సవాళ్లతో టీ.సర్కార్ సవారీ
సవాళ్లతో టీ.సర్కార్ సవారీ... Eight Years Of Telangana Governament rule, Hits, Misses, And problems
మునుపెన్నటికంటే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కోనున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కత్తిమీద సాములా మారింది. బడ్జెట్‌ను ఏటేటా పెంచుకుంటున్నది. ఆర్థికంగా వృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటున్నది. విద్యుత్, ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచేసింది. మద్యం ధరలకూ రెక్కలొచ్చేశాయి. సర్కారు భూముల్ని అమ్ముకుంటున్నది. అయినా పథకాలకు అవసరమైనంత నిధులు సమకూరడంలేదు. అప్పులు ఎడాపెడా పెరిగిపోయాయి. తలసరి ఆదాయం మరే రాష్ట్రం కంటే ఎక్కువ ఉన్నట్లు గొప్పగా చెప్పుకుంటున్నది. కానీ ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం ఎక్కడి గొంగళి తరహాలోనే మిగిలిపోయాయి.
నాలుగేళ్ళ కాలంలో హామీలు అనేకం అమలుకు నోచుకోలేదు. ఇప్పటికీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల స్కీమ్ గాడిన పడలేదు. అర్హులైన పేద లబ్ధిదారులకు అందలేదు. రైతుల రుణమాఫీ కాగితాలకే పరిమితమైంది. ఒకవైపు రైతు సర్కార్ అని చెప్పుకుంటున్నా అన్ని సబ్సిడీలు అటకెక్కాయి. రైతుబంధు, రైతుబీమా సర్వరోగ నివారిణిగా మారిపోయింది. పంటలు నష్టపోయిన రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రైవేటు రుణభారం పెరిగిపోయింది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది. విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సంక్షేమ హాస్టళ్ళలో సౌకర్యాలు లేక రోడ్డెక్కుతున్నారు.
అటకెక్కిన పథకాలు
నిధులు సమకూరని కారణంతో అనేక పథకాలు ఆగిపోయాయి. దళితబంధు స్కీమ్‌ను విప్లవాత్మకమైనదని గొప్పగా చెప్పుకున్నా ఆశించిన స్థాయిలో అమలుకాలేదు. గతేడాది నిధులను బడ్జెట్‌లో కేటాయించినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేకపోయింది. స్వంత స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకోడానికి మూడు లక్షల సాయం చేస్తామని గతేడాదే హామీ ఇచ్చింది. ఇప్పటికి మార్గదర్శకాలే రూపొందలేదు. హామీలతోనే నాలుగేళ్లుగా కాలం వెళ్ళదీస్తున్నది. బడ్జెట్‌లో కేటాయింపులే తప్ప ఆచరణ శూన్యం. కేంద్రం నుంచి సాయం అందుతుందని, అప్పులు చేసుకోవచ్చని లెక్కలు వేసుకుని ప్రజలకు ఆశలు కల్పించింది. కానీ చివరకు డబ్బులు సమకూరకపోవడంతో అటకెక్కించింది.
మాటలే తప్ప చేతల్లేవని ఇప్పటివరకూ ప్రతిపక్షాలు విమర్శించాయి. కానీ క్రమంగా ప్రజల్లోనూ అదే అభిప్రాయం ఏర్పడింది. ఇందుకు నిదర్శనమే ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు నిలదీయడం. ఇచ్చిన హామీలను అమలుచేయడం లేదనే వ్యతిరేకత క్రమంగా బలపడుతున్నది. దేశానికే ఆదర్శం అని ప్రభుత్వం చెప్పుకునే ధరణి స్కీమ్ సైతం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచింది. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి తగిన ప్లాట్‌ఫారం లేకుండాపోయింది. ప్రభుత్వ సిబ్బంది అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నారనే ముద్రపడింది. ముఖ్యమంత్రికి కలెక్టర్లు సాష్టాంగపడే కొత్త సంస్కృతి తెరపైకి వచ్చింది.
