నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో... తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం

Delimitation based on population is irrational, central injustice to southern States

Update: 2023-06-28 00:15 GMT

భారత పార్లమెంట్ 2014 జూన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విభజించి నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజించబడింది. 2022 జూన్ నాటికి రెండు రాష్ట్రాలు విడిపోయి దాదాపు 8 సంవత్సరాలు కావస్తున్నా నేటికి విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదు. ఈ అంశాలలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఒకటి.

కుంటి సాకులు చెబుతూ…

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 17 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 294 ఎమ్మెల్యే స్థానాలను విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు 175 స్థానాలను తెలంగాణకు 119 స్థానాలను కేటాయించడం జరిగింది. అలాగే సెక్షన్ 26 ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలను 225 కు, తెలంగాణలో ఉన్న 119 ఎమ్మెల్యే స్థానాలను 153 కి పెంచాలి అని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్రం మాత్రం, శాసనసభ స్థానాలు కానీ, పార్లమెంట్ స్థానాలు కానీ 2026 వరకు మార్చడం కుదరదని ఒకవేళ తెలుగు రాష్ట్రాల శాసనసభ స్థానాలను పెంచాలి అంటే రాజ్యాంగ సవరణ చెయ్యాలి అని కుంటి సాకులు చెబుతూ ఉండి పోయింది.

అయితే భారత పార్లమెంట్ 2019లో జమ్మూకశ్మీర్‌‌కి ఉన్న స్వతం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసి రెండు కేంద్ర ప్రాంత ప్రాంతాలుగా విడగొట్టింది. అందులో జమ్మూ కశ్మీర్‌కి అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం, లడ్డాక్‌కు అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. లడ్డాక్ పాలనను కేంద్రం చూసుకుంటుండగా, జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన కోసం 2020 మార్చిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన త్రిసభ్య డీలిమిటేషన్ కమిషన్‌ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో ఉన్న 83 శాసనసభ స్థానాలను 90 పెంచాలని నివేదిక ఇచ్చింది. ఇప్పటి వరకు కాశ్మీర్ డివిజన్ లో 46 స్థానాలు, జమ్మూ డివిజన్ లో 37 స్థానాలు ఉండేవి. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం కాశ్మీర్ డివిజన్ లో 47 స్థానాలు, జమ్మూ డివిజన్ లో 43 స్థానాలు వస్తాయి. మొత్తం 7 స్థానాల పెరుగుదలను ఈ కమిషన్ చూపించింది. వీటితో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 23 రిజర్వ్ స్థానాలు ఉన్నాయి.

డిలిమిటేషన్‌ల చరిత్ర

డీలిమిటేషన్ కమిషన్ అనగా పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం పెంచడం కోసం లోక్‌సభ సభ్యుల సంఖ్యలో, విధానసభ సభ్యుల సంఖ్యలో మార్పులు సూచించడం కోసం, అలాగే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి సిఫార్సులు చేయడం కోసం, అలాగే పెరిగిన ఎస్సీ, ఎస్టీ జనాభాకు అనుగుణంగా వారికి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడం కోసం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది ఇప్పటివరకు నాలుగు చట్టాలను చేసింది. ఈ కమిషన్ మొదటి సిఫార్సుల మేరకు లోక్‌సభలో 489+2 గా పార్లమెంట్ నిర్ణయించింది. రెండవది 1963లో 525+2 గా, మూడవది 1973లో 550+2 గా నిర్ణయించారు. అలాగే నాలుగవది 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి లోక్‌సభలోని గరిష్ట సభ్యులను 2001 వరకు మార్చకూడదని రాజ్యాంగ సవరణ చేశారు. అలాగే 2001లో 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్‌సభ లోని సభ్యులను 2026 వరకు మార్చొద్దని రాజ్యాంగ సవరణ చేశారు. కేవలం ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న రిజర్వేషన్‌లలో మాత్రమే మార్పులను సూచించింది.

కాగా 2026 లో జరిగే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ కోసం పెరిగే పార్లమెంట్ సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని తాజా నూతన పార్లమెంట్ భవనాన్ని కూడా సిద్ధం చేశారు. 2026లో జరిగే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ కోసం 2011 జనాభా లెక్కలను ఆధారం చేసుకుంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పక్కాగా అనుసరించి జనాభా పెరుగుదలను అరికట్టాయి. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణను పాటించలేదు. దీనివల్ల 2011 జనాభా లెక్కలను ఆధారం చేసుకొని నియోజకవర్గాలను పునర్ వ్యవస్థీకరిస్తే ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూరి, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక సంఘం నిధుల బదిలీ లోనూ దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతోంది. కాబట్టి 1971 జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాలని పునర్ వ్యవస్థికరణ చేసేలా దక్షిణాది రాష్ట్రాలు పోరాడాలి. లేకుంటే అన్యాయం జరిగిపోతుంది.

మనకో న్యాయం..వారికో న్యాయమా?

2014 లో విభజించిన తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాలను పునర్ వ్యవస్థీకరణ చెయ్యమంటే 2026 వరకు పెంచకూడదు అని కుంటి సాకులు చెప్పే కేంద్రం 2019 లో విభజించిన జమ్మూ కాశ్మీర్ విషయంలో మాత్రం వాళ్ళు అడక్కపోయినా నియోజక వర్గాలను పునర్ వ్యవస్థీకరిస్తోంది. అలాగే కొన్ని లక్షల కోట్ల అభివృద్ది ప్రాజెక్టులను జమ్మూ కాశ్మీర్‌లో ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాలకు హక్కుగా రావలసిన వాటిని కేంద్రం కాలరాస్తోంది. కేంద్రం కొన్ని రాష్ట్రాలకు అనుకూలంగా, ఇంకొన్ని రాష్ట్రాల విషయంలో కఠినంగా ఎందుకు ఇంత వైరుధ్యం ప్రదర్శిస్తోంది అర్థం కావడం లేదు. తెలుగు రాష్ట్రాల పాలకులు కూడా తమకు హక్కుగా రావలిసిన వాటి గురించి గట్టిగా డిమాండ్ చెయ్యడం లేదు. అటు కేంద్ర పాలకులు ఇటు రాష్ట్ర పాలకులు రాష్ట్రాల గురించి పట్టించుకోక పోవడం వల్ల ఈ రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి అన్ని రాష్ట్రాలని సమాన దృష్టితో చూసి ఏ రాష్ట్రానికి రావలసిన వాటిని ఆ రాష్ట్రాలకి ఇచ్చి రాష్ట్రాలకి అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉన్నది.

కోనేటి నరేష్,

ఎంఏ పొలిటికల్ సైన్స్.

84998 47863

Tags:    

Similar News