మార్చి నెల 8వ తేదీ వచ్చింది అంటే చాలు సామాజిక మాధ్యమాలలో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి, పోటీలు పడి మరీ సన్మానాలు, ముగ్గులు, ఆటల పోటీలు, సభలు, సమావేశాలు జరుపుతారు, ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ఒక్కరోజు మహిళల మీద భక్తిభావం పొంగి పోటెత్తుతుంది, పత్రికలూ, టెలివిజన్ చానళ్ళలో రంగుల ప్రపంచంలో మహారాణులు మీరేనంటూ పొగడ్తల జడివాన కురుస్తుంది, తెల్లారిందా అంతా మామూలే. అప్పుడెప్పుడో 1914లో మొదలైన మహిళా దినోత్సవం ప్రహసనంలా కొనసాగుతుందే కానీ, ఆ ఉత్సవాల వెనుకున్న విశాల భావన ఇంకా కలగానే మిగిలిపోయింది.
ఆత్మీయత మాటున మృగత్వం
ఆడది అర్ధరాత్రి నిర్భయంగా తిరగగలిగిన నాడే నిజమైన స్వాతంత్య్రం అని ఎలుగెత్తిన మహానుభావుడే బతికొస్తే, అర్ధరాత్రి కాదు కదా మిట్ట మధ్యాహ్నం కూడా తిరగలేని నేటి దుస్థితిని చూసి గుండె చెరువైపోతాడు. నీడే పామై కరిచినట్లుగా నమ్ముకున్న వాళ్ళే తోడేళ్లైన సంఘటనలు అడుగడుగునా మనల్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఆప్యాయత కుమ్మరిస్తూ తాకే ఆ చేతుల వెనుకున్నది ఆత్మీయతో లేక అవకాశం కోసం ఎదురుచూస్తున్న మృగత్వమో తరచి తరచి నిర్ణయించుకోవలసిన దుస్థితి ఆడపిల్లలకు దాపురించడం మహోన్నత సంస్కృతి మాది అని చెప్పుకునే భారతీయ సమాజానికి సిగ్గుచేటు.
ఆకాశంలో సగం, అన్నింట్లో సగం అని చెప్పుకుంటున్నారే కానీ అణువణువునా అభద్రతాభావం తొణికిసలాడే అమ్మలు, అక్కా చెల్లెళ్ళు మనకు అడుగడుగునా తారసపడుతూనే ఉన్నారు. కార్పొరేటు కార్యదర్శి అయినా, కన్సల్టెన్సీ క్లర్కయినా, చేలల్లో కూలీ అయినా, బడికెళ్లే పసిపాపయినా , రంగుల ప్రపంచంలో ‘భావన’ లైనా, చివరికి పాఠాలు చెప్పే పంతులమ్మలైనా గడప దాటింది మొదలు, ఇల్లు చేరే వరకు అనుక్షణం ఎన్నో వేల కళ్ళు తాము ఆడపిల్లలమని వారికి గుర్తు చేస్తూనే ఉంటాయి. మాటలతో, చేతలతో, కైపెక్కిన చూపులతో, అమాయకత్వపు ముసుగులో కొందరు, అధికారిననే మదంతో ఎందరో కొలతలు వల్లెవేస్తూ కవ్విస్తుంటే ఏమి చేయలేక, బాధను కింది పెదవితో నొక్కి పెట్టి నవ్వును నటిస్తూ అర్ధరాత్రి స్వాత్రంత్ర్యం కోసం పరితపిస్తున్న భరతమాతలు వేలు, లక్షలు, కోట్లలో ఉన్నారు. సామాజిక భద్రత, ఆర్థిక స్వతంత్రం, స్వతంత్ర గుర్తింపు లేకుండా ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకున్నా అది ఆత్మవంచనే అవుతుంది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలు, మహిళల మీద దాడులు మన నిజాయితీని వెక్కిరిస్తూనే ఉన్నాయి.
