గ్రూప్- I పరీక్షపై తీర్పు జాప్యం.. అభ్యర్థులకు అన్యాయం!

గ్రూప్-1 అనేది రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం. ఈ ఉద్యోగాన్ని సాధించాలని నిరుద్యోగి నుంచి చిరుద్యోగి వరకు కలలు కంటారు.

Update: 2024-10-18 01:30 GMT

గ్రూప్-1 అనేది రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం. ఈ ఉద్యోగాన్ని సాధించాలని నిరుద్యోగి నుంచి చిరుద్యోగి వరకు కలలు కంటారు. స్వరాష్ట్రంలో ఈ పరీక్ష రెండుసార్లు రద్దయి ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాత గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా జారీ చేశారు. అనంతరం జూన్ 9, 2024న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అయితే, తదుపరి ఈ పరీక్ష కీ విషయంలో అనేక తప్పులు దొర్లాయి. వీటినీ టీజీపీఎస్సీ సరిచేయకుండా మెయిన్స్ రాసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీంతో చాలామంది అభ్యర్థులు అర్హత కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ పరీక్షను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలైనవి. వీటిపై గత నెల రోజులుగా అటు అభ్యర్థులు... ఇటు టీజీపీఎస్సీ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సుదీర్ఘ వాదన తర్వాత జడ్జి గారు తీర్పును రిజర్వులో పెట్టి ఈ నెల 15వ తేదీన కేసును కొట్టివేసారు. 

న్యాయవ్యవస్థలో జరిగిన ఈ జాప్యం వల్ల గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా క్వాలిఫై కానీ అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. అభ్యర్థుల పక్షాన న్యాయం జరగవచ్చని ఎంతోమంది ఆశపడ్డారు. న్యాయం గెలిస్తే మరికొంత మందికి మెయిన్స్ రాసే అవకాశం లభించేది. కోర్టు కేసు నేపథ్యంలో క్వాలిఫై అయిన అభ్యర్థులు సైతం చదువును పక్కన పెట్టి పోరాడారు. కోర్టు తీర్పు అభ్యర్థుల పట్ల సానుకూలంగా రావచ్చని ఎంతోమంది భావించారు. వాస్తవంగా అభ్యర్థుల పక్షాన న్యాయం ఉందనేది న్యాయ నిపుణుల వాదన. టీజీపీఎస్సీ గ్రూపు -1 ప్రిలిమ్స్ పరీక్షలో తప్పుడు కీ విషయంలో తెలుగు అకాడమీని రిఫరెన్స్‌గా చూడలేమని, ఇవి పరిశోధన లేకుండా రాసిన గ్రంథాలని అఫిడవిట్ ఇవ్వడమే దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో కనీసం గౌరవ హైకోర్టు అయినా జోక్యం చేసుకుని తెలుగు అకాడమీ పుస్తకాల ప్రామాణికతను నిర్ధారించి, అభ్యర్థుల పక్షాన నిలబడుతుందని అనుకున్నారు.

తీర్పుతో అభ్యర్థుల్లో ఆందోళన...

