ఉన్నది ఉన్నట్టు: నోట్ల రద్దు చేయలేనిది కరోనా చేసిపెట్టిందా?
ఉన్నది ఉన్నట్టు: నోట్ల రద్దు చేయలేనిది కరోనా చేసిపెట్టిందా?... Digital transactions have improved in Corona, not in demonetisation
ప్రతీ పనికి ఒక లక్ష్యం ఉంటుంది. నోట్ల రద్దుకూ అలాంటిదే ఉన్నది. తలపెట్టిన ప్రతీ పని ఆశించిన ఫలితాన్ని ఇస్తుందని భావించలేం. కానీ సాకారం కావాలనే పట్టుదలతోనే రంగంలోకి దిగుతాం. నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందనేది సమీక్షించుకోవాల్సిన అంశం. నిర్దేశించుకున్న నల్లధనం, టెర్రర్ ఫండింగ్, నకిలీ కరెన్సీ లాంటివేమీ అదుపులోకి రాలేదు. కోట్లాది మందిని ఇబ్బంది పెట్టిన నోట్ల రద్దు నిర్ణయం ఒక నిష్ఫల ప్రహసనంగా మిగిలిపోయింది. అనాలోచితమా, అతి తెలివా.. ఇలాంటి చర్చ అవసరం లేదుగానీ.. భవిష్యత్తులో ఏం చేయకూడదో మాత్రం పాలకులకు నేర్పింది.
ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు(demonetisation) నిర్ణయం సక్రమమా కాదా అనే చర్చ ముగిసింది. ఆ నిర్ణయం సబబేనని ఆరేళ్ళ తర్వాత అత్యున్నత న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది. ఇప్పటివరకూ ఉన్న భిన్నాభిప్రాయాలపై చర్చ ముగిసింది. ఐదుగురు జడ్జీల్లో భిన్నాభిప్రాయాలు ఎలా ఉన్నా ఫైనల్‌గా నలుగురు సర్కారు నిర్ణయాన్ని సమర్ధించారు. ఈ నిర్ణయం నిబంధనలకు అనుగుణంగా, చట్టపరిధిలో ఉన్నదో లేదో తీర్పులోనే వెల్లడైంది. ఎలాగూ నిర్ణయం తీసుకోవడం, అమలుకావడం పూర్తయిపోయింది. ఆరేళ్ళ తర్వాత దానిని తిరగదోడే అవకాశమూ లేదు. ఒకవేళ భిన్నమైన తీర్పు ఇచ్చినా చేయగలిగింది కూడా ఏమీ లేదు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా ఒరిగేదేమీ ఉండదు.
కోర్టులో జరిగిన వాదనలన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమా, విరుద్ధమా అనేదానికి పరిమితమయ్యాయి. కేవలం విధానానికి సంబంధించిన అంశం చుట్టే తిరిగింది. కానీ ఆ విధానం ద్వారా సాకారమయ్యే లక్ష్యాలను ప్రస్తావించినా పెద్దగా ప్రాధాన్యత లేని అంశంగానే మిగిలిపోయింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో స్వయంగా ప్రధాని మోడీనే టీవీల ద్వారా వెల్లడించారు. నల్లధనాన్ని వెలికి తీయడం, టెర్రర్ ఫండింగ్‌ను నిలువరించడం, నకిలీ కరెన్సీకి బ్రేక్ వేయడం అనేవి కీలకమైన అంశాలు. ఆ నిర్ణయంతో ఆశించిన లక్ష్యం నెరవేరిందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఇకపైన ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రయోజనమా లేదా అనేది ప్రభుత్వానికి ఒక గుణపాఠమే.
