ఆధునిక ప్రపంచ చరిత్రలో అనేక దేశాలు రాచరికానికి స్వస్తి పలికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలుగా అవతరించాయి. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ప్రతినిధులుగా మారి రాజ్యాన్ని పాలిస్తారు. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైనది. కొన్ని ప్రజాస్వామ్య దేశాలు ద్విపార్టీ వ్యవస్థను ఎంచుకోగా.. మరికొన్ని దేశాలు బహుళ పార్టీ వ్యవస్థను ఎన్నుకున్నాయి.
1970 తర్వాతే..
స్వాతంత్ర్యానంతరం ప్రపంచ బాటలో నడిచిన భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, బహుళ రాజకీయ పార్టీల విధానాన్ని ఎంచుకోంది. ఈ బహుళపార్టీ విధానంలో వ్యక్తులు.. వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహించి ఎన్నికలలో పోటీ చేసి గెలిచి వివిధ సభలకు, వివిధ పార్టీల తరుపున ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే ఇటీవల కాలంలో వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహించి వివిధ సభలకు గెలిచిన సభ్యుల ప్రవర్తన సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది. వారి నడవడిక ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా ఉంది. వారు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఎప్పుడు పార్టీని ఫిరాయిస్తారో తెలియదు. వీరికి ప్రజాతీర్పుతో పనిలేదు. వీరికి సిద్ధాంతాలు అంటూ ఉండవు. నైతిక విలువలు తెలియవు. సర్వస్వం అధికారమే పరమావధి. తమను గెలిపించిన పార్టీని వదిలి తమ స్వలాభం కోసం ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తుంటారు. ఈ విధంగా ఎన్నికైన సభ్యుల పార్టీ ఫిరాయింపులను నిరోధించడానికి, రాజకీయాలలో అవినీతిని అరికట్టడానికి, సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు, పరిపాలనలో స్థిరత్వం తీసుకురావడానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించింది. అయితే, ఈ చట్టంలోని కొన్ని లొసుగుల కారణంగా ఎన్నికైన సభ్యుల పార్టీ ఫిరాయింపులు యథేచ్చాగా కొనసాగుతూనే ఉన్నాయి. 1970 దశకం చివరి వరకు దేశ ప్రజాస్వామ్యంలో పార్టీ ఫిరాయింపులనే సంస్కృతి లేదు. ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ పార్టీల వలనే నేడు అది మూడు పువ్వులు ఆరు కాయలుగా విలిసిల్లుతూ భారత ప్రజాస్వామ్యానికి ఒక చెదలాగా తయారైంది.
ఫిరాయింపులు కొనసాగితే..
ఈ పార్టీ ఫిరాయింపులకు కారణాలు అనేకం ఉన్నాయి. కానీ అధికారం కోసం, అక్రమ ఆస్తుల రక్షణ కోసం, డబ్బు కోసం ఆశపడి ప్రలోభాలకు లొంగి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి ఫిరాయిస్తున్నారు. ప్రజలు తమను విశ్వాసంతో గెలిపిస్తే వారు పార్టీ మారి దానిని సొమ్ము చేసుకుంటున్నారు. అందుకే నేటి ఈ పరిస్థితి మారాలంటే ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఒకసారి పార్టీ మారిన వారిని ఇంకోసారి ఎన్నికల్లో గెలిపించకూడదు. ఎటువంటి ప్రలోభాలకు లొంగని నైతిక సామాజిక విలువలు గల వారిని ఎన్నికల్లో గెలిపించాలి. ధనవంతులను పారిశ్రామికవేత్తలను కాకుండా ఉన్నత విద్యావంతులను చట్టసభలకు పంపాలి. ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టంగా మార్చాలి. అప్పుడే ఈ దేశంలో అసలైన ప్రజాస్వామ్యం వెలసిల్లుతుంది. పార్టీ ఫిరాయింపులకు చెల్లు చీటిపడుతుంది. లేదంటే ఈ రోత రాజకీయంతో ప్రజాస్వామ్యం అపహస్యం పాలవుతుంది.
- మధుకర్ మునేశ్వర్
99630 43490