గద్దరన్న, గద్దరన్న
నీ నోటి మాట తూటాలన్న
గళం విప్పితే, ఉద్యమ జ్వాలలు
కలం విప్పితే, అగ్ని గోళాలు
పాదాలకు కట్టిన గజ్జెలె
గల్లు, గల్లుమని గర్జిస్తే
గడీల దొరల గుండెలు కుదేలు ఆయె
బాట ఒకటుందని, బాట ఒకటుందని
దారి చూపిస్తే, బడి పిల్లలెందరో అడివి బాట పట్టె
బుల్లట్టే మార్గమని, బుల్లట్టే మార్గమని
బహుజనులకు విముక్తికి మార్గమంటివి.
అలసి, సొలసి పోయి, అదే బుల్లెట్ వెన్నులో పెట్టుకొని.
అంబేద్కర్ బాట పట్టితివి. బ్యాలెట్ పాట ఎత్తితివి.
వేలు మీద ఓటు చుక్క పెట్టి
నింగిలో వేగు చుక్క వైతివి
నీ గళమే, ఓటు కొరకు గర్జిస్తే
నీ కలమే ఓటు మహత్యం నేర్పిస్తే
ఈరోజు ప్రగతి భవన్లో నీ వాడు ఉండేటోడు.
ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎగేసుకొని వచ్చారు.
లబ్ది కొరకే అధికారిక లాంఛనాలు చేసారు
లేకుంటే కారు చీకట్లో, వాన జల్లులో
ఆ నలుగురు, నలుగురే నీ వెంట ఉండేవారు.
గుర్తొచ్చినప్పుడల్లా నీ పాట వింటాను.
ఓటు బ్రహ్మాస్త్రమని బోధిస్తూ ఉంటాను
డా. బూర నర్సయ్య గౌడ్
మాజీ ఎంపీ