నెరవేరని లక్ష్యం
చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో దాదాపు 85% మేర పెద్ద నోట్లే. వీటిని రద్దు చేయడం ద్వారా ఒకే దెబ్బతో మూడు లక్ష్యాలను సాధించవచ్చని ప్రభుత్వం భావించింది. ఆశించినట్లుగా ఈ మూడు లక్ష్యాలు నెరవేరితే దేశంలో పన్ను పరిధిలోకి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని, దేశ ఎకానమీని గాడిలో పెట్టవచ్చని, టాక్స్ బేస్‌ను పెంచుకోవచ్చన్నది సర్కారు భావన. చివరకు డిజిటల్ ఎకానమీ ఇంప్రూవ్ అయ్యి జవాబుదారీతనం పెరుగుతుందని కూడా భావించింది. ప్రతీ పైసాకు లెక్క వస్తుందని అనుకున్నది. నోట్ల మార్పిడిలో భాగంగా బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతున్న పాత నోట్లతో పన్ను పరిధిలోకి ఖాతాదారులను తీసుకురావచ్చని భావించింది. మొత్తానికి 99% పాత నోట్లు బ్యాంకులకు వచ్చి చేరాయి. దేశంలో టాక్స్ బేస్ పెరిగింది. దీనికి కారణం నోట్లరద్దు నిర్ణయమేనా అని స్పష్టంగా చెప్పలేం. కానీ పెరిగిన టాక్స్ బేస్‌కు అనుగుణంగా వసూళ్ళు లేవు. నోట్ల రద్దుకు ముందు మొత్తం పన్నుల ద్వారా వస్తున్న ఆదాయంతో పోల్చి చూస్తే పెద్దగా మార్పు లేదు. అప్పటివరకూ దేశ జీడీపీలో పన్నుల ద్వారా వస్తున్న ఆదాయం 10.6 శాతం. ఇప్పుడు అది 10.7%కి పెరిగింది. ఇది పెద్దగా లెక్కలోకి వచ్చేదే కాదు. ఇంకోవైపు నోట్ల రద్దుకు ముందు చెలామణి ఏ స్థాయిలో ఉన్నదో ఆ నిర్ణయం తర్వాత తగ్గకపోగా మరింతగా పెరిగింది. నోట్ల రద్దుతో డిజిటల్ లావాదేవీలు(digital transactions) పెరిగి నోట్ల చెలామణి తగ్గుతుందని సర్కారు భావించినా ఆ తీరులో జరగలేదు. నోట్ల రద్దుతో డిజిటల్ ఎకానమీ(digital economy) పెరుగుతుందనే అంచనా బెడిసికొట్టింది.
పిడికెడు మందితో కోట్లాది మందికి కష్టం
ఆదాయం ఉన్నవారు పన్ను కడతారు. దేశ జనాభాలో టాక్స్ పేయర్లు(tax payers) ఐదు శాతం మంది మించరనేది సర్కారు అంచనా. ప్రభుత్వ గణాంకాలూ ఇవే చెప్తున్నాయి. నల్లధనం దాచుకునే స్థోమత కూడా వారికే ఉంటుంది. మిగిలిన 95% మంది ప్రజలు పేద, దిగువ మధ్య తరగతి వర్గాలే. నోట్ల చెలామణితోనే వారి రోజువారీ జీవితం గడుస్తుంది. ఆ ఐదు శాతం మంది దగ్గర నల్లధనం పోగైందనే అనుమానంతో నోట్ల రద్దు నిర్ణయం జరిగింది. దీంతో 95% మంది ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు. ఇది సమంజసమేనా అనే చర్చ భారీ స్థాయిలోనే జరిగింది. ఎలుక కోసం ఇంటిని తగులబెట్టుకుంటారా అనే విమర్శలూ వచ్చాయి. భారతదేశ చరిత్రలో ఒక్కసారిగా కోట్లాది మందిని రోడ్డుమీదకు తెచ్చిన నిర్ణయం నోట్లరద్దు. ఫలితం ఇవ్వకుంటే నన్ను నడిరోడ్డు మీద.. అంటూ మోడీ గంభీర ప్రకటనే చేశారు. కానీ చివరకు జరిగిందేమిటో అందరికీ తెలుసు.
