పొగాకులో ఎన్ని రసాయనాలు ఉంటాయో తెలుసా?

Do you know how many chemicals are in tobacco?

Update: 2023-05-31 00:30 GMT

నిషి సంతోషంగా ఉండాలంటే ముందుగా కావలసింది మంచి ఆరోగ్యం. అందుకే ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని అంటారు. అయితే కొంతమంది ఆ భాగ్యానికి నోచుకోలేకపోతుంటే, మరి కొంతమంది దానిని చేజేతులారా దూరం చేసుకుంటున్నారు. ఈ రెండవ కోవకి చెందిన వారిగా ధూమపాన ప్రియుల్ని పేర్కొనవచ్చు. పొగాకు పొగని చుట్ట, బీడీ, సిగరెట్ లాంటి ఏ రూపంలో పీల్చినప్పటికీ అది ధూమపానమే అవుతుంది. పొగతాగడం ఆరోగ్యానికి మంచిది కాదని మనలో చాలా మందికి తెలుసు. అయినప్పటికీ నేటి సమాజంలో పొగతాగే వారి సంఖ్య ఇంకా కొనసాగుతూనే ఉంది. పేదలు-సంపన్నులు, యువకులు-వృద్ధులు అనే తారతమ్యం లేకుండా చాలా మందిలో ఈ ధూమపానం అలవాటు ఏదో ఒక రూపంలో కన్పిస్తూనే ఉంటుంది. పొగ పీల్చడం వల్ల రక్తపోటు, క్యాన్సర్, అల్సర్ వంటి వ్యాధులు సంభవిస్తాయని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ పదే పదే హెచ్చరిస్తున్నా, ధూమపాన ప్రియులు ఖాతరు చేయడం లేదు. అలాగే ‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ అని సిగరెట్ పెట్టెల మీద ముద్రించే ప్రభుత్వం వారి చట్టపరమైన హెచ్చరికలను సైతం పెడచెవిన పెడుతున్నారు. పొగాకు వినియోగం భారత్‌లో కొంతమేర తగ్గినప్పటికీ ఇంకా 120 మిలియన్లమంది దాకా ధూమపానం చేసేవారున్నారు. మన దేశంలో పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో పొగతాగే అలవాటు ఎక్కువ.

ధూమపానం వల్ల వచ్చే అనర్థాలు!

ప్రాణాంతకమైన పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు తదితర జబ్బులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మన దేశంలో పది లక్షల కంటే ఎక్కువమంది మరణిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ధూమపానంపై శాస్త్రజ్ఞులు నిశిత పరిశోధనలు చేసి పొగాకు పొగలో దాదాపు 4 వేల రసాయనిక విష పదార్ధాలున్నట్లు కనుగొన్నారు. అందువల్లే భారత్‌లో నోటిక్యాన్సర్ మరణాల్లో 90 శాతం పొగాకును సేవించడం వల్లే మరణించారని ‘జాతీయ పొగాకు నియంత్రణ మండలి’ పేర్కొంది. గుండెనొప్పి వల్ల సంభవించే మరణాల్లో 45 శాతం కేవలం ధూమపానం వల్లేనని ‘హార్ట్‌కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయే ప్రతి 10మందిలో 9మందిపొగతాగడం వల్లే క్యాన్సర్ బారినపడి చనిపోతున్నట్లు అధ్యయనాల్లో తేలింది.ధూమపానం వల్ల పొగతాగని వారికి కూడా అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. పొగతాగేవారి పక్కన పొగతాగని వారుంటే మామూలు ధూమపానం వల్ల వచ్చే వ్యాధులన్నీ వీరికి కూడా వస్తాయని వైద్యులు అంటున్నారు.సెకండ్‌హ్యాండ్ పొగ ఇతరుల ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుందనీ, తద్వారా వారికి ప్రమాదకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు సోకుతున్నాయని వాషింగ్టన్ లోని ‘ప్రపంచ రక్షక సంస్థ’ పేర్కొంది. గత మూడేళ్ళూ కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో ధూమపాన ప్రియులు ఎక్కువగా కరోనా బారిన పడి,ఊపిరితిత్తులు దెబ్బతిని మృత్యువాత పడ్డారు.

పొగాకు వ్యతిరేక దినం

ప్రతి ఏటా మే 31న ప్రపంచవ్యాప్తంగా ‘పొగాకు వ్యతిరేక దినోత్సవం’ను నిర్వహిస్తారు. పొగాకు వాడకం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఏటా ఒక్కొక్క ఇతివృత్తంతో ఈ దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఇతివృత్తం ‘మనకు కావాల్సింది ఆహారం, పొగాకు కాదు’ (ఉయ్ నీడ్ ఫుడ్, నాట్ టొబాకో). పొగాకు వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియచెప్పి, దానిపై అవగాహన కల్పించడమే పొగాకు వ్యతిరేక దినం ముఖ్యోద్దేశం. పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తి మరియు వాటి మార్కెటింగ్ అవకాశాల గురించి అవగాహన పెంచి, వారిని ఆ దిశగా ప్రోత్సహించడం ఈ ఏడాది పొగాకు వ్యతిరేక దినోత్సవంలో భాగం. ఈ కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి,మెరుగైన ఫలితాలు సాధించడానికి దోహదపడతాయి.

