రాష్ట్ర ఇథనాల్ పాలసీపై చర్చ
తెలంగాణ రాష్ట్రంలో ఇథనాల్ కంపెనీలను ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో
తెలంగాణ రాష్ట్రంలో ఇథనాల్ కంపెనీలను ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో ఏర్పాటు చేసిన ఇథనాల్ కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించిన తర్వాత గాలిలోకి, నీటిలోకి, భూమిలోకి కాలుష్యాన్ని వెదజల్లుతున్నది. చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలకు ఆ కంపెనీ నుండి విపరీతమైన దుర్వాసన వెలువడుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలు అవుతున్నారు. అయినప్పటికీ కాలుష్య నియంత్రణ మండలి చేతులు కట్టుకుని కూర్చున్నది తప్ప కంపెనీ పై చర్యలు తీసుకోవడం లేదు. పర్యావరణ అనుమతి షరతులను అతిక్రమించినా చర్యలు లేవు.
తెలంగాణ రాష్ట్రంలో గతంలో 5 ఇథనాల్ పరిశ్రమలు ఉండగా, ఇప్పుడు మరో 14 పరిశ్రమలను నెలకొల్పుతున్నారు. మరో 9 పరిశ్రమల ఏర్పాట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. అంటే మొత్తం 28 ఇథనాల్ పరిశ్రమలు తెలంగాణను ముంచెత్తబోతున్నాయి. 2020-21 సం.లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 14 ఇథనాల్ కంపెనీలకు అనుమతులు మంజూరు చేసింది. 2023-24 లో మరో 5 ప్లాంట్లకు పర్యావరణ అనుమతి ఇచ్చింది. గతంలో ఉన్న వాటిని అప్ గ్రేడ్ చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 13 ఇథనాల్ కంపెనీలు నిర్మాణ దశలో ఉన్నాయి. చిత్తనూరు ఇథనాల్ కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇంకా 9 కంపెనీలు నిర్మాణాన్ని మొదలుపెట్టలేదు.
నీరు, ఆహార కొరత
ఇథనాల్ ఉత్పత్తి వల్ల ప్రధానంగా నీటి కొరత ఏర్పడుతుంది. ఆహార కొరత ఏర్పడుతుంది. పర్యావరణం పాడవుతుంది. ఈ విషయాలను ప్రజా శాస్త్రవేత్తలు ఎన్నోసార్లు సదస్సులు, సమావేశాలు ఏర్పాటుచేసి వివరించారు. ఇథనాల్ ఉత్పత్తికి ప్రధానంగా బియ్యంను ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో ప్రజలకు తిండి సమస్య ఏర్పడుతోంది. అది గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ కంపెనీలకు సబ్సిడీ ధరకు బియ్యాన్ని సరఫరా చేయడాన్ని ఆపేసింది. నూకలు కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నది. బియ్యం పండించడానికి అధిక మొత్తంలో నీటి వనరుల వినియోగం అవసరం, ఇథనాల్ ఉత్పత్తికి నీటిని ఉపయోగించడం వల్ల సాగునీరు, తాగునీరుకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే కొన్ని నడుస్తున్న ప్లాంట్ల దగ్గర సాగునీటి కొరత రైతులను నిస్సహాయులను చేస్తున్నది. అదేవిధంగా ఇథనాల్ ఉత్పత్తి వల్ల వెలువడే వ్యర్థ పదార్థాలను కంపెనీలు పారబోయడం, భూమిలోకి పంపు చేయడం వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. ఉత్పత్తిలో వున్న ఏ ఇథనాల్ ప్లాంట్ చూసినా స్థానికంగా నీటి సమస్య, నీటి కాలుష్య సమస్య వుంది.
నిరసనకారులపై కేసులు, చిత్రహింసలు
ఇథనాల్ ఉత్పత్తికి వ్యతిరేకంగా చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ గత రెండు సంవత్సరాలుగా నిరంతరంగా పోరాడుతున్నది. ఆ పోరాటంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి రైతులు, ప్రజలపై లాఠీఛార్జ్ చేసి అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలు పెట్టి జైలుపాలు చేసింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో పోరాడకుండా బాధిత రైతులపై రౌడీషీట్లు తెరిచింది. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇథనాల్ పరిశ్రమలను ఆహ్వానించి ముందుకు తీసుకుపోయింది. మన రాష్ట్రంలోని ప్రజలు ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ ఎన్నికలలో గద్దెదించారు. నేడు నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇథనాల్ పాలసీని విరమించుకుని ఇథనాల్ పరిశ్రమలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడడానికి, పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని రక్షించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
ఇథనాల్ పాలసీపై రాష్ట్రంలో ఉన్న బాధిత ప్రజలు, రైతులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు భవిష్యత్ కార్యాచరణ కు పూనుకోవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అందులో భాగంగా తేదీ నేడు ఉదయం 10 గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాదులో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతీ ఒక్కరూ హాజరై భవిష్యత్తు ప్రణాళికపై చర్చ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
(నేడు ఇథనాల్ పాలసీపై రౌండ్ టేబుల్ సమావేశం)
వివరాలకు
చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ
94940 52775