తెలంగాణ సినిమా అభివృద్ధి నమూనా

Development Model of Telangana Cinema

Update: 2024-03-09 00:45 GMT

తెలంగాణ సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి.. తెలంగాణ సినిమా పాలసీ రూపకల్పన విషయంలో ముఖ్యమైన సూచనలు చేయదలచుకున్నాను. ప్రభుత్వం ఈ సూచనలను స్వీకరించి తెలంగాణ సినిమా పాలసీని రూపొందిస్తే, తెలంగాణ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఉపాధి కల్పించగలుగుతారు. నిర్మాణం ఎంత పెరిగితే ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుంది. సమాంతర ప్రత్యామ్నాయ తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపితమై అభివృద్ధి చెందుతుంది.

కళాకారులకు సాంకేతిక నిపుణులకు 24 క్రాఫ్ట్స్‌లో శిక్షణ, సినిమా బిజినెస్‌లో రాణించడానికి ఫిలిం ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టాలి. వాటికోసం ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టి విద్యార్థులను సెలెక్ట్ చేయాలి. కోర్సు పూర్తయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడానికి కావలసిన సదుపాయాలు ప్రభుత్వం సమకూర్చాలి. అలాగే ప్రోడక్షన్ వైపు ఆసక్తి చూపే వ్యాపారవేత్తలకు సినిమా నిర్మాణంపై అవగాహన కోసం అనుభవం ఉన్న నిర్మాతలచే వర్క్ షాప్స్ కండక్ట్ చేయాలి. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక కమిటీ ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, జీవన విధానాలు, చరిత్రను, కథాంశంగా పెట్టుకొని తెలంగాణకు చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు కలిసికట్టుగా నిర్మించబోయే ప్రాజెక్టు రిపోర్ట్‌తో పాటు కథ విని, సెలెక్ట్ చేసినటువంటి సినిమాకు 25 నుండి 50 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వాలి. పన్ను మినహాయింపు చేయాలి. లొకేషన్స్ ఫ్రీగా ఇవ్వాలి. లేదా ఎన్‌ఎఫ్‌టి‌సి‌లాగా టి‌ఎఫ్‌టి‌సి‌కో ప్రొడక్షన్ చేయాలి. అప్పుడే తెలంగాణ కళాకారులకు సాంకేతిక నిపుణులకు అవకాశాలు దొరుకుతాయి. నిర్మాతలు సినిమాలు నిర్మించడానికి ముందుకు వస్తారు. అప్పుడే తెలంగాణ సంస్కృతి వెండితెరపై ఆవిష్కృతం అవుతుంది.

సినిమా నిర్మాణంలో..

టీఎఫ్‌డీసీ సినిమా నిర్మాణానికి కావలసిన కెమెరాలు, ఎడిటింగ్ సూట్లు, రికార్డింగ్ థియేటర్లు, తక్కువ ధరలకు సమకూర్చి ప్రోత్సహిస్తే, నిర్మాతకు సౌలభ్యంగా ఉంటుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. టీఎఫ్‌డీసీ సెలెక్ట్ చేసిన సినిమాకు ప్రతి థియేటర్లో రెండు షోలు తప్పనిసరిగా కేటాయించాలి. టీఎఫ్‌డీసీ డిజిటల్ స్క్రీనింగ్ ఫెసిలిటీ ప్రారంభిస్తే ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. టీఎఫ్‌డీసీ సెలెక్టెడ్ సినిమాలకు నామినల్ రేట్లు కలెక్ట్ చేసిన ఇతర కమర్షియల్ సినిమాల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. టీఎఫ్‌డీసీ ఏ సినిమాలకైతే కో ప్రొడక్షన్ చేస్తుందో ఆ సినిమాలో భాగస్వామ్యం ఉండడం వలన లాభాల్లో సముచిత వాటా దక్కుతుంది. ఇలా వచ్చిన ఆదాయంతో, తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపన అభివృద్ధి సునాయాసంగా జరిగిపోతుంది.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదీ ఉర్దూ అనగా దక్కన్ ఉర్దూలో కూడా సినిమాలు నిర్మించబడుతున్నాయి. అలాంటి సినిమాలకు కూడా పైన తెలిపిన రాయితీలు, ప్రోత్సాహకాలు సమకూర్చాలి. అప్పుడు భోజపురి లాగా దక్కని ఫిలిం ఇండస్ట్రీ కూడా తెలంగాణలో అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇలాంటి సినిమాలను టీఎఫ్‌డీసీ, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌కీ, నేషనల్ అవార్డ్స్‌కీ పంపించాలి. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర అవార్డులు ప్రధానం చేసి ప్రోత్సహించాలి. టీఎఫ్‌డీసీ సహకారంతో నిర్మించబడిన ఇట్టి సినిమాల టెలివిజన్ రైట్స్‌ని టీఎఫ్‌డీసీ కొనుగోలు చేసి ప్రభుత్వ టెలివిజన్లో ప్రసారం చేసి ఆదాయం పెంచుకోవాలి.

మినీ థియేటర్లను ప్రోత్సహించాలి

మునుపటి లాగా స్టూడియోలు కట్టుకోవడానికి, మినీ థియేటర్స్ కట్టుకోవడానికి స్థలాలతో పాటు రుణ సౌకర్యం కల్పించాలి. సినిమా రంగంలో స్థిరపడే కళాకారుల కోసం ఇండ్లు కట్టుకోవడానికి స్థలాన్ని కేటాయించాలి. అలాగే ప్రతి మండలానికి ఒక మినీ థియేటర్ ప్రభుత్వం స్వయంగా గాని, ఆసక్తి ఉన్నవారికి తక్కువ ధరకు భూమిని, రుణ సౌకర్యాన్ని కల్పించి ప్రోత్సహించాలి. అలాగే రైతు వేదికలను, మినీ థియేటర్లుగా మార్చితే బాగుంటుంది. గ్రామీణ ప్రాంతం వారు సినిమాలు చూడడానికి, పట్టణానికి వెళ్లే అవసరం ఉండదు.

ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి!

ఈ సూచనలను ప్రభుత్వం వెంటనే స్వీకరించి తెలంగాణ సినిమా పాలసీని రూపొందిస్తే, తెలంగాణ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఉపాధి కల్పించగలుగుతారు. నిర్మాణం ఎంత పెరిగితే ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుంది. సమాంతర ప్రత్యామ్నాయ తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపితమై అభివృద్ధి చెందుతుంది.

ఎన్నెన్నో త్యాగాలతో, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణకు సార్ధకత దక్కుతుంది. ఏ ఏ రంగాలలో తెలంగాణ ప్రజలు వెనకబడి ఉన్నరో, ఆ ఆ రంగాలను అభివృద్ధి పరుచుకోడానికే తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ సిద్ధించిన తర్వాత అన్ని రంగాల్లో కల్లా సినిమా రంగం పూర్తిగా విస్మరించబడింది. సుమారు ఒక దశాబ్దపు బీఆర్ఎస్ పాలనలో ఈ రంగానికి ఒరిగిందేమీ లేదు. ఇప్పుడు ఏర్పడ్డ కొత్త ప్రభుత్వమైన ఈ రంగంపై దృష్టి సారించాలి.

- సయ్యద్ రఫీ (చిత్ర దర్శకుడు)

అధ్యక్షుడు, తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం

99660 25325

Tags:    

Similar News