వజ్రోత్సవ సంకల్పం

తిరుపతిలోని పద్మావతి బాలికల పాఠశాల పక్కన పేవ్మెంట్‌పై ఇటీవల ఓ దృశ్యం కనిపించింది. కర్నూలు నుంచి వచ్చిన సాయి ముఖంలో ఇంకా బాల్యపు

Update: 2024-06-01 00:30 GMT

తిరుపతిలోని పద్మావతి బాలికల పాఠశాల పక్కన పేవ్మెంట్‌పై ఇటీవల ఓ దృశ్యం కనిపించింది. కర్నూలు నుంచి వచ్చిన సాయి ముఖంలో ఇంకా బాల్యపు ఛాయలు పోలేదు. ఇంకా కౌమార దశ దాటలేదు. నుదుటున బొట్టు, చెవులకు దుద్దులు, తెల్లని పంచె, పొడుగు చేతుల చొక్కా, మెడలో రకరకాల దండలు, వాటిపైన కాషాయ కండువా. రోడ్డు పక్కన ఉండే ప్లాట్ ఫాం పైన ఎర్రటి దుప్పటి పరిచి ఎంత చక్కగా కూర్చున్నాడో..!

పక్కనే పంజరంలో రామచిలుక. మూడేళ్ళుగా చిలక జోస్యం చెబుతున్నాడు. రోజూ ఒకే దగ్గర కూర్చోడు. తన పదమూడవ ఏట నుంచి అతను ఈ విద్య మొదలు పెట్టాడట. సాయి సంచార జీవి. పేకల్లా కాగితాలు వరుసగా పేర్చాడు. ఓ యువకుడొచ్చి అతని ముందు కూర్చున్నాడు. అతని ముఖంలో ఏదో ఆవేదన. పంజరం తలుపు తెరిచే సరికి లోపలుండే రామ చిలుక ఎగిరిపోలేదు.. పేర్చిన కాగితాల నుంచి బుద్ధిగా ఒక కాగితం తీసి సాయికిచ్చింది. ఆ కాగితం చదివి సాయి చెప్పేస్తున్నాడు. యువకుడి మనసులో ఆందోళన. ‘‘ఈతడవైనా పాస్ అవుతానా!. పాసై ఏం చేయాలి కనుక్కో!’’, ‘‘ఈ తడవైనా ఉద్యోగ ప్రకటన వస్తుందా! వచ్చినా ఉద్యోగం నావరకు వస్తే కదా!’’ ‘‘ప్రేమించిన అమ్మాయి దక్కుతుందా! నాకు ఉద్యోగం వచ్చేవరకు ఆ అమ్మాయి నా కోసమే ఎదురు చూస్తుందా!’’ అతని మనసులో ఆవేదనను సాయి పసిగట్టేశాడు. చిన్న ఆధారం దొరికితే చాలు, దాని చుట్టూ అల్లుకుపోతాడు. ‘ఈ యువకుడు ఎప్పుడు లేస్తాడా నేనెప్పుడు చూపించుకోవాలా! ’ అని వెనుక మరో యువతి ఎదురు చూపులు.

మన నేతలు దేశ భవిష్యత్తును లిఖిస్తారు. ఇందులో లాభాల్లో నడిచే పరిశ్రమల్లో నష్టాలు ఎలా చూపించాలి అనేది అన్నింటికంటే గొప్ప విద్య. అది మన అధికారులకు తెలిసినట్టుగా మరే దేశంలో అధికారులకూ తెలియదు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్యశాస్త్రం బోధిస్తారు. విద్యార్థులు సాయిలాగా బతికేయచ్చని. ‘‘దేవాలయాలను ఉపాధి కల్పనా కేంద్రాలుగా తీర్చిదిద్దాలి ’’ అని గతంలో ఒక ముఖ్యమంత్రి సెలవిచ్చాడు. నోటి మాటే చట్టమైపోయింది. దాన్ని స్వర్ణాక్షరాలతో లిఖించేశారు. చదువుకున్న యువతరం ఇక గుళ్ల ముందు హారతి కర్పూరం, అగరొత్తులు, పూలు, పళ్ళు, కొబ్బరికాయలు అమ్మకుంటూ బతికేస్తారు. గుళ్ల ముందు చిరు వ్యాపారాలు చేయడానికి పెట్టుబడి అవసరం. అది లేకపోతే గుడి ముందర మరొక స్వయం ఉపాధి ఉంటుంది. అక్కడ కూడా తీవ్రమైన పోటీ ఉంటుంది. ఆ పోటీలో నెగ్గకపోతే ఈ భూమిపైన ఇక ఎక్కడా బతకలేరు. అది వారి ఖర్మ. చదువుకోవాల్సిన వయసులో బాలలు సాయిలాగా చిలకజోస్యాలు చెప్పుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తుంటారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సంకల్పంతో (కేంద్ర పాలకుల పరిభాషలో అమృతోత్సవమట) మన నేతలు ఉపాధి ఉద్యోగ రహిత దేశంగా భారత దేశాన్ని తీర్చిదిద్దుతారు.

- రాఘవ శర్మ

సీనియర్ జర్నలిస్ట్

94932 26180

Tags:    

Similar News