పెద్ద నోట్లతో నల్లధనం భారీగా పోగవుతున్నదనే కారణంతో ఆ రెండు రకాల నోట్లనే ప్రభుత్వం రద్దు చేసింది. కానీ అంతకంటే పెద్ద నోట్లను తీసుకురావడంలో ఔచిత్యం ఎవరికీ అంతుబట్టలేదు. ఇప్పుడు ఆ పెద్ద నోట్లు బ్యాంకుల్లో, ఏటీఎంలలో, ఓపెన్ మార్కెట్‌లో కనిపించడంలేదు. ఆ నోట్లన్నీ చెలామణిలో ఉన్నట్లు రిజర్వు బ్యాంకు భావిస్తున్నది. కానీ బైట ఎక్కడా కనబడడంలేదు. ఇవన్నీ ఆ పెద్దల దగ్గర పోగుబడ్డాయనేది నగ్నసత్యం. నోట్ల రద్దు నిర్ణయంతో అక్రమార్కులు, అవినీతిపరులు బాగానే ఉన్నారు. ఎక్కడా బైటపడలేదు. కానీ ఒకటిన్నర నెల రోజుల పాటు పేదలు మాత్రం పడరాని బాధలు పడ్డారు. వారి బాధలకు పరిహారం ఏంటనేది ఇప్పటికీ మిస్టరీయే.
నోట్లరద్దు కంటే కరోనా బెటర్
నోట్ల రద్దు జరగడానికి ముందునుంచే దేశంలో డిజిటల్ లావాదేవీలు ఉన్నాయి. అయితే అది నామమాత్రమే. ప్రతీ ఏటా ఈ లావాదేవీలు పెరుగుతూ ఉన్నాయి. నోట్ల రద్దు తర్వాత కొంత పెరిగింది వాస్తవమే అయినా ఆశించినంతగా జరగలేదు. కానీ కరోనా మాత్రం ఊహించని మార్పును తీసుకొచ్చింది. ఒక్కసారిగా డిజిటల్ లావాదేవీలు ఊహకు అందనంతగా పెరిగాయి. అప్పటివరకూ డిజిటల్ లావాదేవీలపై ఎంతగా అవగాహన కల్పించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కానీ కరోనా పరిస్థితులు మాత్రం ప్రజల మనస్తత్వాన్ని మార్చివేశాయి. నోట్ల ద్వారా వైరస్ అంటుకుంటుందనే భయంతో అనివార్యంగా టచ్‌లెస్ డిజిటల్ లావాదేవీలవైపు మొగ్గుచూపారు. ఫోన్‌పే(phone pay), గూగుల్‌పే(google pay), పేటీఎం(paytm) లాంటి మొబైల్ యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో ప్రభుత్వం చేయలేని పనిని కరోనా చేసిపెట్టింది.
అవినీతి, నల్లధనం కవలలు
నోట్ల రద్దు నిర్ణయంలో నల్లధనాన్ని వెలికి తీయడం ప్రధానమైన అంశం. కానీ నల్లధనం(black money) ఏ మాత్రం బైటకు రాలేదు. ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయే ఉన్నది. ఐటీ దాడుల సందర్భంగా బైటపడుతున్న నోట్ల కట్టలను చూస్తుంటే ఇది స్పష్టమవుతుంది. ఎన్నికలు జరుగుతున్నప్పుడు కార్లలో కనిపించే కరెన్సీ కట్టలే ఇందుకు సాక్ష్యం. ఈ డబ్బు ఎవరిదో తెలియదు. నాదేనంటూ ఏ పొలిటీషియన్ క్లెయిమ్ చేసుకోరు. ఇదంతా ఎవరి లెక్కలోకీ రాకుండా ఉండిపోతున్నదే. అవినీతికి పాల్పడి అక్రమంగా పోగుచేసుకున్న సొమ్మేనన్నది నిర్వివాదాంశం. నోట్ల రద్దు నిజంగా నల్లధనాన్ని అరికడుతుందనుకుంటే ఇంత భారీ మొత్తంలో కొద్దిమంది దగ్గర పోగయ్యేదే కాదు.