మార్చి 8... ముగ్గుల పోటీలు
ఆకాశంలో సగం అన్నింట్లో సగం అంటూ గొప్పగా చెబుతున్నా మహిళలకు మనం, మనసమాజం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో మహిళా దినోత్సవం నాడు మనం ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయటంతోనే అర్థమైపోతున్నది. మహిళలు వంటింటికే పరిమితం ఇంటి ముందు ముగ్గులు పెట్టడం, ఇంటి వెనుక బట్టలుతకడం ఇదేవారి జీవిత పరమార్థం అన్నట్లుగా పోటీలు నిర్వహిస్తూ భావితరాలకు మనమిస్తున్న సందేశం ఏంటి చిన్నతనం నుండే ఆడపిల్లల మనసుల్లో మా పాత్ర ఇది, మా పరిధి ఇంతే అని నాటుకునే విధంగా, మగపిల్లల మనసుల్లో ముగ్గులు, ఇంటిపనులు లాంటివి ఆడపిల్లలకే పరిమితం అది మా మగజాతి లక్షణం కాదనే విధంగా జరుపుకుంటున్న మహిళా దినోత్సవ సంబరాలు నిజంగా దురదృష్టకరం.
స్త్రీ విద్యా, ఉద్యోగాల పైన అవగాహన పెంపొందించే ఆలోచనలు, ఆర్థిక స్వావలంబనకు అడుగులు వేసే దిశలో సూచనలు, ఆడవారు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అనే ఆలోచనకు అంకురార్పణ జరుగకుండా ఆదిలోనే తుంచివేసే బాటలో పిల్లల పెంపకం మీద, ఒంటరి మహిళల హక్కుల మీద, గౌరవ మర్యాదల మీద అవగాహన సదస్సులు, పెండ్లి-పిల్లలే జీవిత పరమార్థం కాదు జీవితాన్ని పరిపూర్ణం చేసుకునే దిశలో వ్యక్తిత్వ నిర్మాణం, మానసిక దృఢత్వం సాధించాలంటూ వివిధ రంగాలలో విజయవంతంగా నాయకత్వాన్ని అందిస్తున్న మహిళామణులతో వేదికలను పంచుకోవడం లాంటివి ఏర్పాట్లు చేయవలసిన సందర్భమిది.
తల్లి ఒడిలో నేర్చుకునే నుడికారమే బలం
తరతరాలుగా భారతీయ మహిళలలో అంతర్బాగమైపోయిన ఆత్మన్యూనతా భావం తొలగిపోయే విధంగా కార్యక్రమాలు చేపడుతూ మరోవైపు యుగయుగాలుగా మగవాళ్ళ అంతరంగంలో వటవృక్షంగా ఎదిగిన ‘మేము వేరు’ అనే అహంకారపు మబ్బులు కదిలిపోయే విధంగా పిల్లల పెంపకంనుండే జాగ్రత్తలు తీసుకున్నప్పుడే నిజమైన మహిళా సాధికారత సిద్ధిస్తుంది. నేను బలహీనురాలినని ఆడది అనుకున్నంత కాలం మగవానికి చులకనగానే అగుపిస్తుంది. శారీరక బలహీనతకు మానసిక దృఢత్వం కవచంలా పని చేసినంత కాలం ఏ ఆయుధం మహిళా సంకల్పాన్ని ఛేదించలేదు. అమ్మ ఆలోచన దృఢంగా ఉంటే ఆడపిల్లకు ధైర్యాన్నిస్తుంది, మగపిల్లవాడికి అందరం సమానులమనే చైతన్యాన్నిస్తుంది. బడిలో పాఠాలకన్నా తల్లి ఒడిలో నేర్చుకునే నుడికారం ఎంతో బలంగా పనిచేస్తుంది. ఎవరో మనల్ని గుర్తించడం కాదు, మనమే ఈ సమాజానికి నేర్పించాలి అని ప్రతి తల్లి ప్రతిన పూనిన నాడు నిజమైన మహిళా సాధికారత దిశలో సమాజం ప్రయాణిస్తుంది.
దారి చూపుతున్న కంటిపాపలు
యునైటెడ్ నేషన్స్ ఈ సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చిన పిలుపు డిజిటల్ సాంకేతికతలో ఆవిష్కరణలల్లో లింగ సమానత్వాన్ని పాటించడం. ఒక్కరోజు సభల్లో, సమావేశాల్లో గొంతు చించుకుని వదిలేయకుండా సంవత్సరం పొడుగునా గుర్తుంచుకుంటారని, ఆ మహోన్నత ఆశయాన్ని సాధించే దిశలో ముందడుగు వేస్తారని, వేయాలని ఆశిస్తూ, కని,పెంచి కడవరకూ కంటిపాపలా మాకు దారిని చూపుతున్న మహిళా లోకానికి మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.
చందుపట్ల రమణ కుమార్ రెడ్డి
న్యాయవాది
9440449392