విపత్తు నియంత్రణకు అవగాహన అవసరం!

Disaster management requires awareness!

Update: 2023-10-13 00:00 GMT

విపత్తు అనేది ఆకస్మిక, విపత్కర సంఘటన. ఇది మానవాళి, సమాజంపై తీవ్రంగా ప్రభావం చూపి మానవ, భౌతిక ఆర్థిక, పర్యావరణ నష్టాలను కలిగిస్తుంది. ప్రకృతి వరదలు, భూకంపాలు, సునామీ, తుఫానులు, అగ్నిపర్వత విస్ఫోటనం మొదలైన వాటి వల్ల విపత్తు సంభవిస్తుంది. దీనికి అదనంగా తరచుగా మానవ ప్రభావిత విపత్తులయిన సాంకేతిక, పారిశ్రామిక ప్రమాదాలు, ఉగ్రవాదం వంటి కారకాల వల్ల సంభవిస్తుంది. విపత్తులను నియంత్రించడానికి, విపత్తు ప్రమాదాన్ని తగ్గించుటకే అంతర్జాతీయ దినోత్సవం 1989లో ప్రారంభించబడింది. ప్రమాద- అవగాహన, విపత్తు తగ్గింపు సంస్కృతిని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చాకా 2009లో అధికారికంగా అక్టోబర్ 13ను ప్రపంచ విపత్తు నియంత్రణ దినంగా జరుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, సమాజాలు విపత్తులకు గురికావడాన్ని ఎలా తగ్గిస్తున్నాయో, వారు ఎదుర్కొంటున్న నష్టాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోవడానికి కార్యక్రమాలు జరుపుతారు. ఈ సారి ‘స్థితిస్థాపక భవిష్యత్తు కోసం అసమానతపై పోరాటం’ అనే సారాంశంతో కార్యక్రమాలు జరుపుతున్నారు.

60వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు..

2030 నాటికి, ప్రస్తుత వాతావరణ అంచనాలతో ప్రపంచం సంవత్సరానికి దాదాపు 560 విపత్తులను ఎదుర్కొంటుంది. 2030 నాటికి వాతావరణ మార్పు, విపత్తుల కారణంగా 37.6 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తారని అంచనా వేయబడింది. వీటి ప్రభావంతో 2030 నాటికి 100.7 మిలియన్ల మందిని పేదరికంలోకి నెట్టివేస్తుంది. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాలు స్వల్పకాలికం. ప్రాణ, ఆస్తి నష్టం దీర్ఘకాలికంగా ఒక ప్రాంతం లేదా దేశం ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. మౌలిక సదుపాయాలు, ఇంధన ఉత్పత్తి కేంద్రాలకు నష్టం జరిగి దేశ ఆర్థిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది. ప్రకృతి వైపరీత్యాలతో ప్రపంచవ్యాప్తంగా సగటున సంవత్సరానికి 60,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా, గత దశాబ్దంలో 0.1% మరణాలకు విపత్తులు కారణమయ్యాయి. ఇది 0.01% నుండి 0.4% వరకు మారుతుంటుంది.

చారిత్రాత్మకంగా, కరువు, వరదలు, భూకంపాలు అత్యంత ఘోరమైన విపత్తు సంఘటనలు. 2019లో తుఫానులు ప్రపంచవ్యాప్తంగా 59.3 బిలియన్ యుఎస్ డాలర్ల నష్టాన్ని కలిగించాయి. ఇక మానవ నిర్మిత విపత్తులు 7 బిలియన్ల నష్టాలకు కారణమయ్యాయి. 2020లో ప్రధాన జరిగిన విపత్తులు చూస్తే అట్లాంటిక్ హరికేన్, నార్త్ అమెరికన్ అడవి నిప్పు, కరోనా-19 వైరస్, బీరుట్ పేలుడు, యూ. ఎస్ సివిల్ అశాంతి, సుడాన్ వరదలు. రుతుపవనాలు, రోహింగ్యా శరణార్థుల సంక్షోభం వంటీవీ ఉన్నాయి. 2021 కంటే 2022 మొదటి అర్ధభాగంలో ప్రకృతి వైపరీత్యాల నష్టాలు తక్కువగా ఉన్నాయి. వరదలు, భూకంపాలు, తుఫానుల కారణంగా మొత్తంగా 65 అమెరికా బిలియన్ల నష్టం వాటిల్లింది. గత సంవత్సరంలో నష్టం భారీగా ఉన్న 105 అమెరికా బిలియన్లతో పోలిస్తే, సుమారు 34 అమెరికా బిలియన్ల వద్ద, బీమా చేసిన నష్టాలు మునుపటి సంవత్సరాలకు అనుగుణంగా ఉన్నాయి.

