ఉపఎన్నిక వలనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమా? రాజీనామా తీసుకొచ్చిన విజయాలేంటి?
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష
2014 నుండి ఇప్పటివరకు బీజేపీ తన బలం పెంచుకుంటూ వస్తున్నది. 2019లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించింది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించింది. మునుగోడుకు ఐదుసార్లు కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించారు. ఇపుడు పొంతన లేని సాకులు చెప్పి టీఆర్‌ఎస్ పంచన చేరారు. ప్రగతిశీల శక్తులు కలిసి పనిచేయాలంటూ కొత్త భాష్యం చెబుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రగతిశీల పార్టీ ఎట్లా అవుతుందో కమ్యూనిస్టు మేధావులు చెప్పాలి. పచ్చి మతతత్వ ఎంఐఎంతో అంటకాగే టీఆర్‌ఎస్ ఎలా లౌకికపార్టీ అవుతుందో వామపక్ష శ్రేణులు ఆలోచించాలి. ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌ది.
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల మీద టీఆర్‌ఎస్ చూపెడుతున్న వివక్షకు నిరసనగా మరో ఉద్యమం జరగబోతోంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, ఆయన కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు మాత్రమే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి.
ఇతర నియోజకవర్గాలను, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై వివక్ష చూపడం రాజ్యాంగ ఉల్లంఘనే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు మారతాయని సకల జనులు, సబ్బండ వర్గాలు ఎంతో ఆశపడ్డారు. ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులు, వారి బంధువులు మాత్రమే బాగుపడ్డారు. ఉద్యమంలో ముందుండి పోరాడిన సబ్బండవర్గాలకు, సకల జనులకు తెలంగాణ రాష్ట్ర ఫలాలు అందని ద్రాక్ష గానే మిగిలిపోయాయి.
అక్కడి నుంచే సమాధానం
ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో చెప్పాలంటూ కొందరు అమాత్యులు ఇటీవల వేస్తున్న ప్రశ్నలకు మునుగోడు ప్రజలు దీటుగానే సమాధానమిస్తున్నారు. ఇంకా సంవత్సరం కాలం పైగా ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉన్నా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో ఈ రోజు ప్రజల కంటి ముందు సాక్షాత్కారం అవుతోంది. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న పనులకు ఆగమేఘాల మీద మోక్షం లభిస్తున్నది. ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి సాధ్యమైతదని దుబ్బాక, హుజూర్‌నగర్, నాగర్జునసాగర్, హుజురాబాద్ ఎన్నికలతో తెలిసొచ్చింది. రాజీనామా చేస్తేనే మునుగోడు అభివృద్ధి సాధ్యం అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలు నిజమైతున్నాయి.
ఆయన రాజీనామా చేశాకే డిండి లిఫ్ట్ నిర్వాసితులకు రూ.116 కోట్లు విడుదలయ్యాయి. చేనేత బీమాకు చలనం వచ్చింది, మునుగోడులో రోడ్లు, బ్రిడ్జిలకు రూ. ఏడు కోట్లు, అంగన్‌వాడీ భవనాలు, యువజన సంఘాల భవనాల నిర్మాణానికి నిధులు వచ్చాయి. సీసీ రోడ్లకు ప్రతిపాదనలు వస్తున్నాయి. మిషన్ భగీరథ పనులు మొదలవుతున్నాయి. మునుగోడుకు తొమ్మిది వేల ఆసరా పెన్షన్లు కొత్తగా మంజూరు చేశారు. సర్పంచుల పాత బిల్లులకు మోక్షం లభిస్తున్నది. పెండింగ్‌లో ఉన్న హామీలూ క్లియర్ అవుతున్నాయి. గౌడన్నలను ఆకట్టుకోవడానికి సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ ఉప ఎన్నిక తీసుకొచ్చిన విజయాలు కావా? టీఆర్‌ఎస్ పక్షపాత పాలనకు ఇంతకు మించిన సాక్ష్యాలు ఏం కావాలే?
ఆత్మగౌరవం కోసమే
ప్రతిపక్ష ఎమ్మెల్యే కేసీఆర్ ముందు చేతులు కట్టుకుని నిలబడితేనే పనులు అవుతాయి. లేదా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాగా ఆత్మగౌరవంతో పదవులను త్యాగం చేస్తే కేసీఆర్ దిగివస్తారు. ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్‌రెడ్డిపై విమర్శలకు దిగుతున్నారు. తాము మునిగిపోతున్న పడవలో ఉన్నామనే వాస్తవాన్ని వారు ఇంకా గుర్తించినట్లు లేదు. 2014 నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలోనూ విజయం సాధించలేదు. ఎమ్మెల్యేలు అంగట్లో సరుకులాగా అమ్ముడుబోయారు. స్థానిక సంస్థల ప్రతినిధులు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలలో కాంగ్రెస్ పట్ల విశ్వాసం సన్నగిల్లిందనే విషయం వారికి అర్థం కావడం లేదు. 2014 నుండి ఇప్పటివరకు బీజేపీ తన బలం పెంచుకుంటూ వస్తున్నది.
2019లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించింది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించింది. మునుగోడుకు ఐదుసార్లు కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించారు. ఇపుడు పొంతన లేని సాకులు చెప్పి టీఆర్‌ఎస్ పంచన చేరారు. ప్రగతిశీల శక్తులు కలిసి పనిచేయాలంటూ కొత్త భాష్యం చెబుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రగతిశీల పార్టీ ఎట్లా అవుతుందో కమ్యూనిస్టు మేధావులు చెప్పాలి. పచ్చి మతతత్వ ఎంఐఎంతో అంటకాగే టీఆర్‌ఎస్ ఎలా లౌకికపార్టీ అవుతుందో వామపక్ష శ్రేణులు ఆలోచించాలి. ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌ది. ఉద్యోగులకు కనీసం సమయానికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి. పెన్షనర్ల ఇబ్బందులు అంతా ఇంతా గాదు. మునుగోడులోనే కాదు, భవిష్యత్‌లో జరగబోయే శాసననభ ఎన్నికలలోనూ బీజేపీ విజయం సాధిస్తుంది. 'తెలంగాణ గడ్డపైన దండు పుట్టిందిరో, తెలంగాణ వచ్చినా మా గోస తీరలేదురో' అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారంతో టీఆర్‌ఎస్ నాయకుల గుండెలలో రైళ్లు పరుగెడుతున్నాయి.
డా. గంగిడి మనోహర్‌రెడ్డి
ఉపాధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ
ప్రముఖ్, ప్రజా సంగ్రామ పాదయాత్ర