Hyderabad Book Fair: రారండోయ్ పుస్తకాల పండుగకి
Hyderabad Book Fair: రారండోయ్ పుస్తకాల పండుగకి... editorial on books occasion of hyderabad book fair
సాహిత్యానికి ఎల్లలు లేవు. భక్తి నుంచి విప్లవం దాకా అన్నీ ఆ సముద్రంలోని అలలే. ప్రతి మనిషి తమ అభిరుచి, ఆసక్తి మేరకు పుస్తకాలు లభ్యమవుతాయి. నచ్చిన అంశాలపై పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాక కూడా 'తెలుగువాడు పుస్తకాలు కొనడు..చదువడు' అనే నిందని మోసే బదులు ప్రతి ఒక్కరు ఈ నెల తమ ఆదాయంలోంచి పది శాతం బుక్ ఫెయిర్ లో పుస్తకాలు కొనుగోలుకు కేటాయించండి. బుక్ ఫెయిర్ సందర్శకులందరూ కనీసం వెయ్యి రూపాయల పుస్తకాలు కొనాల్సిందే అని తీర్మానించుకోండి. పుస్తకం చదివి బావుంటే లేదా నచ్చకపోతే నాలుగు మాటలు రచయితతో పంచుకోండి. తెలుగు పుస్తకాన్ని బతికించడం రచయితల చేతిలో కాదు, పాఠకుల ఆదరణతో ఉంది. అందుకే చెయ్యెత్తి పుస్తకాన్ని జైకొట్టు తెలుగోడా..
పుస్తకప్రియులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. 'హైదరాబాద్ బుక్ ఫెయిర్'(hyderabad book fair) పుస్తకాల జాతర నగరంలో గురువారం మళ్లీ కొలువుదీరింది. నెల రోజుల క్రితం నుండే రకరకాల పుస్తకాలు విడుదలపై రచయితల, ప్రచురణ సంస్థల నుండి కలర్‌ఫుల్ టీజర్లు విడుదల సందడి మొదలైంది. ఈ సందర్భంగా గత యేడాది హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు వచ్చిన సందర్శకులతో నా పలకరింపులకు వారి జవాబులు గుర్తుకొస్తున్నాయి. 'ప్రతి యేడాది దసరా దీపావళి సంక్రాంతి జరుపుకున్నట్లే ఈ పుస్తకాల పండుగను కూడా సంబరంగా సందర్శిస్తాం!
పండుగలకు కొత్త బట్టలు కొనుక్కున్నట్లే కనీసం రెండు వేల రూపాయల పుస్తకాలు ఇష్టంగా తీసుకెళతాం!' అని ఒక మహిళ, 'విద్యార్థులకు, స్కూల్ లైబ్రరీలకు ఏడాదికి పది వేల రూపాయల పుస్తకాలు బహూకరించడం అలవాటు, అందుకే యేటా బుక్ ఫెయిర్(book fair) కు వచ్చి డిస్కౌంట్ లో పుస్తకాలు కొంటా'నని ఓ డెబ్బయేళ్ల పెద్దాయన, 'చిల్డ్రన్ బుక్స్ అంటే ఇష్టం, ఇవన్నీ నేనే సెలెక్ట్ చేసుకున్నాను' అని ఓ పదేళ్ల పాప అన్న మాటలు అందరికి తెలియాల్సినవే. ఈ మాటలు కలకాలం పుస్తకాన్ని బతికిస్తాయనిపిస్తోంది.
అపూర్వ అవకాశం
హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ నిర్వహణలో ఈ పుస్తకాల జాతర ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో 35 వ జాతీయ పుస్తక ప్రదర్శనగా ఈ నెల 22 న మొదలై జనవరి ఒకటవ తేదీ దాకా సాగుతుంది. పని దినాలలో మధ్యాహ్నం 2.00 నుండి రాత్రి 8.30 వరకు, సెలవులలో మధ్యాహ్నం ఒకటి నుండి రాత్రి తొమ్మిది దాకా ఇది తెరిచి వుంటుంది. సుమారు మూడు వందల పుస్తకాల స్టాళ్ల మధ్యలో ఏర్పాటు చేసిన విశాల వేదిక సాహితీ సమావేశాలతో, పుస్తకావిష్కరణలతో నిండుసభలా కళకళలాడుతుంది.
