గత పదేళ్లుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తీరుతెన్నులు పరిశీలిస్తే, అధికార, విపక్షాల మధ్య తెగని గొడవలతో ఉభయసభలు వాయిదాలు పడటంతోనే సరిపెట్టుకున్నాయి. ఒక గంట పార్లమెంటు సమావేశం నిర్వహణకు రూ. 1.5 కోట్లు ఖర్చు అవుతున్న నేపథ్యంలో వరుస వాయిదాలు సభా నిర్వహణను అర్థం లేని తంతుగా మారుస్తున్నాయి. ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బహిష్కరించడం, ప్రతిపక్షాల తీవ్ర నిరసన కారణంగా సభలు వాయిదాలు పడటం.. దీని ఫలితంగా 17వ లోక్‌సభలో 729 ప్రైవేట్ బిల్లులు చాలా వరకు చర్చ లేకుండానే మూలనపడ్డాయి.
'సంభాల్ ఘటన,' 'అదానీ వ్యవహారం'పై చర్చకోసం తాజాగా ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో సభ రోజు తర్వాత రోజు వాయిదా పడుతూ వచ్చింది. పాలనపై, ప్రభుత్వ విధానాలపై చర్చల కోసం ఉద్దేశించిన పార్ల మెంట్ ఇలా వరుస వాయిదాలతో కాలం గడుపుతుంటే రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పడటం ఖాయం. దాంతో పాటు ప్రజలకు ఒరిగేదేమీ ఉండ దని ఉభయ పక్షాలూ గమనించాల్సిన అవసరం ఉంది. అదానీ ముడుపుల వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ జరిపించాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తూ ఈ గురువారం ఉదయం ఉభయ సభల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.'మోడీ-అదానీ ఏక్ హై, అదానీ సేఫ్ హై’ అంటూ నినాదాలు చేస్తూ' ప్రింటెడ్ టీ షర్ట్‌ల'ను ధరించి ఆందోళనా కార్యక్రమం చేపట్టారు. ‘మోడీ-అదానీ భారు భారు’ అని నినాదాలు చేస్తూ పార్లమెంట్ ముందు బైటాయించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ "అదానీపై మోడీ విచారణ జరపలేడనీ, ఎందుకుంటే.. అది మోడీ తనపైన వేసుకునే విచారణగా భావిస్తారని విమర్శించారు.
పార్లమెంట్ ఉన్నది దేనికి?
పార్లమెంటు ఉన్నదే ప్రజల సమస్యలను వివరంగా చర్చించి తగిన బిల్లులను ఆమోదించడం కోసం. గత పదేళ్ల లెక్కలు చూస్తే మొత్తంగా ఉభయ సభలు జరిగిన కాలమే అతి తక్కువ. అందులో అధికార పక్షమే ఎక్కువ సమయం ఉపయోగించుకుంది. ముఖ్యమైన విషయాలపై 'సభా సంఘాలను' వేసి క్షుణ్ణంగా పరిశీలన జరపటం పార్లమెంటరీ సంప్రదాయం. ఆపై చర్చ జరిపి బిల్లులు ఆమోదం పొందటమే ప్రజాస్వామ్యం. అందుకు విరుద్ధంగా జరిగితే అప్రజాస్వామ్యం. సభలో అధికార పక్షానికే కాదు విపక్షాలకు కూడా హక్కులు బాధ్యతలూ ఉన్నాయి. ఇరుపక్షాలు పరస్పరం వ్యక్తిగతంగా నిందలు వేసుకుంటూ, సభలు వాయిదా పడుతూ ఉంటే విలువైన సమయం, ప్రజాధనం వృధా అవుతుంది.
స్పీకర్ నిష్పాక్షికంగా వ్యవహరించాలి!
