప్పటి ప్రభుత్వం 100 మంది లోపే ఎక్స్‌గ్రేషియా ఇచ్చింది.

14 ఏండ్ల క్రితం 2008లో పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో కేసీఆర్ 'తెలంగాణ భూములు అమ్మగా వచ్చిన వేలకోట్ల రూపాయల నుంచి గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి వెంటనే రూ.500 కోట్ల నిధులు కేటాయించాలి. గల్ఫ్ బాధితులుగా మరణించినవారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలి. తెలంగాణ ప్రవాసుల పిల్లలను స్థానికులు గా పరిగణించి, కేరళ ప్రభుత్వం లాగా విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. గల్ఫ్‌లో చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోవడానికి, బాధితులు స్వదేశం రావడానికి మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలి' అని డిమాండ్ చేశారు.

ఒంటరితనం భరించలేక

గల్ఫ్ దేశాలలో భారతీయుల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. మానసిక, వ్యక్తిగత సమస్యలు, అప్పులు, కలలు కల్లలవడం, పనిలో ఒత్తిడి, అధమ స్థాయిలో జీవన పరిస్థితులు, సరిఅయిన వేతనాలు లేకపోవడం, భౌతిక దోపిడీ, మోసం, ద్రవ్యోల్బణం, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, ఒంటరితనం, సమస్యలను భావాలను పంచుకోవడానికి ఒక సర్కిల్ లేకపోవడం, వైవాహిక జీవితానికి దూరం, నిరాశ, మద్యానికి బానిసవడం లాంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కోవిడ్‌కు పూర్వం 2014 నుండి 2019 వరకు ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 33,930 మంది ప్రవాస భారతీయులు మృతి చెందారని ప్రభుత్వం 20 నవంబర్ 2019 న లోక్ సభకు తెలిపింది.

ఆరు గల్ఫ్ దేశాలలో 89 లక్షల మంది భారతీయులు నివసిస్తుండగా, సగటున రోజుకు పదిహేను మంది మృత్యువాత పడుతున్నారు. 2015 నుండి 2019 వరకు 125 దేశాలలో మృతి చెందిన 21,930 మంది మృతదేహాల శవపేటికలను భారత్‌కు తెప్పించామని ప్రభుత్వం 5 ఫిబ్రవరి 2020 న లోక్‌సభకు తెలిపింది. వీటిలో అత్యధికం గల్ఫ్ దేశాల నుంచే వచ్చాయి, కోవిడ్‌తో 4,048 మంది ప్రవాసులు మృతిచెందారని ప్రభుత్వం 3 డిసెంబర్ 2021న లోక్‌సభ‌కు తెలిపింది. ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 3,576 మంది కోవిడ్‌తో చనిపోయారు. విదేశీ ప్రమాదాలలో మరణించిన భారతీయుల వివరాలను 3 డిసెంబర్ 2021 న ప్రభుత్వం లోక్‌సభ‌లో వెల్లడించింది. గత మూడేళ్లలో 63 దేశాలలో 2,384 మంది ప్రమాదాలలో మృతి చెందారు. ఆరు గల్ఫ్ దేశాలలో 1,446 మంది ప్రమాదాలలో మృతి చెందారు.

విదేశీ మారక ద్రవ్యం ఆర్జన ఎక్కువే

భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు కార్మికులను ఎగుమతి చేసి ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నది. కార్మికులు తమ భార్యాబిడ్డలను, తల్లి దండ్రులను, కుటుంబాన్ని, కన్న ఊరును, ఈ దేశాన్ని వదిలి విదేశాలలో ఒంటరిగా జీవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎడబాటుతో బాధపడుతున్నారు. వీరి త్యాగాలు మనం వెలకట్టగలమా? దేశం కోసం ఎడారిలో దిక్కులేనివారిగా చనిపోయిన గల్ఫ్ కార్మికులను 'గల్ఫ్ అమరులు' అని పిలుచుకుందాం అని ప్రవాసీ సంఘాలు అంటున్నాయి. వలస కార్మికులు దేశానికి విరివిగా విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. వీరు ప్రతి నెలా రూ. 1,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్‌కు పంపిస్తున్నారు. దీంతోనే కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నది. కనీసం పది శాతం స్థానిక పన్నులు వసూలయినా నెలకు 150 కోట్ల రూపాయలు తెలంగాణ ఖజానాలోకి జమ అవుతాయి.

ఆ హామీల అమలేది?

ఎన్‌ఆర్‌ఐ పాలసీ, గల్ఫ్ బోర్డు ఏమయ్యాయి? 'బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్' అనే నినాదం మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రజ‌లు చైత‌న్యం కావ‌డానికి ఉపయోగపడింది. విదేశాలలో తెలంగాణీయులను ఒక్కటి చేయడానికి బతుకమ్మ సాంస్కృతిక ఆయుధం అయింది. తెలంగాణ సాధన ఉద్యమంలో వలస కార్మికుల పాత్ర మరువలేనిది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చినంక మర్చిపోయింది. రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ప్రవాసీ మంత్రిత్వ శాఖ ఏర్పడలేదు.

ఉత్తర తెలంగాణాలోని 30 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు గల్ఫ్ ప్రభావిత ప్రాంతాలు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాలలో టీఆర్ఎస్ ఎంపీలు ఓడిపోవడానికి గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఒక కారణం. హామీలను నెరవేర్చకుంటే రాబోయే ఎన్నికలలోనూ టీఆర్ఎస్‌కు గండం తప్పదు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్‌తో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. సమగ్ర ఎన్‌ఆర్‌ఐ విధానం రూపొందించాలి. ఆరోగ్యబీమా, జీవితబీమా, ప్రమాదబీమా, పెన్షన్‌లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి.

మంద భీంరెడ్డి,

వలస వ్యవహారాల విశ్లేషకులు

98494 22622

Tags:    

Similar News