సర్కారుపై సడలుతున్న నమ్మకం
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఒక ప్రహసనంగా మిగిలిపోయింది. ఏడాది క్రితం అసెంబ్లీ వేదికగా సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటివరకు నోటిఫికేషన్లు, ప్రిలిమ్స్, మెయిన్స్. ఇంటర్‌వ్యూలకే సరిపోయింది. ప్రశ్నాపత్రాలు లీకేజీతో కొన్ని పరీక్షలు రద్దయ్యాయి. తిరిగి నిర్వహిస్తామంటూ తేదీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. జరుగుతాయో లేవో అనే అనుమానం ఉండనే ఉన్నది. నోటిఫికేషన్ల పేరుతో ప్రభుత్వం ఆర్భాటం చేసింది తప్ప సంవత్సర కాలంలో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదన్న అసంతృప్తి నిరుద్యోగుల్లో తీవ్రంగానే ఉన్నది. అధికార పార్టీకి వంత పాడేలా సర్కారు సిబ్బంది మారిపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్ఐ మొదలు ఎస్పీ వరకు, తాసీల్దారు మొదలు కలెక్టర్ వరకు పోస్టింగులు, బదిలీలు, పదోన్నతుల కోసం గులాబీ సైన్యంగా తయారయ్యారనే విమర్శలు సరేసరి.
ఇచ్చిన హామీలను అమలుచేయకలేకపోయామంటూ స్వయంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించడం గమనార్హం. డబుల్ ఇండ్లను మంజూరు చేయలేకపోయామని, రైతుల రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయామని ఒప్పుకున్నారు. ఫీజు రీఇంబర్స్‌మెంట్, హాస్టళ్ళలో అరకొర సౌకర్యాలు, దళితబంధు వైఫల్యం, ధరణితో వచ్చిన చిక్కులు.. ఇలాంటివాటిపై మౌనంగానే ఉన్నారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు ప్రభుత్వం నుంచి సమాధానం కరువైంది. ఇకపైన పరిష్కరిస్తుందనే నమ్మకమూ లేదు. అటు అధికార పార్టీ నేతల హామీలను అమలు చేయలేక, వాటికి అవసరమైన నిధులను సమకూర్చుకోలేక, ప్రజల ఆగ్రహాన్ని చవిచూసే సహనం లేక ప్రభుత్వ సిబ్బంది సతమతమవుతున్నారు.
సమస్యల సుడిగుండంలో సర్కారు
ఉద్యోగాల భర్తీ కాకపోగా దానిపైన నమ్మకం పెట్టుకున్న నిరుద్యోగులకు పేపర్ లీకేజీల రూపంలో షాక్ తగిలింది. కేటీఆర్ ఒక మంత్రిగా బాధ్యతతో వ్యవహరించడానికి బదులు రాజకీయ నేతగా స్టేట్‌మెంట్లకే పరిమితమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయాలపై పెట్టిన శ్రద్ధను పరిపాలనపై పెట్టడం లేదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నది. బీఆర్ఎస్ విస్తరణపై ముఖ్యమంత్రి పెట్టిన ఫోకస్‌ను పాలనపై పెడితే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని రైతులపై కురిపిస్తున్న ప్రేమ సొంత రాష్ట్రంలో ఎందుకు లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి వెచ్చిస్తున్న సమయాన్ని ఇక్కడి సమస్యలను పరిష్కరించడంపై ఎందుకు చూపడం లేదనే ప్రశ్నలకూ సమాధానం కరువైంది.
దళితబంధు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం లాంటి చాలా హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. హామీలతోనే కాలం వెళ్ళదీస్తున్నది ప్రభుత్వం. స్కీమ్‌ను లాంచ్ చేసి తూతూమంత్రంగా కొన్నిచోట్ల అమలుచేసి అటకెక్కించింది. క్రెడిట్ పొందడం కోసం, ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ మైలేజీ కోసం అధికార పార్టీ వీటిని గొప్పగా చెప్పుకుంటున్నది. నిధులు లేకపోవడంతో అర్ధంతరంగా ఆగిపోయాయి. విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలు, వెహికల్ టాక్స్, మద్యం ధరలను పెంచినా, సర్కారు భూములను అమ్ముకున్నా స్కీమ్‌లకు సరిపోయేంత రావట్లేదు. చివరకు ఆ స్కీమ్‌లను పక్కకు పెట్టింది. ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితే నెలకొన్నది. వాటి అమలు అనుమానంగా మారింది.
ప్రజల విశ్వాసాన్ని పొందడం సవాలే !
