మరోకోణం: నోటి దూల వారికి అలవాటే!
మరోకోణం: నోటి దూల వారికి అలవాటే!.... congress party destroying because of party leaders loose tongue says markandeya
అధికారమివ్వడం ప్రజల వంతు.. వచ్చిన అధికారాన్ని పోగొట్టుకోవడం కాంగ్రెస్ నేతల వంతు'' అన్నది పాత సామెత. ''నోటి దూల నేతల వంతు.. ఓడించడం ప్రజల వంతు'' అనేది కొత్త సామెత. తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ తప్పదని, సెక్యులర్ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ కలువక తప్పదని ఆయన చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. అలా అనలేదని, తన మాటలను మీడియా వక్రీకరించిందని ఆ తర్వాత బుకాయించినా వీడియో సాక్ష్యం ప్రజల ముందు ఉండనే ఉంది. ఈ పరిణామాలపై పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి తదితర నేతలు నేరుగా మాట్లాడడానికి వెనుకాడినా, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే స్పందించారు. బీఆర్ఎస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలువబోమని, పొత్తులపై వరంగల్ సభలో రాహుల్ చేసిన ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి వున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమంటూ..
నోటి దూలతో పార్టీకి నష్టం చేకూర్చడం తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్తదేమీ కాదు. 2009 చిదంబరం ప్రకటన వచ్చాక, అధిష్టానం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలమని తెలిసాక కూడా ఆ పార్టీ నేతలెందరో తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. అప్పటి కేంద్రమంత్రి బలరాం నాయక్, ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, సర్వే సత్యనారాయణ, మంత్రి దానం నాగేందర్ వంటి లీడర్లు పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవారే. రాజయ్యపై తెలంగాణ వాదుల దాడి, ఉద్యమకారులపై నాగేందర్ లాఠీ ఝళిపించడం అప్పట్లో సంచలనం సృష్టించాయి. 2014 ఎన్నికల ప్రచారంలో బలరాం నాయక్ చేసిన వ్యాఖ్యలు ఫలితాల్లో పార్టీకి అశనిపాతంగా పరిణమించాయి. అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న జైరాం రమేశ్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా వ్యక్తిగతంగా తాను తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమంటూ మాట తూలారు. కాంగ్రెస్ నేతల ఈ వ్యాఖ్యలను కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పదునైన ఆయుధాలుగా మలుచుకున్నారు. తెలంగాణ ఆశలకు, ఆకాంక్షలకు కాంగ్రెస్ వ్యతిరేకమని ప్రజలను కన్విన్స్ చేయగలిగారు. ఫలితంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కేవలం 21 స్థానాలకే పరిమితమైంది.
అవే కేసీఆర్‌కు అస్త్రాలుగా మారి..
2018 ముందస్తు ఎన్నికల్లో సైతం ఇదే సీన్ రిపీటయ్యింది. ఒకవైపు కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన టీడీపీతో పొత్తుకు సిద్ధపడింది. చంద్రబాబు అండదండలు ఆశించిన అగ్రనేతలు సెంటిమెంటు ప్రభావాన్ని పట్టించుకోలేదు. ఈ మేరకు హైకమాండ్‌కు నివేదికలు పంపించి ఒప్పించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉత్తమ్, రేవంత్ సహా పలువురు నేతలు అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలు ఒకవైపు.. ఖమ్మం, హైదరాబాద్ సభల్లో చంద్రబాబు చేసిన ప్రసంగాలు మరోవైపు.. కేసీఆర్‌కు అద్భుతమైన అస్త్రాలు అందించాయి. ఫలితంగా సెంటిమెంటు పండి, రైతుబంధు తోడై 88 సీట్లు వచ్చి భారీ విజయం టీఆర్ఎస్ సొంతమైంది. అధికారం తమదేనని ప్రకటించిన కాంగ్రెస్‌కు కేవలం 19, టీడీపీకి రెండు స్థానాలే రావడం గమనార్హం.
తరచూ డామేజింగ్ కామెంట్స్ చేస్తూ..
