కాశ్మీర్ సమస్యనే చూపించాలంటే అక్కడ జరిగిన మొత్తం హత్యలను, మారణకాండను చూపించాల్సింది. కాశ్మీర్‌లో మెజార్టీగా ఉన్న వారిపై జరిగిన దారుణాలకు ఇందులో చోటే లేదు. పండిట్‌లకు సహకరించినందుకు అనేక మంది ముస్లింలను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఇదే విషయం ప్రభుత్వం తన అధికారిక లెక్కలలో కూడా వెల్లడించింది. కాశ్మీర్‌లో ఇప్పటికీ దాదాపు 5000 హిందూ పండిట్ కుటుంబాలు నివసిస్తున్నాయి. వాళ్లందరూ ఎంతో కొంత సామరస్యంగా కలిసి మెలిసి ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రజల మధ్య ద్వేషాన్ని రగిలించడానికి సినిమా ద్వారా ప్రయత్నించినట్లు కనబడుతోంది.
కాదేదీ రాజకీయాలకు అనర్హం. ఇప్పుడు దేశ, రాష్ట్ర రాజకీయాలంతా సినిమాల చుట్టూ నడుస్తున్నాయి. ప్రతి సినిమాను విమర్శిస్తూ కొందరు, సమర్థిస్తూ కొందరు బయలుదేరుతున్నారు. నిజానికి సినిమా అనేది ఒక వినోద మాధ్యమం. దానిని ఒక కళాత్మక, సృజనాత్మక ప్రక్రియగానే భావించాలి. అందులోని విషయాలు వాస్తవాలుగా పరిగణించడానికి వీలులేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించకుండా అసలు సినిమాలను నిర్మించడం అసాధ్యం. ఒకవేళ అలా నిర్మించే సాహసం చేసినా అది ప్రదర్శించబడకుండానే నిర్మాతలకు కష్టాలను, నష్టాలను మిగులుస్తుంది. కాబట్టి లాభాలే ధ్యేయంగా సినిమాలు నిర్మించబడుతున్నాయి. ప్రదర్శించబడుతున్నాయి.
ఇలాంటి ఒక సినిమాకు దేశ ప్రధాని ప్రచారం చేయడం విడ్డూరం. ఆయన మాత్రమే కాదు. ఆయన అనుచరగణమంతా ప్రచారానికి సమయం కేటాయిస్తున్నారంటే దాని వెనకాల ఉన్న రాజకీయ ఉద్దేశాలు ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానమంత్రి లాంటి ఉన్నత పదవులలో ఉన్నవారు. వివాదాస్పద సినిమాలకు ప్రచారం చేయడం ఇదే ప్రథమం. గతంలో ప్రధానులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సినిమాల గురించి మాట్లాడిన సందర్భాలు అరుదు. ఒకవేళ మాట్లాడినా అవి ఖచ్చితంగా సామాజిక ప్రయోజనాలకు ఉద్దేశించబడినవే సినిమాలు అయి ఉండేవి.
అనుమతి ఎలా వచ్చింది?
ఇంత సంచలనానికి కేంద్ర బిందువు 'కాశ్మీర్ ఫైల్స్'. ఈ వివాదాస్పద సినిమాకు సెన్సార్ (సీబీఎఫ్‌సీ) బోర్డు అనుమతులు ఎలా ఇచ్చింది? అని సామాన్య ప్రేక్షకుడిలో సందేహాలు కలగక మానవు. ఏ సినిమా విడుదలకు ముందైన సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ తప్పనిసరి. దీనికోసం బోర్డు సభ్యులు సినిమాను చూసి, పరిశీలించి దానిలో కథాంశం ఒక వర్గాన్నో, కులాన్నో, ప్రాంతాన్నో, జండర్‌నో కించపరిచేలా లేదా రెచ్చగొట్టేలా లేదనుకున్నప్పుడే విడుదలకు అనుమతులు ఇస్తుంది. ఒకవేళ ఏదైనా వివాదాస్పద అంశం ఉంటే సినిమాను నిలిపి ఉంచుతుంది. లేదా సమస్యాత్మక సీన్లు తొలిగించి ప్రదర్శనలకు అనుమతి ఇస్తుంది. గతంలో అనేక సినిమాలు వివాదాస్పదంగా మారి విడుదలకు నోచుకోకుండానే ఆగిపోయాయి.
ఇందుకు భిన్నంగా 'కాశ్మీర్ ఫైల్స్' సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి లభించడం గమనార్హం. ఈ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఆయన దేశంలో అనేక సమస్యలను గాలికి వదిలేసి, గతాన్ని వర్తమానానికి అంటగడుతూ, ఓ వర్గాన్ని బాధ్యులుగా చేసే పనిలో దీనిని నిర్మించినట్లుగా కనబడుతోంది. గతంలో ఈయన 'అర్బన్ నక్సలైట్లు' అనే పేరుతో 'బుద్ధ ఇన్ ఎ ట్రాఫిక్ జామ్' అనే సినిమా కూడా నిర్మించారు. వివేక్ అగ్నిహోత్రి బీజేపీ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకుపోయే నిఖార్సయిన కార్యకర్త. అందుకే ఆయనను బీజేపీ ప్రభుత్వం కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్‌గా నియమించుకుంది. ఇంకేం బోర్డు సభ్యునిగా ఉన్న అగ్నిహోత్రి తన సినిమాకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకొని, విడుదల చేసుకున్నారు.
వారినెందుకు విస్మరించారు?
కాశ్మీర్ సమస్యనే చూపించాలంటే అక్కడ జరిగిన మొత్తం హత్యలను, మారణకాండను చూపించాల్సింది. కాశ్మీర్‌లో మెజార్టీగా ఉన్న వారిపై జరిగిన దారుణాలకు ఇందులో చోటే లేదు. పండిట్‌లకు సహకరించినందుకు అనేక మంది ముస్లింలను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఇదే విషయం ప్రభుత్వం తన అధికారిక లెక్కలలో కూడా వెల్లడించింది. కాశ్మీర్‌లో ఇప్పటికీ దాదాపు 5000 హిందూ పండిట్ కుటుంబాలు నివసిస్తున్నాయి. వాళ్లందరూ ఎంతో కొంత సామరస్యంగా కలిసి మెలిసి ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రజల మధ్య ద్వేషాన్ని రగిలించడానికి సినిమా ద్వారా ప్రయత్నించినట్లు కనబడుతోంది. బీజేపీ ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు 'కాశ్మీర్ ఫైల్స్' ను ప్రచారం చేయడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. తప్పుడు ప్రచారానికి పాలుపడ్డారు. ఈ రకమైన ప్రచారం వల్ల మంచి జరుగక పోగా మరింత అనర్థాలకు అవకాశం ఉంటుంది. నిన్న మొన్న విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలను పోలిన పాత్రులు, వాస్తవ చరిత్రకు సంబంధం లేకుండా ఉండటం చూడవచ్చు. ఇలాంటి చరిత్రాత్మక సినిమాల గురించి, పాత్రల గురించి ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోతే అవే వాస్తవ చరిత్రలు అనుకునే ప్రమాదం ఉంది.
డా. సందెవేని తిరుపతి
చరిత్ర పరిరక్షణ సమితి
9849 618116