uttarandhra fight: ఉత్తరాంధ్రలో అసలేం జరుగుతోంది?
uttarandhra fight: ఉత్తరాంధ్రలో అసలేం జరుగుతోంది?... editorial on North Andhra neglegency by Konthala ramakrishna
గోదావరి జలాలలో న్యాయమైన నీటి వాటాను కేటాయించాలి, గోదావరితో ఉత్తరాంధ్ర నదులను అనుసంధానం చేయాలి. విశాఖపట్నం రైల్వే జోన్‌ను వెంటనే ప్రకటించాలి. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. విమ్స్ ఆసుపత్రిని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఉత్తరాంధ్రలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్రప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాసంఘాలు, స్టేక్ హోల్డర్స్‌తో ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. ఉత్తరాంధ్ర కవులు, రచయితలు, యువత, కార్మికులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, మేధావులు, ఆలోచనాపరులు సంఘటితం కావాలి. ప్రభుత్వాధినేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి వినతి పత్రాలు అందజేయాలి. అప్పటికీ న్యాయం జరగకపోతే బడ్జెట్ సమావేశాల తరువాత సకలజనులతో కలిసి ఉద్యమాలు చేయడానికి ఉత్తరాంధ్ర చర్చా వేదిక సిద్ధంగా ఉంది.
ఉత్తరాంధ్ర మరోమారు చర్చనీయాంశమౌతోంది. ఎనిమిదేళ్ల కిందటి రాష్ట్ర విభజనతో ఏర్పడిన అవశేషాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ప్రతిపాదించిన ప్రస్తుత ప్రభుత్వం, విశాఖపట్నంలో 'పరిపాలనా రాజధాని' అనడంతో ఉత్తరాంధ్ర మళ్లీ తెర మీదకు వచ్చింది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. అయితే, ఇదొక్కటే సర్వరోగనివారణి (జండూబామ్) కాదు. దీనితో ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ లేదు. నీళ్లు, నిధులు, నియామకాలే ముఖ్యమనే వాదన ఉత్తరాంధ్ర జనవాణిగా ఉంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వీడి ఇక్కడి ప్రజల ఆర్తి వినాలని, వారి సంక్షేమం`అభివృద్ధి పట్ల శ్రద్ధ పెట్టాలని పౌర సమాజం బలంగా కోరుతోంది. కేంద్రం హామీ ఇచ్చినట్టు ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉంటేనో, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ నిజమై ఉంటేనో, ఉత్తరాంధ్ర పరిస్థితి నేడు భిన్నంగా ఉండేది. మాటిచ్చిన కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తరాంధ్ర పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
నాటి నుంచి నేటి దాకా
అవిభక్త ఆంధ్రప్రదేశ్ రోజుల నుంచి, విభజన తర్వాత ఏర్పడిన ఏపీ వరకు పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తున్న ఉత్తరాంధ్ర శ్రేయోభిలాషులు, హితైషులు సమస్యల తీవ్రతను పాలకుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజా సంఘాలతో కలిసి 'ఉత్తరాంధ్ర చర్చా వేదిక' కట్టి దశలవారీగా ఉద్యమించారు. స్థానికంగా వివిధ కార్యక్రమాలతో పాటు దేశరాజధాని ఢిల్లీ బాట పట్టడం వరకు, 2019 ఎన్నికల నాటికి వేర్వేరు రూపాలలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసినప్పుడు, ఇది ఎన్నికల ముందరి హడావుడి అని కొందరు విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల బలమైన ఆకాంక్ష, ఉద్యమకారుల నిబద్ధత చూసిన తర్వాత, విమర్శకులే ఇపుడు గొంతు సవరించుకొని ఉద్యమకారుల బాటలోకి వస్తున్నారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో అదే కూటమి తిరిగి అధికారంలోకి రావటం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలు పరిస్థితులను గమనిస్తూ వస్తున్నారు.
