పిచ్చి పనులు

నాకు ఫేస్‌బుక్, వాట్సాప్ ఈ రెండూ కొంత తెలుసు.

Update: 2024-06-18 00:00 GMT

నాకు ఫేస్‌బుక్, వాట్సాప్ ఈ రెండూ కొంత తెలుసు. అంటే ఆ రెండింటి తాలూకా అన్ని ఉపయోగాలు, ఉపయోగించే విధానాలు తెలుసని అర్ధం కాదు. నా అంతట నేను (నా కొడుకు సాయం లేకుండా) వాటిని వాడగలను. నాకు నాలుగైదు వాట్సాప్ సమూహాల్లో సభ్యత్వం ఉంది. చురుకుగా ఉంటాను.

వాట్సాప్ పేరు ఎలా వచ్చింది?

అన్నట్లు, అసలు వాట్సాప్ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఆంగ్లంలో, నువ్వేం చేస్తున్నావ్ అని సరదాగా ఓ విధమైన పలకరింపుగా అడగటానికి "వాట్ యు ఆర్ అప్ టు?" లేదా "వాట్సప్?" అని అడుగుతారు. దాని నుంచి వచ్చిందే ఈ పేరు. వాట్సాప్‌ని ఇలా పలకరింపులకి, లేదా ముఖ్యమైన లేదా అత్యవసర సమాచార పంపిణీకి వాడుకోవచ్చు. సమూహాన్ని సృష్టించి, దానిలో కావలిసిన వారిని చేర్చి, అందరికీ ఒకేసారి సమాచారాన్ని తృటిలో అందజేయవచ్చు. అక్షర, శ్రవణ, దృశ్య, చిత్ర రూపాల్లో సందేశాలు మేళవించి పంపుకోవచ్చు.

చదువు అంత పనికిమాలినదై పోయిందా!

కొంతమంది తెల్లవారే భగవంతుని చిత్రాలు, పూజలు, ప్రార్థనలు, భగవంతుని ఉపదేశాలకి సంబంధించిన సందేశాలు పంపుతుంటారు. ఇంకొంతమంది వారి అభిప్రాయాలు, నేతల వ్యాఖ్యానాలు, సాంఘిక, పురాణ, ఇతిహాస కథలు, బాలసాహిత్యం, కవితలు, వాతావరణ సూచనలు - ఇలా ఒకటేమిటి, అన్ని విషయాలకు సంబంధించి నిరంతర స్రవంతిలా సమాచారం ప్రవహిస్తూనే ఉంటుంది. నేను కూడా సందేశాలు విద్య, ఉపాధి, ఉద్యోగపర్వ అనుభవాల గురించి రాస్తుంటాను. విద్యకు సంబంధించి ఏదైనా రాస్తే ఎవరూ తొంగి కూడా చూడరు. చదువు అంత పనికిమాలిన వస్తువు అయిపోయింది. హాస్య సంఘటనలు, రాజకీయ విమర్శలు, ఛలోక్తులు మంచి గిరాకీ ఉన్న వస్తు విషయాలు. లోకో భిన్న రుచి అని ఊరికినే అన్నారా మరి! నాకు నచ్చినవి నేను చదివి మిగతావి వదిలేస్తుంటాను. అందరూ అంతే అనుకుంటాను. ఎవరి ఇష్టప్రకారం వారు చదివి, మిగిలినవి వదిలేస్తారు. అందులో తప్పులేదు.

రివర్స్ ఫలితాలకు కేంద్రం

అయితే కొంతమంది పంపించే సందేశాలు చికాకు, విసుగు, ఇబ్బంది కలిగిస్తాయి. వారికి ఏదో ఒక వర్గం అంటే ఇష్టం ఉంటుంది. అది ఒక మతం కావొచ్చు, ఒక రాజకీయ పక్షం కావొచ్చు, ఒక ప్రాంతం కావొచ్చు, ఒక సామాజిక వర్గం లేదా ఒక భాష కావొచ్చు. వేరే వర్గానికి వ్యతిరేకంగా ఒక కట్టుకథ తయారు చేస్తారు. దానిని నమ్మించడానికి ఏదో ఒక వార్తాపత్రికలో ప్రచురించినట్టొ, లేదా ఏదో ప్రభుత్వమో అన్నట్టు, లేదా పోలీసు వర్గాలు చెప్పినట్టు అనిపించేట్టు తెలియజేస్తారు. పూర్తి వివరాలు ఉండవు, వార్తాపత్రిక పేరు, తేదీ ఉండదు. సత్యాన్ని ప్రేమించేవారు కొంచెం ప్రయత్నం చేస్తే అది ఒట్టి అబద్ధం అని తేలిపోతుంది. ఆ వార్తను ఎవరు ప్రారంభించారో ఎవరికీ తెలియదు. వారు ఏ పక్షానికి మద్దతుగా రాసారో దానికి చెడ్డ పేరు వస్తుంది. దేనికి వ్యతిరేకంగా రాసారో దానిపై సానుభూతి కలుగుతుంది. దానికి వ్యతిరేకంగా రాయడానికి ఏ విషయం లేని కారణంగా ఇటువంటివి కల్పించి రాస్తున్నారని అభిప్రాయం కలుగుతుంది. అటువంటి కట్టుకథలు చదవడానికి చాలా అసహ్యం వేస్తుంది. ప్రారంభించిన వారే కాకుండా పంపించినవారి మానసిక పరిస్థితిపై అనుమానం వస్తుంది, ఎందుకంటే వారి కళ్ళు వారి వేళ్లతోనే పొడుచుకుంటున్నారు కాబట్టి.

నవ్వులపాలయ్యే సందేశాలు

ఇంకో రకం సందేశాలుంటాయి. వాటి ఉద్దేశ్యం మంచిదే. వారు ఏదో ఒక నీతి కథ చెబుదామనుకుంటారు. ఉదాహరణకి, దొంగతనం మంచిది కాదు అని. అది చెప్పడానికి ఆ విషయం చుట్టూ ఒక కథ అల్లుతారు. అది కూడా మంచిదే. అయితే, ఈ కథ తయారీలో మసాలా చొప్పించడానికి ఏ మహనీయుడి (గాంధీ, వివేకానందుడు, భగత్ సింగ్) పాత్రనైనా వాడుకుంటారు. అది వారి జీవితంలో జరిగిన యదార్థ సంఘటనగా చెబుతారు. ఇలాంటి కథలు ప్రచారంలోకి వచ్చాక, ఏది నిజమో, ఏది కల్పితమో తెలియకుండా పోతుంది. అలాంటి పిచ్చి పనులు చేయవద్దని నా విన్నపం. కథని, కథలాగే చెప్పండి. కథలో కృత్రిమంగా మహనీయుల పేరు వాడుకుని, ఏమి నీతి చెబుదామనుకున్నారో దాన్ని, నవ్వులపాలు చేయవద్దు.

ప్రొ. సీతారామరాజు సనపల

డీ.ఆర్.డీ.ఓ. పూర్వ శాస్త్రవేత్త

72595 20872

Similar News