ప్రభుత్వంపై ఆర్థిక భారం

భారతదేశంలో పొగాకు వాడకం వల్ల సంభవించే వ్యాధుల మూలంగానూ, అకాల మరణాల వల్లనూ దేశ జీడీపీ 1శాతం నష్టపోతుందని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ తెలిపింది. భారత్‌లో పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చేఆదాయం కంటే వైద్యానికయ్యే వ్యయభారం అనేక రెట్లు అధికంగా ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ప్రతి ఏడాది ఆరోగ్యంపై వెచ్చించే సొమ్ములో 5.3శాతం కేవలం పొగాకు వాడకం వల్ల వచ్చే వ్యాధులపై ఖర్చు అవుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ లెక్కన పొగాకు ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ఈ ఉత్పత్తుల వినియోగం కారణంగా తలెత్తుతున్న వ్యాధుల చికిత్సలకు పడుతున్న భారమే అధికంగా ఉంటోంది. ఆ విధంగా పొగాకు వాడకం వల్ల అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి తీవ్ర నష్టాలు సంభవిస్తున్నాయనేది నిర్వివాదాంశం.

పూర్తి నిషేధం అవసరం

పొగాకు ప్రమాదాన్ని గుర్తించిన కేంద్రం ధూమపానాన్ని దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో నిషేధిస్తూ 2008లో చట్టం చేసింది. అయితే చట్ట నిబంధనలు నిర్దిష్టంగా అమలు కాకపోవడంతో, ప్రజల్లో అవగాహన కొరవడి ఆశించిన ఫలితాలు లభించడం లేదు. ప్రస్తుతం కేవలం రైళ్ళు, బస్సులలో పొగతాగడంపై నిషేధం సాధ్యమైంది. కానీ టీ స్టాల్స్ దగ్గర, రోడ్డు వెంబడి బహిరంగ ధూమపానం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉంది. మనిషి తెలిసి చేసే ఈ పొరపాటు వల్ల వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. అందుకే తీవ్ర అనర్థాలను తెచ్చిపెడుతున్న ధూమపాన నిషేధానికి ప్రభుత్వాలుమరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలి. ‘బహిరంగ ధూమపాన నిషేధ చట్టం’లోని నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేసి, కనీసం పొగతాగనివారి ఆరోగ్యాలకైనా రక్షణ కల్పించాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాలి. నేడు చలన చిత్రాలు, టీవీ సీరియళ్ళలో ఒకప్రక్క నటులు దర్జాగా సిగరెట్లు కాల్చే దృశ్యాలు ప్రదర్శిస్తూ, మరోప్రక్క చిన్న చిన్న అక్షరాలతో ‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ అంటూ చూపించడం విచిత్రంగా ఉంటోంది. అలాగే సిగరెట్ పెట్టెలపై ముద్రించే ‘ధూమపానం ఆరోగ్యానికి ప్రమాదకరం’ అనే హెచ్చరిక ప్రకటన కూడా మొక్కుబడి చర్యగానే మిగిలిపోతోంది.

వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి!

పొగాకు చేసే హాని అంతా ఇంతా కాదు. ధూమపానాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా, ఏటా కొత్త కొత్త పొగాకు ఉత్పత్తులను చేస్తూ ధనార్జనలో పోటీ పడుతున్నాయి. పొగాకు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ప్రజల ప్రాణాలను హరించేస్తున్న ధూమపానానికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులను పూర్తిగా నిర్మూలించడం ఒక్కటే మార్గం. అయితే మన దేశంలో పొగాకు పండించే రైతులు, దాని ఉత్పత్తులపై ఆధారపడిన కూలీలు, చిన్న తరహా వ్యాపారులు, బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న పొగాకు వాడకాన్ని పూర్తిగా నిషేధించడం ఎంతైనా ఆవశ్యకం. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కూడా దీని నిర్మూలనకు పాటు పడాలి. ధూమపానం వల్ల తమ ఆరోగ్యాలు, పక్కవారి ఆరోగ్యాలు పాడవటమేగాక, ధూమపానం చేసేవారికి ఆర్థికపర ఖర్చులు కూడా పెరుగుతాయనేది నిర్వివాదాంశం. ‘ప్రివెన్ష్ ‌న్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్’ అన్నారు. అంచేత ఈ ధూమపానం అలవాటుకి స్వస్తి పలికి, ఆరోగ్య లక్ష్య సాధన కోసం ధూమపాన ప్రియులు కూడా కృషి చేయాలి.

పీ.వీ.ప్రసాద్

94401 76824

Tags:    

Similar News