ఉత్తరాంధ్ర ఆకాంక్షల పట్ల శ్రద్ధ గానీ, జనజీవితాలలో ఆశించిన మార్పు తీసుకువచ్చే చొరవ గానీ ప్రస్తుత ప్రభుత్వాలకు లేదని ఈ మూడున్నరేళ్లలో స్పష్టమైంది. మూడు వార్షిక బడ్జెట్లలో శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే! అందుకే మరోమారు ఉత్తరాంధ్ర గడ్డ ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడింది. అన్ని సహజ వనరులూ ఉండి కూడా ఈ ప్రాంతం ఎందుకు వెనుకబాటుతనంలో మగ్గిపోతున్నదో తెలుసుకోవలసిన కీలక తరుణమిది. పాలకుల నిర్లక్ష్యం, వనరుల విధ్వంసం, అభివృద్ధి రాహిత్యం అనే ముప్పేట దాడిని అడ్డుకోవడానికి కనీసం చెయ్యి అడ్డుపెట్టవలసిన బాధ్యత ఉత్తరాంధ్ర బిడ్డలుగా మనందరిదీ. మన ప్రాంత ప్రజల న్యాయమైన వాటా కోసం గొంతెత్తి, పాలకులను నిలదీయవలసిన ముఖ్యమైన సమయమిది.
దక్కని న్యాయమైన వాటా
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు కలిగిన ఉత్తరాంధ్ర విస్తీర్ణం 23,537 చ.కి.మీ. (ఏపీ విస్తీర్ణంలో 15 శాతం). దాదాపు ఒక కోటి జనాభా ఉంది. (ఏపీ జనాభాలో 19 శాతం). ఉత్తరాంధ్ర కేవలం విస్తీర్ణం, జనసంఖ్య వల్ల మాత్రమే కాకుండా, పుష్కలమైన జల, ఖనిజ, అటవీ వనరులతో, మానవ వనరులతో అభివృద్ధి పథంలో అగ్రభాగాన ఉండవలసిన స్థితి. పాలకుల నిర్లక్ష్యంతో తనకు న్యాయంగా రావలసిన వాటా కూడా దక్కని దుస్థితిలో ఉంది. ఇదే పరిస్థితులలో తెలంగాణ ప్రజలు ఉద్యమించినప్పుడు, కేంద్రం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్(justice sri krishna commission) ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని గణాంకాలతో సహా చూపింది. రాష్ట్ర విభజన సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని, ప్రత్యేక ప్యాకేజీలో నిర్దిష్ట కేటాయింపులు చేస్తామని పాలకులు నమ్మబలికారు. గడిచిన ఎనిమిదేళ్లలో పరిస్థితి ఇంకా దిగజారింది.
ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఆకాంక్షలన్నీ నెరవేరే దిశగా ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ ప్రాంతపు రాజకీయ నాయకుల, విద్యావంతుల, యువజనుల, విద్యార్థుల, ప్రజలందరి బాధ్యత. నదులు, అడవులు, సముద్ర తీరం, ఖనిజ సంపద, జాతీయ రైలు, రహదారి మార్గాలు, ఓడరేవు, విమానాశ్రయం, అపార మానవ శ్రమశక్తి, అన్నిటికన్ని మించి మానవ వనరులూ పుష్కలంగా ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. ఇతర ప్రాంతాల వారు ఆ వనరులను కొల్లగొట్టుకుపోతుంటే అరికట్టే పాలనా విధానాలు లేవు. కనుక 'మా వనరులను మా అభివృద్ధికే వెచ్చించాలి' 'మా వనరులు కొల్లగొట్టడానికి ఇతరులకు హక్కు లేదు' అని ఇవాళ ఉత్తరాంధ్ర జనం నినదించాల్సిన అవసరం వచ్చింది.
