ప్రాధాన్యత కోల్పోతున్న పెద్దల సభలు
ప్రాధాన్యత కోల్పోతున్న పెద్దల సభలు... Council members, rajyashaba members losing importance
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యానికి, విశ్వాసాలకు ప్రతీకలుగా, రాజ్యాంగ బద్దంగా శాసన ప్రక్రియలో ప్రధానమైన చట్టసభలు నేడు స్వార్థ రాజకీయ పార్టీలకు ‘అడ్డాలు’గా మారాయి. ప్రజాస్వామ్య పాలనలో కేంద్రంలో పార్లమెంట్, లోక్ సభ, రాజ్యసభలు, రాష్ట్రాలలో శాసనసభ, శాసనమండలి పేర్లతో చట్టసభలుగా ఉండి ఆయా సభ్యుల మెజారిటీ నిర్ణయాలతో, ప్రజా ప్రయోజనాలు కాపాడుతూ రాజ్యాంగ బద్దంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన సాగిస్తాయి.
కేంద్రంలో లోక్‌సభకు రాష్ట్రంలో శాసనసభకు రాజకీయ పార్టీల తరఫున ప్రజలు నేరుగా ఓటు వేసి వారిని ఎన్నుకుంటారు. దీంతో వారు పార్టీ అధినేతకు లోబడి పని చేస్తారు. అలాగే కేంద్రంలో రాజ్యసభ సభ్యులను ఎంపీలుగా, రాష్ట్రంలో శాసనమండలికి ఎమ్మెల్సీలుగా ఎన్నుకొంటారు. ఈ సభ సభ్యులనే కేంద్రలో రాజ్యసభ, రాష్ట్రంలో శాసనమండలి అంటారు. అయితే వీరి ఎంపికలో వివిధ రంగాల్లో మేధావులు, ప్రముఖులు, విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు, కళా, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రముఖులను రాజ్యసభకు రాష్ట్రపతి కోటాలో కొంతమందిని, పార్లమెంట్ సభ్యుల సంఖ్య పరంగా కొంతమందిని నామినేట్ చేస్తారు. రాష్ట్రంలో కూడా ఇదే విధంగా గవర్నర్, శాసనసభ్యులు ఎన్నుకుంటారు. వీరే కాకుండా ప్రతి మూడు జిల్లాలకు ఒకరు చొప్పున ఉపాధ్యాయ వర్గాలు, పట్టభద్రులు ప్రతి జిల్లా స్థానిక సంస్థల నుండి శాసనమండలికి సభ్యులుగా ఎమ్మెల్సీలుగా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలలో ఓటర్లుగా ఉపాధ్యాయ వర్గాలకు టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఆ జిల్లాలో ఉన్న పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటారు. వారు ఓట్లు వేసి వారిని గెలిపించుకుంటారు. అయితే, రాను రాను పెద్దల సభగా పిలవబడే రాజ్యసభ, శాసన మండలి సభ్యుల ఎంపిక, ఎన్నిక ఆయా సభల ఉద్దేశ్యానికి, ప్రాధాన్యతలకు భంగం కలిగిస్తున్నాయి. పాలక పక్షాలకు అండగా ఉండే ఆయా పార్టీల సీనియర్ రాజకీయ వ్యక్తులను రాష్ట్రపతి, గవర్నర్లుగా నియమించుకొని ఆయా సభ్యులను వారిచే నామినేట్ చేసుకుంటున్నారు. వీరు దిగువ సభలో తీసుకోబోయే, తీసుకున్న నిర్ణయాలు ప్రజాహితంగా, ప్రయోజనకరంగా ఉన్నయా లేదా? అన్న పరిశీలన జరిపి, అవసరమైతే తగు సూచనలు ఇచ్చి ఆ నిర్ణయాలను వడపోసి మార్పు కోసం పరిశీలన, మార్పులను తెలిపేందుకు అవసరమైతే తిప్పి పంపేందుకు ఏర్పడినవే ఈ పెద్దల సభలు. అంటే మెరుగైన మేలైన నిర్ణయాల కోసం రాజ్యాంగం మనకు ఇచ్చిన ‘రెండో జల్లెడ’ ఈ పెద్దల సభలు అని చెప్పుకోవచ్చు.