ప్రాచుర్యం గల గత ప్రచురణలతో పాటు యేటా జనవరి నుంచి డిసెంబర్ దాకా వచ్చే వివిధ భాషల పుస్తకాలను ఒక్క చోట అందుబాటులోకి తెచ్చే విశ్వ పుస్తకం కేంద్రం ఇది. చదువరులు ఇష్టమైన పుస్తకాలను కొనుక్కోవడంతో పాటు తమ అభిమాన, ఇష్టమైన రచయితలను ప్రత్యక్షంగా కలిసి ముచ్చటించే అవకాశం ఇక్కడ దొరుకుతుంది. వెరసి ప్రాంగణమంతా పుస్తకాల దొంతరలతో పాటు రచయితల, సాహిత్యాభిమానుల అలాయి బలాయితో పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది.
ఆ నిందను ఎందుకు మోయాలి?
బుక్ ఫెయిర్ ఆరంభానికి ముందు నుంచే నిర్వాహకులు ప్రముఖ సాహితీవేత్తల నుంచి పుస్తక ప్రదర్శన ప్రాముఖ్యత, పఠన ప్రయోజనాల గురించి వివరించే వీడియోలను ప్రచారంలో పెట్టారు. అందరూ పుస్తకాల విలువని వివరిస్తూ చివరగా అంతా బాగానే ఉంది కానీ, అంటూ తెలుగువాడిపై పెద్ద అభియోగం మోపారు. మిగితా దక్షిణ ప్రాంతవాసులతో పోల్చితే పుస్తకాలు చదవడంలో తెలుగువాడు రోజు రోజుకి వెనక్కే పోతున్నాడని వాపోయారు. సుమారు ఎనిమిది కోట్ల తెలుగువారుండగా, వెయ్యి పుస్తక ప్రతులు కూడా అమ్మకం కాలేకపోవడం జాతి దౌర్భాగ్యమని విచారం వెలిబుచ్చారు. 'పుస్తకాలు కొనండి, చదవండి' అని మొరపెట్టుకున్నారు. వారి నిందలో నిజమే ఎక్కువ. ఎన్నింటికో డబ్బును లెక్క చేయకుండా ఖర్చు చేసే వారు సైతం పుస్తకం కొనడానికి వెనుకాడుతున్నారు. దానికి ప్రధాన కారణం సాహిత్యం పట్ల, పఠనం మీద ఆసక్తి లేకపోవడమే. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న తెలుగు పుస్తకాలలో నాణ్యమైన సరుకు తక్కువగా ఉండడం కూడా ఒక కారణమే.
పత్రికలలో వచ్చే కథలకు పాఠకులున్నారు. కథల పోటీలు పెరిగి కథా రచనకు అవి మేలు చేస్తున్నాయి. కథా సంపుటాల రాక, బాగున్నవాటి అమ్మకాలు కూడా ఆశాజనకంగానే ఉంది. సాహిత్య వ్యాసాల గ్రంథాలు విద్యార్థులకు, సాహిత్యాభిలాషులకు ప్రయోజనకరమైనా అమ్మకాలలో వెనుకే ఉన్నాయి. కవితల పుస్తకాలు అమ్ముకోవడం తెలుగులో సాధ్యమయ్యేలా లేదు. ఇప్పటికీ దశాబ్దాల క్రితం వచ్చిన పేరొందిన సాహిత్య పుస్తకాల అమ్మకాలు చెక్కు చెదరకుండా ఉండగా కొత్తగా వస్తున్న పుస్తకాలు వాటి ముందు వెలవెలపోతున్నాయి. ఈ మాట అన్ని పుస్తకాలకు గీటురాయి కాకున్నా చాలా వాటికి వర్తిస్తుంది. ఈ పదేళ్ల కాలంలో వచ్చిన కొన్ని మంచి పుస్తకాలు కూడా తెలుగువాడి ఆదరణకు నోచుకోవడం లేదన్నది కూడా వాస్తవమే.
