ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదేనొక్కి వక్కాణించే మాట, పేద ప్రజల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నవరత్నాలు అమలు చేసి వారి కష్టాలు తీరుస్తున్నామని. ఈ మాటలో నిజమెంత? నిజంగా పేదల వెతలు తీరాయా? అని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు కేంద్ర ప్రాయోజిత పథకాలు తీసుకుందాం. రాష్ట్రాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో కేంద్రం రాష్ట్రాల కిచ్చే ఆర్థిక సాయం (గ్రాంట్ ఇన్ ఎయిడ్) ద్వారా నిర్వహించే కేంద్ర ప్రాయోజిత పథకాలు కీలక భూమిక పోషిస్తాయి. ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను 69 శాతం కేంద్ర ప్రాయోజిత పథకాలకు, 29 శాతం ఫైనాన్స్ కమిషన్ ద్వారా స్థానిక సంస్థలకు, 9 శాతం ఇతర పథకాలకు రాష్ట్రాలు కేటాయించి వాటికి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు జోడించి ఖర్చు చేయాలి. నిజానికి కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కన్నా వైకాపా ప్రభుత్వ హయాంలో కేంద్రం ఇస్తున్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ విశేషంగా పెరిగింది. 2014-18 టీడీపీ పాలన నాలుగేళ్లకు గాను రూ 89,812 కోట్లు (ఐదు సం. లకు రూ 1,09,268 కోట్లు) కేంద్ర నిధులు వస్తే, 2019 నుండి ఇప్పటివరకు వైకాపా పాలనలో నాలుగేళ్లకు రూ 1,53,412, అంటే రూ 63,600 కోట్లు కేంద్ర నిధులు అధికంగా వచ్చినా అమలు తీరు మాత్రం తిరోగమనంలో ఉంది.
ఆ సంక్షేమ పథకాలే నవరత్నాలుగా..
కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను కూడా కలిపి ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు సంబంధించి ఉప ప్రణాళికలు (సబ్ ప్లాన్) తయారు చేసి, దానికి 41 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అనుసంధానం చేసి ఆయా వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు, వారి సాధికారత కోసం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు పాలనలో ప్రతి సంవత్సరం సగటున సుమారు 72 కేంద్ర ప్రాయోజిత పథకాలు పూర్తిగా ఉపయోగించుకుని సగటున ఏడాదికి రూ 21,500 కోట్లు ఖర్చు చేస్తే, వైకాపా పాలనలో 35 కేంద్ర ప్రాయోజిత పథకాలు పూర్తిగా, 26 పథకాలకు రాష్ట్ర వాటా కేటాయించకుండా అసంపూర్తిగా ఉపయోగించుకుని ఏడాదికి సగటున రూ 13,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కొన్ని సందర్భాల్లో పథకాలకు కేటాయించిన నిధుల కంటే అధికంగా ఖర్చు చేసింది నారా చంద్రబాబు ప్రభుత్వం. ఈ విధంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.20 వేల కోట్లు అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేశారు. కానీ సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కేటాయించిన నిధుల వినియోగంలో అనుసరిస్తున్న విధానాల వల్ల నాలుగేళ్లలో రాష్ట్రం దాదాపు రూ.25 వేల కోట్లు నష్టపోయింది.
2014-19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉప ప్రణాళికల కోసం రూ 94,726 కోట్లు కేటాయించి దానిలో 88.75 శాతం ( రూ 84,094 కోట్లు) ఖర్చు చేయగా, వైసీపీ ప్రభుత్వం రూ 1,87,910 కోట్లు కేటాయించి దానిలో 64.65 శాతం (రూ 1,21,475 కోట్లు) మాత్రమే ఖర్చు చేశారు. జనాభా దామాషా ప్రకారం ఏపీలో ఏటా బడ్జెట్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ప్రణాళిక నిధులు కేటాయించి, 40 శాతం సబ్ ప్లాన్ నిధుల్ని ఆయా వర్గాలు నివసించే కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలి. ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తే అక్కడ ఉన్న ఆయా వర్గాల జనాభాను బట్టి నిధుల కేటాయింపు ఉండాలి. గత ప్రభుత్వాలు ఈ రెండు నిబంధనలకు ప్రాధాన్యత ఇచ్చి నిధులు ఖర్చు చేస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీటిని పూర్తిగా పక్కన పెట్టి జనరల్‌గా అందరికి ఇస్తున్న నవరత్న పథకాలకు సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించి బడుగు, బలహీన వర్గాలను దారుణంగా మోసం చేస్తుంది. ఉదాహరణకు బిసి సబ్ ప్లాన్ కు రూ 78,715 కోట్లు ఖర్చు చేస్తే అందులో రూ 75,760 కోట్లు నవరత్నాలకు దారి మళ్లించారు. వైకాపా ప్రభుత్వం గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలనే నవరత్నాలుగా పేరు మార్చి సబ్ ప్లాన్ నిధులను జనాభా ప్రాతిపదికన నవరత్నాలలో ఖర్చు చూపడం వలన ఆయా వర్గాలకు స్వావలంబన ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వీర్యం అయ్యాయి.