సాగు నీరు కూడా కరువే
ఉత్తరాంధ్ర ప్రధాన ఆకాంక్ష జల వనరుల గురించి. బాహుదా, మహేంద్ర తనయ, వంశధార, నాగావళి, పెద్ద గెడ్డ, కందివలస గెడ్డ, చంపావతి, జంఝావతి, సీలేరు, శబరి, గోస్తని, నర్వ గెడ్డ, శారద, వరాహ, తాండవ, వేగవతి వంటి జీవ నదులతో పాటు అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఉత్తరాంధ్రలో వ్యవసాయానికి నీటి పారుదల సౌకర్యాలు కనీస స్థాయిలో కూడా లేవు. దాదాపు 58 లక్షల ఎకరాలలో 24 లక్షల ఎకరాలు సాగుకు అనుకూలం. ప్రస్తుతం అందులో ఎనిమిది లక్షల ఎకరాలకు కూడా సాగునీటి పారుదల సౌకర్యం లేదు. ఎప్పటినుంచో పాలకులు ఆశ చూపుతున్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కల నెరవేరలేదు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలోను ఆదివాసీ ప్రాంతాలున్నాయి. వారి అభివృద్ధికి 2012 'అరకు డిక్లరేషన్' సూచించిన అభివృద్ధి పథకాలు ఇంతవరకూ అమలులోకి రాలేదు.
ఆదివాసీ ప్రాంతాల అస్తిత్వాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టడం, 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ అన్యాక్రాంతమైన ఆదివాసీల భూములను తిరిగి వారికి అప్పగించడం, రాజ్యాంగం 73, 74 సవరణల ప్రకారం, పంచాయతీ రాజ్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం(PESA Act) ప్రకారం ఆదివాసీ ప్రాంతాలలో పంచాయతీ పాలనను ప్రవేశపెట్టడం, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం, బాక్సైట్ తవ్వకాలను ఆపివేయడం వంటి ఎన్నో డిమాండ్లను వారు ముందుకు తెస్తున్నారు. ఉత్తరాంధ్రలో మరొక పెద్ద ప్రజాసమూహం సముద్రం మీద ఆధారపడిన మత్స్యకారులు, ఇతరవర్గాలు. ఉత్తరాంధ్రకు 340 కి మీ సముద్రతీరం ఉన్నందున మత్స్యకారులకు చట్టబద్ధ హక్కులు కల్పించాలి. ఫిష్ ప్రాసెసింగ్ పరిశ్రమలను, కోల్డ్ స్టోరేజీలను స్థాపించాలి.
పడకేసిన విద్యారంగం
విద్యారంగంలోనూ ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉంది. తాజా గణాంకాల ప్రకారం మూడు జిల్లాలూ రాష్ట్ర సగటు కన్న తక్కువ అక్షరాస్యతతో ఉన్నాయి. 19 శతాబ్ది చివరికే విద్యల నగరంగా ఉండిన విజయనగరం 21 శతాబ్దిలో అక్షరాస్యతలో చివరికి చేరడం విచారకరం. ప్రాథమిక ఆరోగ్యం, పర్యాటక రంగం, విద్యుచ్ఛక్తి, రవాణా, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, వలసలు, పాలన, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, పారిశుధ్యం, పర్యావరణం వంటి ఏ రంగాన్ని తీసుకుని పరిశీలించినా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత 20 సంవత్సరాలుగా అమలైన ప్రజా వ్యతిరేక, బహుళజాతి సంస్థల అనుకూల అభివృద్ధి నమూనా ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా అమలై, ఇక్కడి ప్రజల జీవితాల మీద గొడ్డలిపెట్టు అయింది.
