సమతా మమతల పర్వం ఈద్ ఉల్ ఫితుర్

Eid-ul-Fitr history and significance

Update: 2024-04-11 00:45 GMT

ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే పర్వదినం ఈదుల్ ఫిత్ర్. దైవం ప్రసాదించిన అనుగ్రహాల్లో ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్హా ప్రముఖమైనవి. ఈ పండుగలు తమ స్వభావం రీత్యా అన్ని పండుగల కన్నా ఉత్తమమైనవి.

ఇస్లాం ప్రకారం ముస్లింలు జరుపుకుంటున్న ఈదుల్ ఫిత్ర్ మొదటిది. రెండవది ఈదుల్ అజ్హా. రమజాన్ ఉపవాసాలు తు.చ తప్పక పాటించమన్న దైవాదేశానికి అనుగుణంగా ముస్లింలు ఉపవాసాలు పాటించగలిగినందుకు, ఆ తాలూకు ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేయడానికి, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోడానికి ఈ పండుగ జరుపుకుంటారు. ఎందుకంటే, దేవుడు మానవులకు అనేక మేళ్లు చేశాడు. రుజుమార్గం చూపాడు. ఏమార్గం మంచిది.. ఏమార్గం చెడ్డది.. మానవుల సాఫల్య వైఫల్యాలు ఎందులో ఉన్నాయి.. వారి ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాలు ఎలా ఉండాలి.. ఏ సూత్రాలు, నియమాలు పాటిస్తే జీవితం సార్థకమవుతుంది.. ఇత్యాది అనేక మార్గదర్శక సూత్రాలను నేర్పడానికే రమజాన్ నెలలో పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు.

దేవుని మన్నింపు లభించే శుభదినం

ఇంతటి మహత్తర గ్రంథం అవతరించిన నెల ఎంత శుభప్రదమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ముస్లింలు పండుగరోజు దేవుని దర్బారులో హాజరై, రమజాన్‌లో ఉపవాసాలు పాటించే శక్తిని, సద్బుద్ధిని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటారు. కేవలం దేవుని ప్రసన్నత పొందడానికి, పరలోకంలో సత్ఫలితాలు సాధించడానికి రంజాన్ నెలంతా పగటిపూట ఉపవాసాలు పాటించి, రాత్రివేళ తరావీహ్ నమాజుల్లో నిలబడి పవిత్ర ఖురాన్ వినగలగడం నిజంగా దైవానుగ్రహమే. ఈదుల్ ఫిత్ర్ దేవుని మన్నింపు లభించే శుభదినం. దాసుడు ఎలాంటి పరిస్థితిలోనైనా సరే పశ్చాత్తాప హృదయంతో ఆయన వైపుకు మళ్ళదలచుకుంటే దైవం అతణ్ణి తన కారుణ్యఛాయలోకి తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక విషయం యదార్ధమని తెలిసినా దానికనుగుణంగా నడుచుకోవడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత దాగి ఉంది.

తప్పులకు క్షమాపణ కోరే రోజు

పండుగ రోజు తప్పులకు క్షమాపణ కోరుకునే రోజు. ఇకముందు తప్పులు చేయబోమని, సత్యమార్గంపై స్థిరంగా ఉంటామని దీక్ష వహించాల్సిన రోజు. కాబట్టి ఈనాటి ప్రార్ధన దైవం మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేదై ఉండాలి. పండుగ శుభ సందర్భంగా ఈ విధంగా మనం సంకల్పం చేసుకుంటే అదే నిజమైన పండుగ అవుతుంది. మానవ జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసే శుభదినం అవుతుంది. పండుగ కంటే ముందు ఫిత్రాలు చెల్లిస్తారు. దీనివల్ల పేద సాదలు కూడా కొత్తబట్టలో, పండుగ సామగ్రో కొనుక్కునే అవకాశం కలుగుతుంది. ముస్లిములు, ముస్లిమేతరులు అన్నబేదభావం లేకుండా సమాజంలోని పేదసాదలపట్ల సంపన్నులు తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవలసిన అవసరాన్ని రమజాన్ గుర్తుచేస్తుంది. అనవసర భోగ విలాసాలకు తమ ధనం వృధా చేయకుండా అగత్యపరులను ఆదుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతుంది. ఉపవాసం పాటించడంవల్ల పేదవాళ్ళ ఆకలి బాధలు అర్ధమవుతాయి. సంపన్నులకు, ముప్పూటలా సుష్టుగా తినేవారికి నిరుపేదల ఆకలి కేకలు వినబడవు. అలాంటి వారు గనక ఉపవాసం పాటించినట్లయితే ఆకలి బాధ ఎలా ఉంటుందో వారికీ తెలుస్తుంది. తద్వారా పేదసాదలను ఆదుకోవడం, వారికి పట్టెడన్నం పెట్టడం ఎంత గొప్ప పుణ్యకార్యమో వారు అనుభవ పూర్వకంగా తెలుసుకోగలుగుతారు.

ఆత్మీయంగా ఆలింగనాలు

ఈద్ రోజు ముస్లింలందరూ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారుచేసిన సేమియా పాయసాన్ని మిత్రులందరికీ ఆప్యాయంగా రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు.'ఈద్ ముబారక్' అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు. ఈ విధంగా ఈదుల్ ఫిత్ర్ పర్వదినం మనిషిని ఒక ఉన్నత మానవీయ విలువలు కలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదరభావాలకు పునాది వేస్తుంది. సమతా మమతలు బోధిస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఇదే ఈదుల్ ఫిత్ర్ రమజాన్ పర్వదిన పరమార్ధం.

(నేడు ఈదుల్ ఫిత్ర్ పర్వదినం సందర్భంగా...)

- ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్

99125 80645

Tags:    

Similar News