ఈడీ, సీబీఐల భయంతో కొందరు విపక్ష పార్టీల నేతలు హైరానా పడి పోతున్నారు. భయంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అవినీతి నేతల చిట్టా అంతా ఈడీ వద్ద, జాతకాలతో సహా సీడీల్లో దాచి ఉన్నాయట! వాటిని ప్రస్తుత దేశ పాలకులు ఎప్పుడు తీయమంటే అప్పుడు తీయడం, ఆపమంటే ఆపడం చేస్తున్నాయి ఏజెన్సీలు. మహారాష్ట్రలో ఇప్పుడు విపక్షాలను చీల్చే బీజేపీ రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. అవినీతి పరులు ఎంతటి వారు అయినా వదిలేది లేదు అంటూనే వారు బీజేపీలో చేరడమో, లేక మద్దతు ఇవ్వడమో చేస్తే వారి ఫైల్‌ను తాత్కాలికంగా మూసి పెడుతున్నారు! మహారాష్ట్రలో ఆ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిన, మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించిన బాలా సాహెబ్ ఠాక్రే పార్టీ అయిన శివ సేన, రాజకీయ ఉద్దండుడు అయిన శరద్ పవార్ పార్టీ ఎన్సీపీలు చీలికలు పేలికలు, అవుతున్నాయి! బీజేపీ స్కెచ్ వేసి మరీ ఆ పార్టీల అస్తిత్వం లేకుండా చేయాలని సిద్ధం అయిపోయింది! ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లకు సంబంధం లేకుండా, వారి మనోభావాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఎమ్మెల్యేలు తమ చిత్తం వచ్చినట్లు వ్యవహారం చేస్తున్నారు.
పార్టీ మారితే చాలు.. ఉప ముఖ్యమంత్రే...
ఏడాది క్రితం ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఎక్‌నాథ్ షిండే భారీగా శివ సేనను చీల్చి, నాటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పదవికి ఎసరు పెట్టి, బీజేపీతో కలిసి సీఎం అయ్యాడు. మాజీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు తాజాగా ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు! ఇప్పుడు మహారాష్ట్రకు ఇద్దరు డిప్యూటీ సీఎంలు అన్నమాట! బీజేపీ శాసనసభ్యులు ఒక దిక్కు పదవుల కోసం చూస్తూ ఉన్నారు. కాని వారికి అవకాశం లేకుండా బయట నుంచి వచ్చిన షిండే సీఎం అయిపోయాడు. ఇప్పుడు అజిత్ పవార్ డిప్యూటీ సీఎం, ఆయన వెంట వచ్చిన వారిలో తొమ్మిది మంది మంత్రులు అయిపోయారు! కానీ దీనిపై శరద్ పవార్ ఇలాంటి అనుభవాలు నాకు కొత్త కాదని, పార్టీని కొత్త వారి కలయికతో నిర్మిస్తామని చెబుతున్నారు.
మోడీ మార్కు రాజకీయం ఇదే!
నిజానికి పీఎం నరేంద్ర మోడీ జూన్ 27న మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ బూత్ కమిటీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ విపక్షాలు అన్నీ 20 లక్షల కోట్ల అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయని, ఈడీ కేసుల భయం వారిని ఒక్కటి చేసిందన్నారు. అప్పుడే ఎన్సీపీలో ఉన్న వారి మీద 70 వేల కోట్ల అవినీతి కేసులు ఉన్నాయని, ఎవరినీ వదిలేది లేదని, దీనికి తాను గ్యారంటీ ఇస్తున్నాను అన్నారు మోడీ! పేద ప్రజలను, దేశాన్ని దోచుకున్న దొంగలను ఎవ్వరిని వదిలేది లేదని, విచారణ కొనసాగుతుందని అన్నారు. ఇది జరిగిన వారంలోపే జులై రెండున ఎన్సీపీ చీలింది, పాతిక వేలకోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న అజిత్ పవార్ బీజేపీ పంచన చేరి డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు. గతంలో హేమంత్ బిశ్వ శర్మ బీజేపీలో చేరి ప్రస్తుతం అస్సాం సీఎం అయిపోయినట్లు, అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయిపోయాడు.
సీఎం షిండే ఇప్పుడు తన సర్కార్ డబుల్ ఇంజన్ నుంచి ట్రిపుల్ ఇంజిన్ అయిపోయిందని అంటాడు! మహారాష్ట్ర రాజకీయాలు చూస్తే, మన పీఎం మోడీ పాలిటిక్స్ ఎలా సజీవ దస్తావేజుల్లా భారతదేశం ముందు దర్శనం ఇస్తున్నాయో స్పష్టంగా కనిపిస్తున్నది. నిన్నటి దాకా అవినీతి పరులకు శిక్ష తప్పదు అని గ్యారంటీ ఇచ్చిన పీఎం, అదే అవినీతి పరులకు, బీజేపీ పంచన చేరితే కేసుల మాఫీ గ్యారంటీ ఇస్తున్నట్లా చెప్పండి మోదీజీ! మీ కార్యకర్తలకే చెప్పండి! మీ ఈ డబుల్ ఇంజన్ రాజకీయాల గురించి చెప్పండి. మిజోరం లోనూ ఇలాంటి అవినీతి ఆరోపణలు చేసి ఎన్నికల అనంతరం అక్కడి ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు. దానికి సమాధానం లేదు! ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా, దేశ ద్రోహం కేసులు ఉన్నా, బీజేపీలో చేరితే చాలు, వారు కడిగిన ముత్యాలు అయిపోయినట్లేనా? మీ పార్టీ కాషాయ వాషింగ్ మిషన్‌లో కడుక్కుంటే సరి పోతుందా మోదీజీ? ఇందుకు మీరు గ్యారంటీ అద్భుతంగా ఇచ్చేస్తున్నారు!