రాజకీయ అవినీతిని నిర్మూలించకుండా నల్లధనాన్ని అరికట్టడం అసాధ్యం. మైనింగ్, రియల్ ఎస్టేట్, ప్రైవేటు విద్యా సంస్థల వ్యాపారం చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ నాయకులు లేదా వారితో అంటకాగుతున్నవారే. భూముల క్రయ విక్రయాల్లో ప్రైవేట్ రేటు, ప్రభుత్వ రేటు అనే విభజన ఉన్నంతకాలం నల్లధనం జాడ్యం కొనసాగుతూనే ఉంటుంది. వారికి వ్యాపారం కావాలి.. వీరికి పొలిటికల్ ఫండింగ్ కావాలి.. ఈ క్విడ్ ప్రొ కో తత్వమే నల్లధనాన్ని పోగేస్తున్నది. వారే ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు ఫండింగ్ చేస్తున్నారు. ఇచ్చినవారికీ, తీసుకున్నవారికీ మాత్రమే ఈ ఫండింగ్ గురించి తెలుసు. బాహ్య ప్రపంచానికి మాత్రం ఈ ఇద్దరి మధ్య బంధం అతి పెద్ద సస్పెన్స్.
నోట్లకూ ఎక్స్‌పైరీ డేట్ ఉంటే...
నల్లధనాన్ని బైటకు తేవడానికి ఓ స్కూల్ చిన్నారి చిట్కా చెప్పింది. నేరుగా ప్రధాని మోడీకే సూచన చేసింది. ప్రతీ ప్యాకేజ్డ్ ఫుడ్‌కు, మెడిసిన్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉన్నట్లుగానే కరెన్సీ నోట్లకూ అలాంటిది పెట్టాలని సూచించింది. ఆ డేట్ ప్రకారం నోట్లన్నీ అనివార్యంగా బ్యాంకుల్లోకో, చెలామణిలోకో వచ్చేస్తాయి. ప్రతీ నోటుకు లెక్క తేలుతుంది. దాన్ని నల్లధనంగా దాచుకున్నా ఉపయోగం ఉండదు. ఐటీ సోదాల అవసరమూ లేదు. 95% మందిగా ఉన్న పేదలను నోట్ల రద్దు లాంటి నిర్ణయంతో కష్టాల్లోకి నెట్టే అవసరమూ ఉండదు.
ప్రతీ పనికి ఒక లక్ష్యం ఉంటుంది. నోట్ల రద్దుకూ అలాంటిదే ఉన్నది. తలపెట్టిన ప్రతీ పని ఆశించిన ఫలితాన్ని ఇస్తుందని భావించలేం. కానీ సాకారం కావాలనే పట్టుదలతోనే రంగంలోకి దిగుతాం. నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందనేది సమీక్షించుకోవాల్సిన అంశం. నిర్దేశించుకున్న నల్లధనం, టెర్రర్ ఫండింగ్, నకిలీ కరెన్సీ లాంటివేమీ అదుపులోకి రాలేదు. కోట్లాది మందిని ఇబ్బంది పెట్టిన నోట్ల రద్దు నిర్ణయం ఒక నిష్ఫల ప్రహసనంగా మిగిలిపోయింది. అనాలోచితమా, అతి తెలివా.. ఇలాంటి చర్చ అవసరం లేదుగానీ.. భవిష్యత్తులో ఏం చేయకూడదో మాత్రం పాలకులకు నేర్పింది.
ఎన్. విశ్వనాథ్
99714 82403
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672
Also Read....
సామాన్యులకు భారంగా మారుతున్న రైలు ప్రయాణం