ఇక్కడి సంపన్న సహజ వనరులను కొల్లగొట్టడానికి పాలకులు అభివృద్ధి మాయాజాలాన్ని ఉపయోగించారు. చివరికి ఉత్తరాంధ్ర ప్రజలకు మిగిలినది కాలుష్యం, జీవన విధ్వంసం, పర్యావరణ విఘాతం. కాకరాపల్లి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి విజయం సాధించిన ఘన చరిత్ర కూడా ఉత్తరాంధ్ర ప్రజలదే. అదే స్ఫూర్తి కోసం ఉత్తరాంధ్ర మరోసారి ఎదురుచూస్తోంది. ఉత్తరాంధ్రలో సహకార రంగంలో వున్న 5 షుగర్ ఫ్యాక్టరీలు, 14 ఝూట్ మిల్లులు మూతపడ్డాయి. దీంతో అనేక మంది రోడ్డున పడ్డారు. చిత్తశుద్ధి ఉంటే వీటిని తెరిపించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి.
అందరూ ఏకం కావాలి
'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' పేరిట ఉద్యమించి, ప్రాణత్యాగం చేసి, భూములను ఇచ్చి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సాధించారు. దీనిని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా ఒక తాటిపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర గత 200 సంవత్సరాలుగా తెలుగులో ఆధునిక సాహిత్యానికి అగ్రగామిగా, చుక్కానిగా నిలిచింది. సినిమాలలో, ప్రచార మాధ్యమాలలో ఉత్తరాంధ్ర భాషను కించపరిచే వైఖరి ప్రబలుతున్నది. ఉత్తరాంధ్ర సంస్కృతికి, సాహిత్యానికి, భాషకు, చరిత్రకు సముచిత గౌరవం దక్కాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలి. ఉత్తరాంధ్ర ప్రజల, రాజకీయ పక్షాల, ప్రజా సంఘాల ప్రతినిధులను ఈ మండలిలో భాగం చేయాలి.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014, సెక్షన్ 46 (3) లో నిర్దేశించినట్టుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిని ప్రకటించాలి. అది ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌లో కనీసం 15 శాతం నుంచి 20 శాతం ఉండాలి. అంటే రూ. 2.24 లక్షల కోట్ల 2020-21 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రకారం ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ రు. 33,000 కోట్ల నుంచి రూ. 44,000 కోట్లు ఉండాలి. ఉద్యమ సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కో జిల్లాకు కేవలం 50 కోట్లు కేటాయించి బీజేపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఉత్తరాంధ్ర, రాయలసీమకు బుందేల్‌ఖండ్, బోలంగీర్-కలహండి- కోరాపుట్ తరహా ప్యాకేజీని వెంటనే ప్రకటించాలి. ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల రాయితీలతో కూడిన ప్రత్యేక హోదాను ప్రకటించాలి.
ఉద్యమాలకు సిద్ధం
ఉత్తరాంధ్రలోని 24 లక్షల ఎకరాలకు సాగునీరు సదుపాయం కల్పించాలి. సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలి. గోదావరి జలాలలో న్యాయమైన నీటి వాటాను కేటాయించాలి, గోదావరితో ఉత్తరాంధ్ర నదులను అనుసంధానం చేయాలి. విశాఖపట్నం రైల్వే జోన్‌ను వెంటనే ప్రకటించాలి. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. విమ్స్ ఆసుపత్రిని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఉత్తరాంధ్రలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్రప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.
ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాసంఘాలు, స్టేక్ హోల్డర్స్‌తో ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. ఉత్తరాంధ్ర కవులు, రచయితలు, యువత, కార్మికులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, మేధావులు, ఆలోచనాపరులు సంఘటితం కావాలి. ప్రభుత్వాధినేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి వినతి పత్రాలు అందజేయాలి. అప్పటికీ న్యాయం జరగకపోతే బడ్జెట్ సమావేశాల తరువాత సకలజనులతో కలిసి ఉద్యమాలు చేయడానికి ఉత్తరాంధ్ర చర్చా వేదిక సిద్ధంగా ఉంది.
కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ
కన్వీనర్, ఉత్తరాంధ్ర చర్చావేదిక
konathalaramkrishna1957@gmail.com
బిశెట్టి బాబ్జి
అధ్యక్షులు, ఏపీ లోక్‌సత్తా పార్టీ
కో-కన్వీనర్, ఉత్తరాంధ్ర చర్చావేదిక
Read More...