స్థానిక సంస్థల నిర్వీర్యం
పంచాయతీలు, పట్టణాల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం 13,14 ఆర్థిక సంఘం నిధులతో పాటు పెర్ఫార్మెన్స్ గ్రాంటును కూడా పొంది నరేగా మెటీరియల్ కాంపోనెంట్ కింద లభ్యమైన రూ.10 వేల కోట్లకు 22 ప్రభుత్వ శాఖల నిధులను కన్వర్జెన్సీ మోడ్‌లో కలుపుకుని రూ 32,121 కోట్లు ఖర్చు చేసి గ్రామీణ ప్రాంతాల్లో 26 వేల కి.మీ సిమెంట్ రోడ్లు, 11,253 కి. మీ గ్రావెల్ రోడ్ల నిర్మాణంతో పాటు అనేక మౌలిక సదుపాయాలు కల్పించడమే కాక, జాతీయ స్థాయిలో అవార్డులు పొందడం జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో నరేగా నిధులను సక్రమంగా వినియోగించుకోలేక పోవడం వలన 2022-23 లో రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన నిధుల్లో భారీ కోత పడింది.14,15 ఆర్థిక సంఘం పంచాయతీలకు ఇచ్చిన రూ 8,549 కోట్లు, పట్టణాలకు ఇచ్చిన రూ 3,451 కోట్ల నిధులను అక్రమంగా దారి మళ్లించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది. కనీస అవసరాలైన తాగునీరు, పారిశుధ్యం అవసరాల కోసం ఆస్తి పన్ను విపరీతంగా పెంచి, చెత్తపై మరుగుదొడ్లపై పన్నులు విధించి ప్రజల నెత్తిన భారం మోపారు జగన్మోహన్ రెడ్డి.
గ్రామీణ భారతంలోని 19.36 కోట్ల గృహాలకు కుళాయి ద్వారా నేరుగా సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు 15,2019 న కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి 50:50 నిధులతో రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో జల్ జీవన్ మిషన్ పథకం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం ప్రారంభించే నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతంలో 3.24 కోట్ల గృహాలకు అంటే 16.72 శాతానికి మాత్రమే కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందుతుంటే, ఆంధ్రప్రదేశ్ లోని 95.69 లక్షల గృహాలకు గాను 30.74 లక్షల గృహాలకు అంటే 32.13 శాతం (దేశ సగటుకు రెండు రెట్లు అధికం) కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందింది. నేటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం అమలు ద్వారా 55.23 శాతం గృహాలకు లబ్ధి చేకూరితే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 34.66 శాతం గృహాలకు మాత్రమే కుళాయి ద్వారా సురక్షిత తాగు నీరు అందుతోంది. పథకం ప్రారంభంలో జాతీయ సగటుకు రెండు రెట్లు అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ పథకం అమలులో జాతీయ స్థాయితో పోలిస్తే బాగా వెనుకబడి పోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం. ఈ పథకం కోసం కేంద్రం తన వాటాగా ఇచ్చిన రూ 7,804.20 లకు రాష్ట్రం తన వాటా నిధులను జోడించకపోగా కేంద్రం ఇచ్చిన నిధులలో కేవలం రూ.1,648.13 మాత్రమే ఖర్చు చేసి మిగిలిన నిధులను దారి మళ్ళించడం ద్వారా అత్యంత ప్రాధాన్యత కలిగిన జల్ జీవన్ మిషన్‌ను విఫలం చేసింది.
సంక్షేమం పడకేస్తుంది
చంద్రబాబు నాయకత్వంలో గత తెలుగుదేశం ప్రభుత్వం కేవలం సంక్షేమమే కాక బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, స్వయం ఉపాధి కోసం అనేక పథకాలకు రూపకల్పన చేసి కార్పొరేషన్ల ద్వారా రాయితీతో కూడిన రుణాలు అందచేసి వారి సాధికారతకు తోడ్పాటు అందించింది. వైసీపీ పాలనలో కార్పొరేషన్‌లకు నిధులు కేటాయించనందు వలన బీసీలకు సంబంధించి 28 పథకాలు, ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు, ఎస్టీ లకు సంబంధించి 28 పథకాలు, మైనారిటీలకు సంబంధించి 10 పథకాలు రద్దయ్యి వారి సాధికారతకు అవరోధం ఏర్పడిందనేది నిష్టుర సత్యం. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగెట్టాలి తప్ప అభివృద్ధిని విస్మరిస్తే సంక్షేమం ఏదో ఒకరోజు పడకేయక తప్పదని జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరగా గ్రహిస్తే రాష్ట్రానికి అంత మేలు.
లింగమనేని శివరామ ప్రసాద్
79813 20543