మణిపూర్ మంటలపై సౌండ్ లేదు
మణిపూర్ మే 3 నుంచి మండుతున్నది,130 మందికి పైగా మరణించారు. మంత్రుల ఇండ్లు తగులబడుతున్నాయి. వేలాది ఇండ్లు నేలమట్టం అయ్యాయి. లక్షల కుటుంబాలు ఇండ్లు వదిలి క్యాంపుల్లో ఉంటున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెళ్లి బాధితులను కలిసి వచ్చారు. పీఎం కనీసం నోరు తెరువరు. ఇదేం చోద్యం భారత ప్రధాని గారు! ఇదేమి పాలన? ఇవేం రాజకీయాలు? అధికారం, ఎన్నికల యావ తప్ప మరోటి కనిపించడం లేదు! విపక్షాలను దెబ్బ తీయడం కోసం ఈడీ,సీబీఐ, ఐటీ లాంటి ఏజెన్సీలు బీజేపీకి అద్భుతంగా ఉపయోగ పడుతున్నాయి. మహారాష్ట్రలో జన్మించిన శివసేన,ఎన్సీపీలను పతనం చేయడం కోసం బీజేపీ కంకణం కట్టుకున్నది. అందుకోసం ఎలాంటి నేరారోపణలతో ఉన్న వారినైనా బీజేపీలోకి తీసుకుని, పదవులిచ్చి కేసులు మాఫీ చేయడానికి సిద్ధం కావడం చూస్తున్నాము.
బీజేపీ చరిష్మా ముఖ్యంగా, పీఎం మోడీకి జనంలో మునుపటి అంత పేరు, ప్రతిష్టలు లేకపోవడం కూడా విపక్షాలకు ప్లస్ అవుతున్నది! ఎక్కడ ఇదంతా వెరసి 2024 లో తమ అధికారం పోతుందో అనే భయం పట్టుకుని, దింపుడు కల్లం ఆశలతో రాజకీయాలు చేస్తున్నారు. ఈ కారణంగానే ఆర్థిక నేరాలు తీవ్రంగా ఉన్న అజిత్ పవార్ లాంటి వారిని వాడుకుంటున్నారు. ఎవరి దగ్గరికైనా అతి సులువుగా వెళ్లి దోస్తీ చేసుకునే ఎన్సీపీ అధినేత రేపు బీజేపీకి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం ఉండదు! కుటుంబాల రాజకీయ ప్రేమ అట్లనే ఉంటుంది! గతాన్ని, వర్తమానాన్ని చూస్తున్నాం కదా! ఏది ఏమైనా అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉండి, నిజంగానే తప్పు చేసిన వారిప్పుడు, తమ వాదనలను, సిద్ధాంతాలను పక్కన బెట్టి బీజేపీ పంచన చేరుతున్నారు! కడిగిన ముత్యాలు అయిపోతున్నారు!
ఎలా ఓట్లు అడుగుతారు?
వారే వాహ్, వాహ్ రే రాజకీయం. బీదోడికి లేదు తిన గాసం.. నిరుద్యోగికి లేదు నౌకరి.. ధరల మీద లేదు అదుపు.. బీజేపీ ఇస్తున్న సబ్కా సాత్, సబ్కా వికాస్! నినాదపు పాలన! ఔరా ఇదీ నేటి భారత దేశం! మదర్ అఫ్ డెమోక్రసీని ఇప్పుడు ఫాదర్ ఆఫ్ పవర్ అణిచి వేస్తున్న పరిస్థితిని దేశం చూస్తున్నది. ప్రజలు అంటే భయం, గౌరవం లేదు. విలువ లేదు. వచ్చే ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఓటు కోసం ఎలా పొగలం అనే సిగ్గు శరం అస్సలు లేదు! అన్నింటికీ ప్రధాని మోదీజీ గ్యారంటీ ఇచ్చారు కాబోలు. అందుకే ఇవన్నీ జరుగుతుండవచ్చు! స్వదేశంలో, విదేశంలో మోదీజీ మాట్లాడిన డెమోక్రసీ అంటే ఇదేనేమో! ఎన్నికలు, ఓట్లు, అధికారం ఇదే సరికొత్త రాజకీయం! అందుకేనేమో 2024 కాదు, 2047ను దృష్టిలో పెట్టుకుని పని చేయాలని పీఎం మోడీ బీజేపీ నేతలకు, కార్యకర్తలకు సూచిస్తున్నారు.
ఎండి. మునీర్,
సీనియర్ జర్నలిస్ట్,
99518 65223