అధికార పక్షానికి సభలో ఎలాగూ మెజార్టీ ఉంటుంది. కనుక వారు ప్రవేశపెట్టిన ప్రతి బిల్లు పాస్ అవుతుంది. ప్రతిపక్షాల సంఖ్యా బలం ఎలాగూ తక్కువ ఉంటుంది. విపక్ష పార్టీలో ఒకరికో, ఇద్దరికో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇస్తే ఏం పోతుంది? వారు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు అధికార పత్రాలతో సమాధానం ఇవ్వొచ్చు కదా? సభలో ఎవరు ఏం మాట్లాడారు అనేది మీడియాలో ప్రజలు ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తున్నారు. పేపర్లలో వార్తలు, వ్యాసాలు, సంపాదకీయాలు వస్తున్నాయి. టీవిల్లో చర్చలు, ఇతర యూట్యూబ్ వీడియోల్లో వివరంగా విశ్లేషకులు తమ విశ్లేషణలు అందిస్తున్నారు. ఇందులో దాపరికం ఏముంది? స్పీకర్ విపక్షాల ప్రసంగాలను మధ్యలో అడ్డుకోవడం, మైక్‌లు ఆపమని ఆదేశాలు ఇవ్వడం, సభ్యులను మార్షల్స్‌తో బయటకు పంపడం ఎందుకు? ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు.
ప్రధాని మౌనం వీడాలి!
ఇక సభ నాయకుడు ప్రధానమంత్రి మోడీ కీలక బిల్లుల విషయంలో అసలు మాట్లాడకుండా మౌనం వహించడం న్యాయం కాదు. మణిపూర్ మండిపోతున్నా, ఇల్లు, మసీదులు, చర్చీలు తగలబడుతున్నా, హత్యలు, మానభంగాలు జరుగుతున్నా, పోలీసులు కాల్పులు జరుపుతున్నా... దేశ ప్రధానిగా ఆయన ఉలుకూ, పలుకూ లేకపోవడం క్షమించరాని నేరం కాదా? ప్రపంచం అంతా పదేపదే ప్రదక్షిణలు చేసే మోడీ ఒక్కసారి కూడా మణిపూర్ వెళ్లకపోవడానికి కారణం ఏంటి? మణిపూర్ భారతదేశంలో అంత ర్భాగం కాదా? సభకు కారణాలు చెప్పాల్సిన బాధ్యత లేదా? ప్రధాన మంత్రి హోదాలో, సభానాయకుడిగా ప్రభుత్వ పక్షంగా తన వాదన ఎంత సేపైనా వినిపించవచ్చు కదా! ఇక అదానీపై మోడీ మిత్రుడైనంత మాత్రాన అతని వ్యాపార లావాదేవీలపై సభలో చర్చ జరపకూడదా? ఒక వైపు అంతర్జాతీయంగా అదానీ మోసగాడు, లంచాలు ఇచ్చి అవినీతికి పాల్పడ్డాడు అంటూ దేశ, విదేశాల్లో చర్చలు జరుగుతుంటే, అమెరికా న్యాయస్థానం నిర్ధిష్ట ఆధారాలు మోపి, అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే, మరోవైపు దేశం పరువు పోతుంటే.. ఈ దేశ ప్రధానిగా, బాధ్యతతో తన ప్రభుత్వం తరఫున ఏ చర్యలు చేపట్టేది సభకు చెప్పాలి. ఎంతకాలం సమస్యను తేల్చకుండా నానుస్తారు? ఇది నిండు సభను అగౌరవ పరిచినట్లు కాదా?
విపక్షాలూ సభా రూల్స్ పాటించాల్సిందే!
అలాగే విపక్షాలు కూడా సభా నియమాలు తూచా తప్పకుండా పాటించాలి. ప్రతి సభ్యుడు విధిగా క్రమ శిక్షణ పాటించాలి. ఏది మాట్లాడినా కేవలం తనకు కేటాయించిన సీట్లో నిలబడి మాత్రమే మాట్లాడాలి. వెల్‌లోకి దూసుకు రాకూడదు. విషయం ఉన్నప్పుడు సభలో లొల్లి ఎందుకు? గందరగోళం సృష్టించడం ఎందుకు? సభా సమయం, ప్రజాధనం వృధా అవ్వదా? ప్లకార్డులు, నినాదాల టీషర్టులు అవసరమా? సభా నియమాలను ఉల్లంఘిస్తే ప్రజల దృష్టిలో చులకనవుతారు. అందుకే సభా గౌరవాన్ని ఉమ్మడిగా నిలబెట్టి ప్రజల మన్ననలు పొంది ప్రజా స్వామ్యాన్ని నిలబెట్టండి. ప్రజా సమస్యలు పరిష్కరించండి.
డాక్టర్ కోలాహలం రామ్ కిషోర్
98493 28496