ప్రభుత్వానికి, అధికార పార్టీకి మధ్య విభజన రేఖ చెదిరిపోయింది. ప్రభుత్వమూ, పార్టీ ఒకటేననే అభిప్రాయం స్థిరపడింది. నేతలు ఏ హోదాలో మాట్లాడుతున్నారో స్పష్టత లేకుండాపోయింది. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన పలు హామీలు అమలుకు నోచుకోలేదు. కొన్ని మొక్కుబడిగా లాంచింగ్ అయినా ఆగిపోయాయి. మరికొన్ని కొన్ని ప్రారంభమే కాలేదు. వీటికి సమాధానాలు చెప్పుకోలేక నేతలు దాటవేస్తున్నారు. హామీ ఇవ్వని అనేక పథకాలను అమలు చేస్తున్నామంటూ ఏకరువు పెడుతూ సర్దిచెప్పుకుంటున్నారు. ప్రజల్లో ఆశలు పుట్టించి వాటిని అటకెక్కించిన అధికార పార్టీకి ఈ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో పర్యటిస్తున్న గులాబీ నేతలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజల అసంతృప్తి, ఆగ్రహం ఓట్ల రూపంలో వ్యక్తమైంది.
పేదల సంక్షేమం కోసం స్కీమ్‌లను తెచ్చామని చెప్పుకుంటున్నా అధికార పార్టీ కార్యకర్తలకు, నేతల సన్నిహితులకు మాత్రమే దక్కుతున్నాయన్న అసంతృప్తి సామాన్య ప్రజానీకంలో ఏర్పడింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ప్రజలకు చేరువ కావడం అధికార పార్టీకి అనివార్యమైంది. గతంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు పర్చలేకపోయిందో ప్రజలను సంతృప్తిపర్చేలా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కొత్తగా ఇచ్చే హామీలతో ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. అసలే అరకొర ఆర్థిక నిధులున్నందున ఇప్పటికే ప్రకటించిన హామీలను అమలు చేయడం కత్తిమీద సాములా మారింది. కొత్త హామీలకు నిధుల సమీకరణ శక్తికి మించిన పనే అవుతుంది. ఈ ఎన్నికలు బీఆర్ఎస్‌కు అసలైన పరీక్ష.
ప్రజల తీర్పుపై డైలమా...
తొలి దఫాలో బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్‌తో గట్టెక్కింది. రెండోసారి ఎన్నికల్లో 2018లో అదే సెంటిమెంట్‌ను చంద్రబాబు నాయుడు ఎంట్రీతో అనుకూలంగా మల్చుకున్నది. తొమ్మిదేళ్ళ పాలనలో కేసీఆర్ తీరు ప్రజలకు అవగతమైంది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి కూడా బోధపడింది. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక రూలింగ్ పార్టీ లీడర్లు ఇటీవల ప్రజల ఆగ్రహాన్ని రుచి చూస్తున్నారు. ప్రజలు కాన్వాయ్‌లను అడ్డుకుంటున్నారు. ఇది బీఆర్ఎస్‌కు ఊహించని పరిణామం. ఇంతకాలం తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు ఉన్నది. కానీ ఈ తొమ్మిదేళ్ళలో క్రమంగా అది సన్నగిల్లింది. ఇందుకు ఆ పార్టీ నేతల ఆచరణే కారణం.
ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకకాలంలో కాంగ్రెస్, బీజేపీను ఢీకొనాల్సి వస్తున్నది. అటు పార్టీపరంగా, ఇటు వ్యక్తిగతంగా కేసీఆర్ గతంలో లేని కొత్త చిక్కులను ఎదుర్కోనున్నారు. విపక్షమే లేకుండా చూసుకోవాలని కాంగ్రెస్‌ను సమాధి చేస్తే దానికి పోటీగా బీజేపీ పుట్టుకొచ్చింది. తొమ్మిదేళ్ళ పాలనలోని వైఫల్యాలు రెండు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారాయి. ఒకవైపు ప్రజల నమ్మకాన్ని పొందడం, మరోవైపు ప్రతిపక్షాల ధాటిని తట్టుకోవడం కేసీఆర్‌కు ఛాలెంజ్‌గా మారింది. స్థానిక ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పార్టీకి కూడా అంటుకున్నది. తెలంగాణ పాలనను యావత్తు దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న గులాబీ బాస్ ఇప్పుడు తొమ్మిదేళ్ల పాలనపై ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారోననే డైలమాలో ఉన్నారు.
ఎన్. విశ్వనాథ్
9971482403
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672