ప్రేమ, త్యాగం, భక్తి తోటే ముక్తి

ఈదుల్ అజ్ హా ఒక మహత్తర పర్వదినం.....

Update: 2024-06-16 00:00 GMT

ఈదుల్ అజ్ హా ఒక మహత్తర పర్వదినం. దీన్ని సాధారణంగా బక్రీద్ పండుగ అని వ్యవహరిస్తారు. బక్రీద్ పేరు వినగానే మొట్టమొదట మనకు హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ అలైహిస్సలాంల పేర్లు గుర్తుకొస్తాయి. ఆ మహనీయుల విశ్వాస పటిమ, వారి త్యాగ నిరతి కళ్ళముందు కదలాడుతుంది. ఆ మహనీయుల ఒక్కో ఆచరణను స్మరించుకుంటూ జరుపుకునే పర్వమే ఈదుల్ అజ్ హా.. అదే బక్రీద్. సాధారణంగా పండుగలంటే కేవలం రుచికరమైన పదార్థాలు ఆస్వాదించి, సరదాగా గడిపి, భౌతికంగా పొందే తాత్కాలిక సంతోషం అనుకుంటారు కొంతమంది. కాని అదొక అద్వితీయమైన, అనిర్వచనీయమైన, అలౌకిక ఆత్మానందం. పుణ్యకార్యాలు ఆచరించి అత్యంత శ్రేష్ఠ సామగ్రి అయిన ‘తఖ్వా’(దైవభీతి)ను హృదయాల్లో ప్రతిష్టించుకోవాలి.

సోదర ప్రేమకు నిలువెత్తు సంకేతం

నిజానికి జిల్ హజ్ పదవ తేదీన జరుపుకొనే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. హజ్రత్ ఇబ్రాహీమ్ , హజ్రత్ ఇస్మాయీల్ గార్ల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం. ప్రపంచ విశ్వాసుల పర్వదినం. ఇదేదో షరా మామూలుగా జరిగే ఆచారంకాదు. ఇదొక మహత్తర సందేశం కలిగిన శుభదినం. క్రియా రూపంలో దైవ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత ప్రక్రియ. మనిషి తనను తాను తగ్గించుకొని, వినమ్రపూర్వకంగా అల్లాహ్‌ ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను కీర్తించే గొప్పరోజు. తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాల్సిన రోజు. పర్వదినం మన కిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకు పోకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోకుండా ఏ సంతోషమైనా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు.

నిరుపేదల ఆనందమే ఈద్ లక్ష్యం

ప్రతి ఒక్కరూ తమస్థాయి, స్తోమతకు తగినట్లు ఈద్ జరుపుకుంటారు. ఆర్ధిక స్తోమత ఉన్నవారు జిల్ హజ్జ్ నెలలో 'హజ్ 'యాత్రకు వెళతారు. అంతటి స్తోమత లేనివారు ఇళ్ళవద్దనే ఖుర్బానీలు ఇస్తారు. అదికూడా లేనివారు రెండు రకతుల నమాజ్ ఆచరించినా దయామయుడైన అల్లాహ్ హజ్, ఖుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఆయన తనదాసుల చిత్తశుధ్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. కనుక సర్వకాల సర్వావస్థల్లో చిత్తశుద్ధితో కూడిన సత్కర్మలు ఆచరించాలి. పేదసాదల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారినీ భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ.

పండుగ సందర్భంగా చేసే ప్రతి ఆచరణలో త్యాగ ధనులైన హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల స్పూర్తి తొణికిసలాడాలి. దైవప్రసన్నత కోసం, ఇహ పర సాఫల్యం కోసం వారు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారో, ఎంతటి సహన స్ధయిర్యాలు కనబరిచారో మనం కూడా అలాంటి ప్రయత్నం చెయ్యాలి. సచ్ఛీలత, సదాచారం, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోవాలి. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇది నిస్సందేహంగా కష్టంతో కూడుకున్న కార్యం. కాని, హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల త్యాగాలను స్మరించుకుంటే ఏమాత్రం కష్టంకాదు. మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమయిన, దశలను దాటవలసి ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమయినా వృధా పోదు. చరిత్రే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.

(సోమవారం బక్రీద్ పర్వదినం సందర్భంగా..)


- యండి. ఉస్మాన్ ఖాన్

99125 80645


Similar News