ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఎవరి ప్రయోజనం కోసం?
Dil Raju has taken over the industry, will small films survive?
చిత్ర పరిశ్రమలో అతి ముఖ్యమైనవి నిర్మాణ, తార, సాంకేతిక, పంపిణీ, ప్రదర్శన విభాగాలు. ఉత్తమ చిత్ర నిర్మాణానికి వీటి మధ్య సమన్వయం ఎంతో అవసరమని ఏడు దశాబ్దాల క్రితం ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు సుందర్ లాల్ నహతా చెప్పారు. ఇవి వర్తమానంలోనూ ఎంతమాత్రం విభేదించని మాటలు. కానీ ప్రస్తుతం ఈ వర్గాలు ఏమాత్రం సహకారం లేకుండా పనిచేస్తున్నాయి. ఎందుకీ చర్చ అనే ప్రశ్నకు ఈ మధ్య జరిగిన ఫిలిం ఛాంబర్ ఎన్నికల నేపథ్యం, ఫలితాలేనని సమాధానం ఇవ్వక తప్పదు. ఏమిటి ఫిల్మ్ ఛాంబర్ (సినీ వర్గాలతో పరిచయం లేని వారి కోసం) అని ప్రశ్నించుకుంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అటు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్. ఇటు సినీ కార్మికుల ఫెడరేషన్లకు చెందిన ఎటువంటి సమస్యలకైనా మధ్యలో పెద్దన్నయ్య పాత్ర వహించే సంస్థ ఇది. ప్రభుత్వాలతో చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించే బాధ్యత కూడా ‘ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ తీసుకుంటుంది. ఇటువంటి గురుతర బాధ్యతను తెలుగు సినీ పరిశ్రమ తరపున నిర్వహించే ఛాంబర్‌కు ఎన్నికలు జరిగాయి. ప్రముఖ సినీ నిర్మాత, పంపిణీదారుడైన ‘దిల్’ రాజు అధ్యక్షులుగా ఎన్నికైనారు. ఇది సంతోషించదగ్గ విషయమే. కానీ.. ఇక్కడ గమనించవలసిన విషయాలు ఒకట్రెండున్నాయి.
పోటీ హోరాహోరిగా..
ఈ మధ్యకాలంలో చిన్న, పెద్ద సినిమాలనే చర్చ విపరీతంగా జరుగుతున్నది. చిన్న సినిమాలను ‘ఒక వర్గం’ తొక్కేస్తున్నదని, ప్రదర్శనకు థియేటర్లు దొరకనీయటం లేదనే ఉద్యమాలు వచ్చాయి. వస్తున్నాయి. మీడియా కూడా రెండు వర్గాలుగా (తెరచాటున) విడిపోయి ఏ వర్గం లాభనష్టాలు.. కష్టసుఖాలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న సినిమా నిర్మాతలు, బడా చిత్రాల నిర్మాతలుగా పరిశ్రమలో ‘వర్గాలు’ ఉన్నాయి. ఎవరి కష్టాలు వారివి. ఎవరివేదన వారిది. అయితే...ఇటువంటి పరిస్థితులలో ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. ఫిల్మ్ చాంబర్‌లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్, ఎగ్జిబిటర్స్ సెక్టార్, స్టూడియో సెక్టార్. వీటిలో సినిమా పంపిణీదారుల విభాగం ఐక్యంగా ఉండి ఎన్నిక ఏకగ్రీవం చేసుకున్నారు. కానీ మిగిలిన మూడు విభాగాలకు పోటీ ఎన్నిక అనివార్యమైంది. ఈ విభాగంలో ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ప్యానెల్, సీనియర్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్ పానెల్ (చిన్న చిత్రాల నిర్మాతలు బలపరిచినది) పోటీపడ్డాయి. పోటీ హోరాహోరీ గానే జరిగింది. కొద్దిపాటి మెజార్టీతో ‘దిల్’ రాజు అధ్యక్షులుగా ఎన్నికైనారు. ఇది విశేషమో.. కాదో.. సినీ వర్గాల విషయం. ఇక్కడ గమనించదగ్గ అంశం ఏమిటంటే చిన్న చిత్రాలను నొక్కేస్తున్నారని. వాటి మనుగడ కష్టమవుతున్నదని, ఈ విషయంలో ప్రభుత్వమే తగువిధంగా నిర్ణయాలు తీసుకోవాలని వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చే వారంతా తామే తమ పోరాట ప్రతినిధిగా సి. కళ్యాణ్‌ని బలపరిచారు. కానీ.. చివరకు కళ్యాణ్ వర్గం కోశాధికారి తదితర పాత్రలకే పరిమితమయింది. చిన్న నిర్మాతలు ఎక్కువమంది ఉన్న సి. కళ్యాణ్ ప్యానెల్‌లో సహజంగా వారే గెలుస్తారని అందరూ అనుకుంటారు. కానీ చిత్రంగా ‘దిల్’ రాజు వర్గం (కొద్దిపాటి మెజార్టీతో) విజయం వెనుక ఉన్న అంశాలు ఏమిటి అనేది ఒక చర్చ.
చిన్న నిర్మాతలకు మేలు ఏమిటి?