ప్రతిస్పందించే వ్యూహాలు రచించాలి!

మన దేశంలో గత సంవత్సరంలో అమర్‌నాథ్ వరదలు, భారతదేశం, బంగ్లాదేశ్ వరదలు, సూరత్ గ్యాస్ లీక్ మొదలైన విపత్తులు సంభవించాయి. 2022 మే నుండి, ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్‌లో ఘోరమైన వరదలు సంభవించాయి. రెండు దేశాలలో 9 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. దాదాపు 300 మంది మరణించారు. జెనీవాకు చెందిన ఇంటర్నల్ డిస్‌ప్లేస్‌మెంట్ మానిటరింగ్ సెంటర్ నివేదిక ప్రకారం 2021లో తీవ్రమైన తుఫానులు, వరదల కారణంగా 4.9 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 2020-21 మధ్యకాలంలో మొత్తం 2,002 మంది ప్రాణాలు కోల్పోయారు. మనదేశం 1998 నుండి 2019 మధ్య కాలంలో భారతదేశం సుమారు 79.5 బిలియన్ డాలర్ల సంపూర్ణ ఆర్థిక నష్టాలతో ఉంది.

ఒక దేశం పరిపాలన నిర్మాణం ఆర్ధిక, సామాజిక అభివృద్ధికి, ప్రజా విధానాల అమలు సక్రమంగా ఉంటే స్థిరమైన జీవనోపాధి సాధిస్తూ విపత్తులకు గురికావడం కూడా తగ్గుతుంది. జవాబుదారీతనం, ప్రపంచ కార్యక్రమాలలొ పాల్గొనడం, సమర్థత, అంచనాలు, పారదర్శకత పరిపాలన అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి ప్రమాద విపత్తులు తగ్గిస్తాయి. యూఎన్ సభ్య దేశాలు 2015లో విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి సెండాయ్ (జపాన్) ప్రణాళిక ప్రకారం ప్రజల ప్రాణాలు రక్షణతో మంచి విపత్తు పాలనను కొలవవచ్చు. విపత్తు ప్రభావిత సంఖ్యను తగ్గించి, ఆర్థిక నష్టాలను తగ్గించవచ్చు. COVID-19, వాతావరణ మార్పు వంటి వాటిపై ప్రణాళికలు, శాస్త్రీయ ఆధారాలపై పనిచేసే సమర్థవంతమైన, సాధికారిత సంస్థలు అవసరమని నివేదికలు చెబుతున్నాయి. ఒకే ప్రమాదాలను మాత్రమే పరిష్కరించే వ్యూహాలను కాక వరదలు, తుఫానులు, అనుసంక్రమణ వ్యాధులు, వాతావరణ కారక, పర్యావరణ విచ్ఛిన్నం వలన ఏర్పడే ప్రమాదానికి ప్రతిస్పందించే వ్యూహాలను రచించాలి.

విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి మంచి జాతీయ, స్థానిక వ్యూహాలు బహుళ రంగాలుగా ఉండాలి. భూ వినియోగం, భవన సంకేతాలు, ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, ఇంధనం, నీటి వనరులు, పేదరికం తగ్గింపు, వాతావరణ మార్పుల అనుసరణ వంటి రంగాలలో విధానాలను అనుసంధానించడం. భవిష్యత్ తరాలకు మరింత స్థితిస్థాపకంగా ఉండే విధంగా వ్యూహాలు చేసే సమయం ఇది. విపత్తులను నివారించడానికి విపత్తుల సమాచారం, అవసరమైనవి తరలింపు కోసం ఒక ప్రణాళిక, అత్యవసర వస్తు సామగ్రి, అనవసరమైన నష్టాల నివారణ, సురక్షితమైన ప్రాంతానికి వెళ్లడం చాలా అవసరం. సామూహిక అవగాహన కార్యక్రమాలు విపత్తుల నియంత్రణ పట్ల ప్రజల మార్పు వైఖరిని తీసుకురాగలవు. అప్పుడే ఈ దినోత్సవ లక్ష్యం నెరవేరుతుంది.

(నేడు ప్రపంచ విపత్తు నియంత్రణ దినం)

డా. పి.ఎస్. చారి

83090 82823

Tags:    

Similar News