ఓట్లు కావాలే... బీసీల కులగణన వద్దా!?
Congress raises pitch for caste-based census in karnataka
రాజకీయ నాయకులకు ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీసీల ఓట్లుమాత్రం కావాలి, ఓటు వేసే పని యంత్రాలు గానే వారు జీవిత కాలం బానిస బతుకులు బతుకవల్సిందేనా? స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచినప్పటికీ బీసీల జనాభాను లెక్కించేందుకు పాలక వర్గాలు ఎందుకు జంకుతున్నాయి, ఓటు బ్యాంకు చీలిపోతుందనినా? పార్లమెంట్, అసెంబ్లీలో సగం వాటా కోల్పోతామనే భయంతోనేనా? బీసీ కులగణన చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు. కులగణన లేకుంటే వెనుకబడిన తరగతుల సామాజిక పరిస్థితులు, జనాభా దామాషా ప్రకారం అవకాశాలు లభిస్తున్నాయా లేదా అనేది ఎలా తెలుస్తోంది? ఈసారి మీకు ఓట్లు కావాలంటే.. బీసీ కులాల వారీగా లెక్కలు తేలాల్సిందేనని సబ్బండ బీసీ కులాలు సంఘటితమౌతున్నాయి.
రిజర్వేషన్ల పరిస్థితి దారుణం…
కులాల వారీగా జనాభా లెక్కలు లేనందు వల్ల రిజర్వేషన్లు ఎంత శాతం నిర్ణయించాలని అంశంపై మొదటి నుంచి కన్‌ఫ్యూజనే. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం జరిపిన కులాల వారీ లెక్కలపై ఆధారపడి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ లెక్కలు జాతీయస్థాయిలో ఒకేలా లేవు. జనాభా అభివృద్ధి రేటు కూడా అన్ని కులాల్లో ఒకే రకంగా లేదు. అందుకే జనాభా లెక్కలను కులాల వారీగా చేపట్టాలని 1953లో కేంద్రం నియమించిన కాకా కాలేల్కర్ కమిషన్, 1978 లో నియమించిన మండల్ కమిషన్లు చేసిన సిఫార్సులకు నేటికి అతీగతీ లేకపోవడం అన్యాయం. బీసీ గణన లేకపోవడం మూలంగా దేశంలో ప్రస్తుతం అమలవుతున్న బీసీ రిజర్వేషన్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇతర సామాజిక వర్గాల వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు మాత్రం 27 శాతం అత్తెసరు రిజర్వేషన్లు అమలు చేయడం. ఇందులో కూడా ఏ కులానికి లేని క్రిమీలేయర్‌ను బీసీలపై మాత్రమే విధించడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. కేంద్రీయ విద్యాలయాలలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో క్రిమీలేయర్ మూలంగా బీసీలకు ఈరోజు 13 శాతం మించి రిజర్వేషన్లు అమలు కావడం లేదని పార్లమెంటులో సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. దేశంలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కిందకు రాని వెనుకబడిన కులాల జనాభా భారీ సంఖ్యలో ఉంది. కానీ వారికి సంబంధించిన కచ్చితమైన వివరాలేవీ అందుబాటులో లేవు.
భారత రాజ్యాంగంలోని 15(4)(5), 16(4)(5) ప్రకారం వెనుకబడిన కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని ఉంది. అలాగే రాజ్యాంగంలోని 243 D-(6), 243T-6 ప్రకారం స్థానిక సంస్థల్లో వెనుకబడిన రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టంగా ఉంది కూడా.... కానీ బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి సిఫార్సులు చేయాలంటే జనాభా లెక్కలు కావాలి కదా.పైగా ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు, రిజర్వేషన్లకు, పరిపాలనా సౌలభ్యం కోసం కులాల వారి లెక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే రాజ్యాంగంలో బీసీ కులాల రక్షణకు, అభివృద్ధికి సంబంధించి అనేక ప్రొవిజన్స్, ఆర్టికల్స్ ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే ప్రభుత్వాలు తూతూ మంత్రంగా మాటల్లో చెప్పి , చేతల్లో చూపించక పొవడం బీసీల అనైక్యతకు తార్కాణంగా చెప్పుకోవచ్చు.
రాష్ట్రాలు తీర్మానం చేసినా...
బీసీ కులాల గణనను చేపట్టడం వలన రాజ్యాంగంలోని ఆర్టికల్ 15,16 ప్రకారం విద్యా సంస్థలు, ప్రభుత్వరంగంలో వెనుకబడిన కులాలకు కల్పించిన రిజర్వేషన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేసే సౌలభ్యం కలుగుతుంది. జనాభా లెక్కల సేకరణతోపాటు బీసీ కులాల గణనను కూడా చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానంచేసి, కేంద్రానికి పంపిన విషయం అందరికీ తెలిసిందే, అంతేకాకుండా బీసీ కులాల గణనకు మానవనరులను సమకూర్చడంతోపాటు అన్ని విధాలా సహకరించడానికి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. జనాభా లెక్కల సేకరణలోనే బీసీ కులాల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని తెలిపే కుల గణనను చేర్చడం ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ కూడా కానప్పుడు చేర్చడం ద్వారా ప్రభుత్వాలకు జరిగే నష్టమేమిటో ప్రభుత్వాలే నిజాయితీగా చెప్పాలి.