తప్పుడు సమాధానాల విషయంలో కోర్టు తుది తీర్పులో మరోసారి నిపుణుల కమిటీకి సిఫార్సు చేస్తుందని మెజార్టీ అభ్యర్థులు భావించారు. మరోవైపు ప్రధాన సమస్యగా ఉన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను ఉల్లంఘించే జీవో 29 పై ఊసే లేదు. ఎస్టీ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోట, ఈడబ్ల్యూఎస్ వంటి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ వీటినీ కాదని కోర్టు తీర్పు ఏకపక్షంగా ఉండడంతో గ్రూప్-1 ఆశావాహుల్లో అసంతృప్త జ్వాలలు రగులుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ -1 అభ్యర్థులు అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగారు. తెలంగాణ గ్రూపు -1 పై జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేస్తూ అభ్యర్థులు భారత ప్రధానికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు కూడా రాశారు. వాస్తవంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విషయంలో అభ్యర్థులు పలు మార్లు టీజీపీఎస్సీకీ వినతి పత్రం ఇచ్చారు. కానీ బోర్డు ఆ దిశలో ఆలోచించకుండా ముందుకెళ్లడంతో అభ్యర్థులు న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరిగారు. కోర్టు సుదీర్ఘ వాదనలు విని మెయిన్స్ ఎగ్జామ్‌కు ముందు కేసును కొట్టివేసింది. న్యాయమైన ఈ కేసులో ప్రతికూల తీర్పు నిజాయితీ గల అభ్యర్థులకు పాలిట శాపంగా మారింది. ఇదే తీర్పును నెల రోజులు కిందటే ఇచ్చుంటే అభ్యర్థుల గందరగోళానికి తెరపడేది. చదువుపైన దృష్టి పెట్టేవారు. న్యాయంలో జాప్యం వలన న్యాయం తిరస్కరణ అనే వాస్తవం ఈ కేసులో స్పష్టంగా కనబడుతుంది.

జీవో 29 రద్దు చేయాలి..!

హైకోర్టు తన తీర్పులో విద్యా సంబంధిత విషయాల్లో నిపుణుల అభిప్రాయాలే కీలకంగా ఉంటాయని, కోర్టులు జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదని తేల్చి చెప్పింది. టీజీపీఎస్సీ నియమించిన నిపుణుల కమిటీ జవాబుల పరిశీలన సరిగాలేదని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అలాంటప్పుడు కోర్టు మరొక నిపుణుల కమిటీకి సిఫార్సు చేసే అవకాశం లేకపోలేదు. దీంతో మరింత పారదర్శకత, స్పష్టత రావచ్చు కదా. గతంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విషయంలో కోర్టు ఇలా చేసిన సందర్భాలున్నాయి. అయినా గ్రూపు -1 పై ఇప్పటికి చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండా టీజీపీఎస్సీ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తే ఎంతోమంది ఆశావహులు అర్హత కోల్పోవచ్చు. మరోవైపు ఈ కేసు రేపు ఉన్నత న్యాయస్థానంలో నిలుస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. నిలిస్తే మాత్రం గ్రూప్-1 మెయిన్స్ 2.O కూడా రాయాల్సి వస్తుంది. గతంలో 2011 గ్రూప్ -1 ప్రిలిమ్స్ కీ విషయంలో సుప్రీంకోర్టు జోక్యంతో మెయిన్స్ పరీక్షలు ఆరు సంవత్సరాల తర్వాత రద్దయి, మళ్లీ 2016లో నిర్వహించారు. ఇప్పుడు ఒకవైపు టీజీపీఎస్సీ మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లు, మరోవైపు అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సంకట పరిస్థితుల్లో అభ్యర్థులు పరీక్ష రాయడం కష్టంగా మారింది. కావున ఇప్పటికైనా ప్రభుత్వం ,టీజీపీఎస్సీ పునరాలోచన చేసి కొన్ని నెలల పాటు పరీక్ష వాయిదా వేసి గ్రూప్-1 పై ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలి. బలహీన వర్గాల రిజర్వేషన్లకు గండి కొట్టే జీవో 29 రద్దు చేయాలి. ప్రిలిమ్స్ కీ లోని తప్పులను సరిదిద్ది మరోసారి అభ్యర్థుల జాబితా ప్రకటించాలి. ఇటీవల ప్రభుత్వం రెండు నెలల గడువుతో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కమిటీ వేసింది. దీన్ని ప్రస్తుత గ్రూప్-1 నోటిఫికేషన్‌లో అమలు చేయాలి. అప్పుడే రాజ్యాంగం కల్పించిన సామాజిక సమానత్వం సహకారమవుతుంది. 

సంపతి రమేష్ మహారాజ్,

సామాజిక విశ్లేషకులు

79895 79428

Tags:    

Similar News