దుబ్బాక దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి గూర్చి తెలుసా!
విప్లవోద్యమ వీరులకు పురిటి గడ్డ లాంటిది దుబ్బాక. ఎందరో ఉద్యమవీరులు దుబ్బాక మట్టి పరిమళంలో జన్మించారు. అలాంటి వారిలో సోలిపేట రామలింగారెడ్డి
విప్లవోద్యమ వీరులకు పురిటి గడ్డ లాంటిది దుబ్బాక. ఎందరో ఉద్యమవీరులు దుబ్బాక మట్టి పరిమళంలో జన్మించారు. అలాంటి వారిలో సోలిపేట రామలింగారెడ్డి ఒకరు. తాడిత, పీడిత ప్రజల ఉద్యమ వేగు చుక్క రామలింగన్న. నిత్యం ప్రజల కోసం తపన పడేవారు. అన్నతో నా పరిచయం 90వ దశకం నుంచే. దుబ్బాక నియోజకవర్గం పీపుల్స్‌వార్‌కు పెట్టని కోటగా ఉండేది. ఈ ప్రాంతంలో నిత్యం యుద్ధ వాతావరణం ఉండేది. పోలీసులు, నక్సల్స్ పరస్పర కాల్పులతో, బూటకపు ఎన్‌కౌంటర్‌లతో, అమరవీరులగన్న తల్లుల వలపోతలతో తల్లడిల్లేది. అయినా, ఎందరో వీరులు తాడిత పీడిత ప్రజల కోసం తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. రామలింగన్న ఎన్నో విప్లవోద్యమాలకు వెన్నెముకలా నిలిచారు.
ప్రతి గ్రామంలో అన్నకు సైన్యం ఉండేది. మంజీరా రచయితల సంఘం, పౌరహక్కుల సంఘం, దళిత, మహిళ సంఘాలతో ఎన్నో ప్రజా ఉద్యమాలను సృష్టించారు. జర్నలిస్టుగానూ అండగా నిలిచారు. ఎన్నో నిర్బంధాలను దాటుకుంటూ వచ్చారు. నిజాలను నిగ్గు తేల్చారు. నక్సల్స్‌కు సహకరిస్తున్నారని ఆయనను పోలీసులు టాడా కేసులో జైలుపాలు చేశారు. జర్నలిస్టు సంఘం నేతలు కె.శ్రీనివాస్ రెడ్డి, దేవులపల్లి అమర్, శ్రీరామచంద్రమూర్తి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపడంతో విడుదల చేశారు. మొదటి టాడా కేసు ఎదుర్కొన్న ఉద్యమ నేత లింగన్న.
పోరుబాటలోనే జీవితం
నేను 'ఉషోదయం' దినపత్రికలో విలేఖరిగా చేరిన సమయంలో అప్పటి జర్నలిస్టుల సంఘం నేతగా ఉన్న లింగన్న ఆశీస్సులు తీసుకున్న. ఇక అప్పటి నుంచి అన్నతోనే నా ప్రయాణం. ఆయనకు కుడి భుజంగా జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ ఉండేవారు. వీరిద్దరూ మెదక్ జిల్లాలో కృష్ణార్జునులుగా వీరోచిత పోరాటాలు చేశారు. అప్పుడు మెదక్ శాఖ రాష్ట్ర జర్నలిస్టుల సంఘానికి మార్గదర్శకంగా ఉండేది. లింగన్న సిద్దిపేట 'వార్త' స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న సమయంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పుడు జరిగిన చర్చలలో రామలింగన్న ప్రధాన భాగస్వామి. సలహాలు, సూచనలు ఇచ్చారు. సిద్ధిపేట జర్నలిస్టులకు కేసీఆర్, హరీశ్‌రావు కృషితో ఇండ్ల స్థలాలు ఇప్పించిన ఘనత లింగన్నది.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమకారులుగా లింగన్నతో కలిసి ఎన్నో పోరాటాలలో, సమావేశాలలో పాలుపంచుకున్నాం. కేసీఆర్ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలో పోటీ చేస్తే సార్ కోసం ఊరూరా ప్రచారం నిర్వహించాం. కేసీఆర్ 58వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె వంటి వాటిలో కేసీఆర్‌కు అండగా ఉన్నాం. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండేవారు లింగన్న.
విరాహత్ అలీ అన్న, అంజయ్య సార్, రంగాచారి అన్న, సత్యనారాయణ రెడ్డి అన్న, కూతురు రాజన్న, రవిచంద్రన్న, లింగాల రాజలింగన్న, నేను, పాండన్న, పాల రాజన్న బబ్బూరి రాజన్న, కంది సీనన్న, పైజల్ అన్న, చిట్టాపూర్ సుభాష్, మధుకర్, మెంగర్తి సుధాకర్, శివన్న, ఎల్లారెడ్డి, యాదవరెడ్డి, చంద్రమౌళి, పరమేశ్వర్, రవన్న, తోగుట శీను, సంజీవరెడ్డి, కొల్పుల శీను, లక్ష్మారెడ్డి అందరమూ కలిసి కోరడంతో 2008లో లింగన్నకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. గెలిచాక, ఉద్యమం కోసం రాజీనామా చేసి మరోసారి గెలిచారు.
ఉద్యమాలే ఊపిరిగా
2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడంతో సిద్దిపేటలో ఉద్యమ జ్వాల రగిలించడంలో కీలక పాత్ర పోషించారు లింగన్న. తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికలలో 2014, 2018 లింగన్న దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సిద్దిపేట జిల్లా జలాశయాలతో అభివృద్ధి చేయబడింది. తన నియోజకవర్గంలో మల్లన్నసాగర్ పూర్తయ్యే దశలో రామలింగన్న మరణం దురదృష్టకరం. తన ఆరోగ్యం లెక్కచేయకుండా నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే లింగన్న అకస్మికంగా మరణించడం ఎందరి హృదయాలనో కదిలించింది. ఉద్యమకారుడిగా, జర్నలిస్ట్‌గా, ప్రజా నేతగా దుబ్బాక నియోజకవర్గ ప్రజల గుండెలలో చెరగని ముద్ర అన్నది. 'నాకు తమ్ముళ్లు లేరు, మీరే నాకు తమ్ముళ్లు' అనేవారు. లింగన్న ఆశయాలను కొనసాగించాలి.
(నేడు రామలింగారెడ్డి వర్థంతి)
చిటుకుల మైసారెడ్డి
జర్నలిస్ట్, కాలమిస్ట్
సిద్దిపేట. 94905 24724