తిరస్కరించిన వారిని ఎన్నుకొని
ఇంతటి ప్రాధాన్యత ఉన్న పెద్దల సభలు నేడు నిర్వీర్యం కాబడుతున్నాయి. అందుకే ప్రజల ఆకాంక్షలకు దూరంగా, పార్టీల ఆశయాలకు అనుగుణంగా ఆ సభ్యులు వ్యవహరిస్తున్నారు. అందువలన ప్రజాహిత నిర్ణయాలు వడపోత లేకుండా అమలవుతూ వైఫల్యాలకు దారితీస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం. పాలక రాజకీయ పార్టీలు ఆ సభలకు నామినేట్ చేసే అర్హతలను మరవడంతో ఆయా పాలక రాజకీయ పార్టీలకు వారి కార్యకర్తలకు పునరావాస కేంద్రాలుగా మారాయనడానికి అనేక సందర్భాలు సాక్ష్యాలుగా ఉన్నాయి. అంతేందుకు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో జరగబోతున్న శాసన మండలి సభ్యుల ఎంపిక తీరు కూడా దీనికి అద్దం పడుతుంది. స్థానిక సంస్థలలో కనీసం వార్డు సభ్యులు కాని వారిని, పార్టీ కార్యకర్తలను, గత ఎన్నికలలో ప్రజలు తిరస్కరించిన వారిని, పార్టీకి విరాళాలు అందించిన వారిని గవర్నర్ కోటాలో ఎన్నుకుని ప్రోత్సహిస్తున్నారు. దీని వెనుక పెద్దల సభలో మేధావులకు బదులుగా వారి పార్టీ కార్యకర్తలను, అర్హత లేని అనుచరులను నింపుకొని, తమ అవినీతి, అడ్డగోలు పాలనా నిర్ణయాలు అడ్డం లేకుండా ఏకగ్రీవంగా అమలు చేసుకునేందుకు జరుగుతున్న రాజకీయ కుట్రగా మనం భావించాలి. దీనిలో భాగంగానే ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును, రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం అమలు నిర్ణయాన్ని శాసనసభలో ఆమోదించినా, పెద్దల సభ కొన్ని మార్పులు కోరుతూ సెలెక్ట్ కమిటీకి పంపుతూ తీర్మానం ద్వారా తిప్పిపంపితే, దాన్ని సహించని ప్రభుత్వం ఏకంగా శాసనమండలి రద్దు కోసం మండలిలో తీర్మానం చేసిన సంగతి మనం గుర్తు చేసుకోవాలి.
పారదర్శకంగా నామినేట్ చేయాలి
అలాగే గవర్నర్ కోటా నామినేటెడ్ సభ్యుల విషయంలో కూడా ప్రభుత్వాధినేతల ప్రమేయంతో అనర్హులు నేర చరిత్ర కలవారు పెద్దల సభకు ఎంపిక కాబడుతున్నారు. కాబట్టి పెద్దల సభకు సభ్యులుగా ఎన్నుకునే ప్రక్రియలో సమూలంగా చట్ట సవరణ చిత్తశుద్ధితో జరగాలి. రాష్ట్రపతి, గవర్నర్లు ఆయా సభ్యులను నోటిఫికేషన్ ద్వారా మేధావులనే పారదర్శకంగా ఎంపిక చేయాలి. అలాగే స్థానిక సంస్థలకు జరిగే ఎంపికలో కనీసం 5 సంవత్సరాలు ఆయా స్థానిక సంస్థలలో ప్రతినిధిగా పనిచేసి ఉండాలన్న కనీస నిబంధన ఉండాలి. ఈ ప్రక్రియలో గతంలోవలే సర్పంచులకు కూడా ఓటు హక్కు కల్పించాలి. నిజమైన ప్రజాస్వామ్యంలో
చట్టసభలలో చట్ట సభ్యుల పనితీరు, ప్రజాప్రయోజనాలపై జరిగే చర్చల ద్వారానే వారి పరిపాలనకు కొలమానంగా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు నేటి రాజకీయాలలో పార్టీలు, పాలకుల తీరుతో చట్టసభలలో మెజారిటీ సభ్యులుగా సేవాభావం కొరవడిన నేరస్థులు, అసమర్ధుల సమూహంతో నిండిపోయి, నిరంతర రాజకీయ పార్టీల ఎత్తుగడలు, బూతు పురాణాలు తప్ప, ప్రజా సమస్యల పట్ల చర్చలే లేని చట్ట సభలుగా తయారయ్యాయి. ఇది ప్రజాస్వామ్యం మనుగడకు ప్రమాదకరం. ఈ విధానాలతో సామాన్యుడి జీవన స్థితిగతులు మారకపోగా మరింతగా దిగ జారిపోతున్నాయన్నది వాస్తవం. దీనిపై ప్రజలు చైతన్యం తెచ్చుకొని శాసనమండలి సభ్యలను ఎన్నుకోవాలి. ఆ స్ఫూర్తితో రాజకీయాలకు అతీతంగా మార్చి 13న జరిగే పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు నిజాయితీతో సేవా భావం కలిగిన మంచి అభ్యర్థులను ప్రజా ప్రతినిధులుగా ఎంపిక చేసుకోవడం ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యమునకు, ప్రజల భాగస్వామ్యానికి విలువ, విశ్వాసం పెరుగుతుందని ఆశిద్దాం.
జి.వీరభద్రా చారి
తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి.
63017 96606