'కర్మ'ఫలాన్ని అనుభవించాల్సిందే!

Everyone has to experience the fruit of karma

Update: 2023-12-10 01:00 GMT

ద్దులు మీరిన అహంభావులను చిత్తుగా ఓడించేది ప్రజలే, ప్రజల తిరుగుబాటుతో ప్రపంచ చరిత్రలో ఎందరో నియంతలను కాలగర్భంలో కలిపేసారు. ఈజిప్ట్‌లో ముబారక్‌కు ఏమైంది.? జర్మనీలో హిట్లర్ ఏమయ్యాడో తెలుసుకోవాలి! మంచికి-చెడుకు, ధర్మానికి- అధర్మానికి, న్యాయానికి- అన్యాయానికి మధ్య జరిగిన ప్రతి యుద్ధంలో మంచి, ధర్మం, న్యాయానిదే గెలుపు. అహంకారానికి, గర్వపోతులకు ప్రజల చేతిలో శృంగ భంగం తప్పదు. అధికార బలంతో, అహంకారంతో విర్రవీగిన నియంత నాయకులెందరినో కాలగర్భంలో కలిపారు ప్రజలు. ప్రతి ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించి నాయకులను తయారు చేసేది ప్రజలే. టక్కు టమార విద్యలు ప్రదర్శించి అధికారంలోకి వచ్చాక అహంకారంతో ఆ ప్రజలనే వంచించే వారిని అధ:పాతాళంలోకి తొక్కేదీ ఆ ప్రజలే. ఉద్యమ ఆకాంక్షలంటే వెంటనడిచింది ప్రజలే,రాష్ట్రం సాధించుకున్నాకా, అన్ని ఎన్నికల్లో గెలిపించింది ప్రజలే..గెలిచాక అదంతా నా బలమే అని విర్రవీగి, ఇచ్చిన హామీలు, త్యాగాలను మరిచి ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకున్న వారిని ఓటు ద్వారా తమ శక్తిని ప్రదర్శించి బండకేసి కొట్టింది ఆ ప్రజలే! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. నియంతలెవరూ విజేతలుగా నిలవలేరు. ధర్మబద్ధంగా, న్యాయ బద్దంగా రాజనీతిజ్ఞతతో పాలించేవారినే ప్రజలు గుర్తుంచుకొంటారని నిరూపించారు.

ఇద్దరిదీ వన్ మ్యాన్ షోనే...

కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నియంతలుగా మారిపోయారు. నియంతృత్వ పోకడల విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా సరికొత్త నిర్వచనం ఇచ్చారు. పూర్వం రాజులు, చక్రవర్తులు వ్యవహరించినట్టుగా కేసీఆర్‌, జగన్‌రెడ్డి వ్యవహరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలదే సర్వాధికారం అనే మౌలిక సూత్రాన్ని విస్మరించి ప్రజలు ఇచ్చిన అధికారంతో విర్రవీగుతూ సర్వభోగాలు అనుభవించారు. తమ రాజ్యాలకు తాము ఒక చక్రవర్తులుగా భావిస్తూ పాలన సాగించారు. నిలువెల్లా నియంతృత్వం నింపుకొన్న ఏ నాయకుడైనా కొన్నాళ్లకు ప్రజలకు దూరమవుతాడు. కేసీఆర్‌, జగన్ రెడ్డిది కూడా ఇంచుమించుగా ఇదే ధోరణి. రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా ఇద్దరూ పరిగణిస్తారు. మంత్రివర్గ సమావేశమైనా, పార్టీ సమావేశమైనా కేసీఆర్‌, జగన్ ఉపన్యాసాలు విని చప్పట్లు కొట్టాల్సిందే. ఇతరులకు తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఇద్దరూ ఇవ్వరు. శాసనసభ్యులు, ఎంపీలు కూడా వారిని ఎప్పుడంటే అప్పుడు కలుసుకోనే అవకాశం లేదు. తనకు మించిన మేధావులు, తమకు మించిన నాయకులు లేరనే అహంకారంతో తప్పొప్పులు తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. అధికార పీఠం దక్కిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని పక్కన పెట్టారు కేసీఆర్. అధికారంలోవున్న తొమ్మిదన్నరేళ్లలో ప్రతిపక్ష నాయకులను కలుసుకోవడానికి కూడా ఇష్టపడలేదు కేసీఆర్.తెలంగాణ కోసం కొట్లాడిన వారిలో అత్యధికులు స్వరాష్ట్రంలో అనాథలయ్యారు. ప్రశ్నించే అవకాశం ఉన్న గొంతులను గడీలో కట్టిపడేసారు కేసీఆర్‌. తన ప్రభుత్వానికి భజన చేయడానికి ఇష్టపడని మీడియా సంస్థలపై,పార్టీలపై,నాయకులపై, ప్రముఖులపై విషం కక్కారు.

పార్టీలనే లేకుండా చేస్తే...