కోర్టులను ఖాతరు చేయరా?
భారతదేశంలో చివరికి కోర్టు తీర్పులు అమలు చేయడానికి కూడా ప్రభుత్వాలు ఎన్నో కారణాలు చెబుతూ, వాటిని ఓ మూలకి విసిరి వేస్తున్నారు. ఎన్నోసార్లు పెద్ద కోర్టులు జోక్యం చేసుకుని రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పుడు లేదా రిజర్వేషన్లు పెంచిన సందర్భాల్లో జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెడుతున్నారో లేదా పెంచుతున్నారో చెప్పాలని ప్రభుత్వాలను నిలదీసినప్పటికి. అసంబద్ధమైన కారణాలు, అనవసర జవాబులతో తప్పించుకుంటున్నాయి, గతంలో మండల్ కమిషన్ కేసు సందర్భంగా బీసీ రిజర్వేషన్లు పెంచినప్పుడు. అలాగే 1986లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మురళీధర్‌రావు కమిషన్ సిఫార్సు ప్రకారం ఎన్టీఆర్ బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 44 శాతానికి పెంచినప్పుడు కూడా కోర్టులు జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని, పెంచిన రిజర్వేషన్లను కొట్టేసిన విషయం అందరికీ తెలిసిందే. 2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక ప్రభుత్వ కేసు సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు కూడా ఆ రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు కొట్టేసింది. జనాభా లెక్కలు శాస్త్రీయంగా ఉంటే ఆ మేరకు పెంచుకోవచ్చని స్పష్టమైన తీర్పులు ఇచ్చినప్పటికీ వెనుకబడ్డ తరగతులు నేటికి సరిగ్గా అర్థం చేసుకున్నట్లు అనిపించడం లేదు!
విలువలేని బీసీ కమిషన్లు....
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కమిషన్లను ఏర్పాటు చేస్తున్నప్పటికీ. వాటికీ రాజ్యాంగ బద్దమైన అధికారాలు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో డమ్మీ గా మారిపోతున్నాయి, ఇంచుమించు 9 దశాబ్దాల క్రితం 1931 లో తీసిన జనాభా లెక్కలపై ఇప్పటికీ ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం బీసీ కులాలను మోసం చేయడమే కదా! అలాగే జనాభా అభివృద్ధి రేటు అన్ని కులాల్లో ఒకేలా లేదు. మత విశ్వాసాలు, సంప్రదాయాల కారణంగా కొన్ని వర్గాలు కుటుంబ నియంత్రణ పాటించకపోవడంతో వృద్ధి రేటులో కూడా చాలా తేడాలున్నాయి. గతంలో కేంద్రం నియమించిన కాకా కాలేల్కర్ కమిషన్ 1961లో, అలాగే 1978లో నియమించిన మండల్ కమిషన్ కూడా బీసీ జనాభా లెక్కలు తీయాలని సిఫార్సు చేసినప్పటికీ వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
కులగణన అంతా కష్టమా?
‘కులగణన చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని, అది ఆచరణలో సాధ్యం కాద’ని కేంద్రం వితండవాదం చేస్తున్నది. మన దేశంలో కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేక డొంకతిరుగుడు వాదనలు చేస్తున్నది. ప్రస్తుతం కేంద్రంలో తన దగ్గర ఉన్న ఓబీసీ జాబితాలో 2,642 కులాలున్నాయి. రాష్ట్రాల జాబితాలో 2,892 బీసీ కులాలున్నాయి. 2011లో జరిగిన జనగణనలో ఎస్సీలు 1,234 కులాలు, ఎస్టీలు 698 కులాలు ఉన్నట్లు తేల్చారు. వాస్తవంగా ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకులాలు అన్ని కులాలను కలిపినా 6 వేలకు మించవు. మరి అలాంటప్పుడు పొంతనలేని విధంగా లక్షల కులాలు ఉపకులాలున్నాయనే వితండవాదన చేయటం ఏ మాత్రం మంచిది కాదు. మరీ ఎస్సీ ఎస్టీ కులాలకు లేని అవరోధాలు, దేశంలో మెజార్టీ జనాభా కలిగిన కేవలం బీసీల జనగణనకే ఇబ్బందులు ఎందుకూ ఎదురవుతున్నాయో అర్థం కావడంలేదు..
డా. బి. కేశవులు నేత. ఎండీ.
చైర్మన్ తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659