పుస్తకం జీవిత వికాసం
పుస్తక పఠనం విషయానికొస్తే 'అసలు పుస్తకం ఎందుకు చదవాలి?' అనే ప్రశ్న వేసేవారు మనలో చాలా మంది ఉంటారు. విద్యార్థి దశలో ఎంతో కష్టపడి చదివి ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో స్థిరపడిపోయిన తరువాత 'ఇక చదువుతో మాకేం పని?' అనుకొనే తెలుగువారు కూడా ఎక్కువే. అప్పటి దాకా తెలివిని పంచిన పుస్తకాలు వయసు పెరిగాక ఎలా పనికి రాకుండా పోయాయో అర్థం కాని ప్రశ్నయే. నిజానికి పుస్తకం జీవితకాల నేస్తం. ఆ విషయం చదువుతుంటేనే అవగాహనలోకి వస్తుంది. విద్యాబుద్ధులు నేర్పిన పుస్తకాలు జీవితంలో ఎదురయ్యే చిక్కులకు కూడా పరిష్కారం చూపుతాయి. ఎందరో జీవితానుభవాల సారం సాహిత్యం. చదవడం వలన కూర్చున్న చోటి నుంచే ప్రపంచాన్ని దర్శించవచ్చు. నిత్య పఠనం జీవితాన్ని వికసింపజేస్తుంది. చీకటిదారులలో వెలుగులను పంచుతుంది. వ్యక్తిగా సంస్కరించబడి నిజాయితీ, సహనశీలత ఒంటబడుతుంది. ద్రోహ చింతన, వస్తువ్యామోహం,ఈర్ష్యా ద్వేషాల నుంచి విముక్తి లభిస్తుంది. బౌద్ధిక శుద్ధికి, మానసిక ప్రశాంతతకు పఠనమే చికిత్స. ఎంతో బిజీగా, ఒత్తిడిలో బతికే ఉన్నతాధికారులు, కంపెనీ సీఈఓలు పడుకొనే ముందు ఇష్టమైన పుస్తకంలో కొన్ని పేజీలు చదివాకే ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటామని అంటారు. సాహిత్యం ఏ మాధ్యమంలో, ఏ రూపంలో దొరికినా కాగితంపై వచ్చే అక్షరమే అన్ని విధాలా శ్రేయస్కరం. అందుకే, సాహిత్యానికి పుస్తక ముద్రణే శాశ్వత రూపం. శరీరానికి నీరు, ఆహారం మాదిరే మెదడు చురుకుదనానికి పఠనమే ఆధారం.
చదువరీ.. ఆలోచించు
సాహిత్యానికి ఎల్లలు లేవు. భక్తి నుంచి విప్లవం దాకా అన్నీ ఆ సముద్రంలోని అలలే. ప్రతి మనిషి తమ అభిరుచి, ఆసక్తి మేరకు పుస్తకాలు లభ్యమవుతాయి. నచ్చిన అంశాలపై పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాక కూడా 'తెలుగువాడు పుస్తకాలు కొనడు..చదువడు' అనే నిందని మోసే బదులు ప్రతి ఒక్కరు ఈ నెల తమ ఆదాయంలోంచి పది శాతం బుక్ ఫెయిర్ లో పుస్తకాలు కొనుగోలుకు కేటాయించండి.
బుక్ ఫెయిర్ సందర్శకులందరూ కనీసం వెయ్యి రూపాయల పుస్తకాలు కొనాల్సిందే అని తీర్మానించుకోండి. పుస్తకం చదివి బావుంటే లేదా నచ్చకపోతే నాలుగు మాటలు రచయితతో పంచుకోండి. తెలుగు పుస్తకాన్ని బతికించడం రచయితల చేతిలో కాదు, పాఠకుల ఆదరణతో ఉంది. అందుకే చెయ్యెత్తి పుస్తకాన్ని జైకొట్టు తెలుగోడా..
బి.నర్సన్
94401 28169
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672.
Also Read..