తెలంగాణాలో తన పార్టీ తప్ప మరో పార్టీ ఉండకూడదని, తెలంగాణలో ఏక పార్టీ వ్యవస్థ కోసం ప్రయత్నించారు. 2014లో అధికారంలోకి రాగానే తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలను నిర్వీర్యం చేశారు. 2018 లో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న దుష్ట తలంపుతోనే కాంగ్రెస్‌ పార్టీని చీలికలు పేలికలు చేసి 12 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో విలీనం చేసుకొన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే వారిని తమ పార్టీలోకి లాగేసుకున్నారు. 2014లో తమ చర్యలను విమర్శించిన అప్పటి తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిని శాసనసభలో మాట్లాడకుండా చేశారు. స్వపక్షంలో కూడా తనను ప్రశ్నించే వారు ఉండకూడదన్న ఉద్దేశంతోనే కదా ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి తరిమేశారు. తన ప్రభుత్వాన్ని ఎదిరించిన వారిపైకి పోలీసులను, ఇతర శాఖల అధికారులనూ కేసీఆర్‌ ఉసిగొల్పారు. అరువు తెచ్చుకున్న నాయకులను నమ్ముకొని సొంత పార్టీ నాయకులను తరిమేసుకోవడం వల్లనే కదా? కేసీఆర్‌కు ప్రస్తుత పరిస్థితి. ఎవరైనా అభివృద్ధిలో పోటీ పడతారు. కానీ 2019 ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో సమర్థులను, అభివృద్ధి కారకులను ఓడించి అసమర్ధులను గెలిపించడానికి ఎదురు డబ్బులు ఇచ్చి గెలిపించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకున్నారు. తమ పార్టీ నాయకులను ఆంధ్రప్రదేశ్ పంపి చంద్రబాబుపై ముప్పేట దాడి చేయించి జగన్ రెడ్డికి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీని ఓడించడానికి కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డిన విషయం అందరికి తెలిసిందే. కుళ్ళు రాజకీయంతో ఆంధ్రప్రదేశ్‌పై భస్మాసురహస్తం పెట్టారు. సీమాంధ్రాలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా చేయాలని కేసీఆర్ సర్వ శక్తులు ఒడ్డారు.

నిజమే.. ప్రజలే గెలిచారు

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కాకుండా ప్రజలు గెలవాలని సుద్దులు చెప్పారు కేసీఆర్. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గెలవాలని చెప్పడం కూడా అదే భావనతో చెప్పారు తప్ప ప్రజలపై ప్రేమతో కాదు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలని చెప్పడంలో తప్పులేదు. కానీ 2014 - 2018 ఎన్నికల్లో ప్రజల ఇచ్చిన తీర్పును గౌరవించకుండా చెరబట్టి ప్రజలను కేసీఆర్ స్వయంగా ఓడించి ప్రజల తీర్పుకు అర్థం లేకుండా చేసి ప్రజలను ఓడించారు. 2014 లో 15 మంది తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులను తన పార్టీలో కలిపేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలే గెలవాలని చెబుతున్నారు. కేసీఆర్‌ వంటి నాయకుడు ఉన్నప్పుడు ప్రజలు ఎలా గెలుస్తారు? తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి తానే ముఖ్యమంత్రి కావడం ద్వారా అప్పుడు కూడా ప్రజలను ఆయనే ఓడించారు. కేసీఆర్‌ చేతిలో ప్రజలు అనేక సందర్భాలలో ఓడిపోతూనే వున్నారు. నిరసనలు, ధర్నాల ద్వారా ప్రభుత్వానికి తమ సమస్యలు చెప్పుకొనే అవకాశాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కల్పించగా, కేసీఆర్‌ పాలనలో ధర్నా చౌక్‌ను కూడా ఏకంగా ఎత్తివేసి ప్రజలను ఓడించారు. మిమల్ని గెలిపించిన తెలంగాణా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే హక్కు లేకుండా చేయడం ప్రజలను ఓడించడం కాదా?

ఇంత ప్రజా వ్యతిరేకత ఎందుకు?

తన అడుగులకు మడుగులొత్తని మీడియాను, వేధించి ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు. తనకు వ్యతిరేకంగా రాసే మీడియాను పాతాళంలో పాతరేస్తాను అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన వారిలో కొన్ని కుటుంబాలకే అరకొర సాయం చేస్తూ తన రాజ్య విస్తరణ కోసం తెలంగాణ ప్రజలకు చెందిన వందల కోట్ల సొమ్మును ప్రచారం కోసం ఖర్చు చేశారు. 2014లో ఎన్నికల ఖర్చుల కోసం అప్పులు చేసిన కేసీఆర్‌, ఇప్పుడు తొమ్మిదన్నరేళ్ళు తిరిగేసరికి దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చు భరించగల స్థాయికి ఎదగడం అంటే తెలంగాణ ప్రజల్ని గెలిపించినట్లా? ఓడించినట్లా? ప్రజలకు ప్రాజెక్టులను చూపించి ప్రాజెక్టుల మాటున వేల కోట్ల రూపాయలను కమీషన్లుగా దండుకోవడం అంటే ప్రజలు గెలిచినట్లా? ఓడినట్లా? కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తాను ధర్మకర్తగా ఉంటానని, ప్రజల సొత్తుకు కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన ఇదే కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా వ్యవహరించడం ప్రజలు గెలవడమా? ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావు లేదని గుర్తించి కేసీఆర్‌ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి ఉంటే ఆయన పట్ల, తెలంగాణ సమాజంలో ఇంత వ్యతిరేకత ఏర్పడి ఉండేది కాదు. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడానికి ఆయన అహంభావ పూరిత వైఖరే కారణం. అందుకనే ప్రజలు ఆయనకు వ్యతిరేక తీర్పు ఇచ్చారు. కాబట్టి ఎంతటి వారైనా 'ఖర్మ'ఫలాన్ని అనుభవించాల్సిందే. నియంతలుగా వ్యవహరిస్తున్నవారు తెలంగాణా ఫలితాల తర్వాత అయినా ఆత్మపరిశీలన చేసుకొంటారో లేదో తెలియదు.

- నీరుకొండ ప్రసాద్

98496 25610

Tags:    

Similar News