ఈ సంగతిని ప్రక్కన పెడితే...అసలు చిన్న, పెద్ద సినిమాలు అనే వర్గీకరణ క్రీనీడలో ఉన్నదెవరు? తక్కువ బడ్జెట్‌తో తీసే చిన్న సినిమాలలో క్వాలిటికి పెద్దపీట వేయకపోవచ్చు. మరి ‘బలగం’ లాంటి చిత్రాలు ఎలా విజయం సాధించాయి? ‘పద్మిని’, ‘విమానం’ వంటివి కూడా ఉన్నాయి కదా. పెద్ద సినిమాలు విజయం సాధించినవి ఎన్ని? నిర్మాతలకు డబ్బులు తెచ్చినవి ఎన్ని? సమీకరణాల మధ్య తామే బలపరిచిన ‘వర్గీయులు’ తమ వారిని ఎందుకు గెలిపించుకోలేదు? తెర వెనుకనున్న విషయాలను గురించి చర్చించనవసరం లేదు. కానీ.. చిన్న పెద్ద అనే విభజన యుద్ధంలో బలైపోయి ‘ప్రింట్లు’ ల్యాబ్‌లలో నుగ్గిపోతున్న బడుగు చిత్ర నిర్మాతల గురించి ఎవరు ఆలోచిస్తారు? ఎవరికివారుగా తమ లాభాల కోసం, ప్రచారం కోసం తపన పడే (వి)చిత్ర పరిశ్రమలో నిజంగా చిన్న (మంచి) సినిమాలను తీసే నిర్మాతల వైపు పోరాడేది ఎవరు? తమ వారెవరో.. కాని వారెవరో తెలుసుకోవడం కష్టమనే వాస్తవం ప్రస్తుత ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలు తెలుపుతున్నాయని సినీ విశ్లేషకులు ఉన్నారు.
చిన్న చిత్రాలు సంవత్సరానికి 200 చిత్రాలకు పైగానే విడుదలవుతున్నాయి. దాదాపుగా అన్ని రెండో, మూడో ఆటలు తర్వాత తెరకు దూరమవుతున్నాయి. ఈ అపజయాల కారణంగా ఆ చిత్ర నిర్మాతల భవిష్యత్తు ఏమిటి? నిర్మాతను తమ తమ ‘కళా’చాతుర్యంతో అంచనాకు మించి ఖర్చు చేయించి, చివరకు ‘నిరాశ’పరిచే వర్గం కూడా ఇటువంటి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశారనుకోవచ్చు అనేది ఒక వర్గం విశ్లేషణ. ఈ ఫలితాల విడుదల, ‘దిల్’ రాజు అధ్యక్షులుగా పీఠం అధిరోహించిన సమయం (జూలై 31)లోనే సినిమాటోగ్రఫీ 1954 చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. ఈ ‘అంశం’ కూడా ఒకానొక రాజకీయ చర్చకు తెరలేపింది. ఇందుకు కారణాలు కూడా మీడియాలో వచ్చాయి. అంతా బాగుందని అనుకున్నా, చిన్న చిత్ర నిర్మాతలకు ఒరిగే మేలు ఏమిటో ఎవరూ చెప్పడం లేదు. మరి చాంబర్ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తుకు చెప్పేదేమిటి? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం కాలం చెబుతుందని పెద్దలు వక్కాణించవచ్చు. కానీ అందరికీ మేలు జరిగేలా చిత్ర నిర్మాతలు నిలదొక్కుకునే అవకాశాలు కల్పించే మార్పులు ముందు ముందు జరుగుతాయనే వారు బహు తక్కువ.
దిశా నిర్దేశం చేయాలి!
“చలనచిత్ర పరిశ్రమకు ఒక పద్ధతి లేదని, ఇక్కడ డాంబికం ఎక్కువ అనే విమర్శ సరైనదేనని మనం ఒప్పుకోవాలి. నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శకులు ఈ ముగ్గురు చలనచిత్ర పరిశ్రమలో మూడు ముఖ్యమైన విభాగాలకు బాధ్యులు. అయితే ఇందులోని మొట్టమొదటిది నిర్మాణ విభాగం. ఈ విభాగంలో ఒక క్రమమైన పద్ధతి, కార్యకలాపాలలో ఒక నిర్ధారితమైన విధానం వగైరాలు లేవని నేను నా అనుభవంతో తెలుసుకున్నాను” అంటారు సుందర్ లాల్ నహతా. ఇది నేటికీ కూడా నిజమే అని అనిపిస్తుంది. చిన్న నిర్మాతలకు అనుభవ లేమి నిజమే. కానీ… వారికి దిశా నిర్దేశం చాంబర్ చేస్తే బాగుంటుంది. చిన్న నిర్మాతలు సహితం ముందుగా ఛాంబర్ పెద్దలతో, అనుభవజ్ఞులతో సంప్రదింపులు చేస్తే ఉభయకుశలోపరిగా ‘మేలు’ జరిగే అవకాశాలు ఉన్నాయనవచ్చు. ఇటువంటి సందర్భాలలో ఫిల్మ్ ఛాంబర్ ‘ఎవరి ప్రయోజనం’ కోసం తమ కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నదో అందరికీ విదితమవుతుంది. ఆ దిశగా కే.ఎల్. దామోదర ప్రసాద్, ‘దిల్’ రాజుల కృషి ఉంటుందని సినీ అభిమానుల ఆశ.
-భమిడిపాటి గౌరీశంకర్
94928 58395