ప్రస్తుత పరిస్థితి చూసినా, 2014, 2018లలో చేసిన పొరపాట్లనే పీసీసీ మరోసారి పునరావృతం చేస్తున్నదా.. అనిపించక మానదు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షులైనప్పటి నుంచి సీనియర్లందరూ ఆయనతో ఎడమొఖం పెడమొఖంగానే ఉంటున్నారు. జానారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ వంటి నేతలు మౌనంగా ఉంటూ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. జగ్గారెడ్డి, వీహెచ్, మధు యాష్కీ, మహేశ్‌కుమార్ గౌడ్, మహేశ్వర్‌రెడ్డి వంటి వాళ్లు తరచూ డామేజింగ్ కామెంట్స్ చేస్తూనేవున్నారు. రేవంత్ సైతం రాజకీయాల్లో రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం పైన అనవసర వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు. ఇక తాను బీజేపీకి వెళతానంటూ కాంగ్రెస్‌పై పలు విమర్శలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏడాది పాటు సాగదీశారు. మునుగోడు ఉపఎన్నికకు ముందు వెంకట్‌రెడ్డి సైతం బ్యాలట్ పోరుకు నష్టం చేకూర్చే కామెంట్లు చేశారు. చివరకు ఆ ఎన్నికలో పార్టీకి డిపాజిట్ దక్కలేదు. పాదయాత్ర చేస్తానని రేవంత్ ప్రకటించగానే ఆయనెక్కడ పాపులర్ అయిపోతాడోనని కొందరు హైకమాండ్ పర్మిషన్ లేదని అడ్డుపుల్లలు వేశారు. తాము కూడా అలాంటి యాత్రలే చేస్తామని దరఖాస్తు చేసుకున్నారు. మధ్యేమార్గంగా ఢిల్లీ పెద్దలు 'హాథ్ సే హాథ్ జోడో' యాత్రను ప్లాన్ చేశారు.
ఆ లాజిక్ మిస్సవుతున్న నేతలు
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చివరకు కలువక తప్పదంటూ వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీకి చేకూర్చే నష్టం అంతా ఇంతా కాదు. గతంలో విజయవాడకు వచ్చిన అగ్రనేత దిగ్విజయ్‌సింగ్ ఇదే విషయాన్ని మీడియాతో అన్నప్పుడు పెద్ద దుమారమే చెలరేగింది. ఈ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరితే ఆటోమాటిక్‌గా బీజేపీకి అడ్వాంటేజ్ వస్తుంది. కేసీఆర్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్రభావం కాంగ్రెస్ పైన పడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ గంపగుత్తగా కమలానికి పడతాయి. ఇంత చిన్న లాజిక్‌ను ఆ పార్టీ నేతలు కొందరు మిస్సవుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సహా పలువురు నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ రెండు పార్టీలూ ఒక్కటేనని, కాంగ్రెస్‌కు ఓటేసినా బీఆర్ఎస్‌కు వేసినట్లేనని ప్రజల్లో ప్రచారం సాగిస్తున్నారు. కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందించడానికి తమ పార్టీ మాత్రమే సరైన ప్రత్యామ్నాయమని ఢంకా భజాయిస్తున్నారు.
సెకండ్ ఆప్షన్‌గా కాంగ్రెస్..
అయితే, పొత్తు లేకపోయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలువక తప్పని స్థితి ఏర్పడుతుందన్నది సుస్పష్టం. బీజేపీ, కాంగ్రెస్ కేంద్రంలో బద్ధ విరోధులు కనుక అవి రెండు కలిసే అవకాశం ఎంతమాత్రం లేదు. బీఆర్ఎస్‌కు 55 నుంచి మెజారిటీకి అవసరమైన 60 సీట్ల మధ్య వస్తే ఎంఐఎం సపోర్ట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అలాకాకుండా 55కి తగ్గిన పక్షంలో హస్తం పార్టీ మద్దతును ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తీసుకోక తప్పదు. సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేల్లో బీఆర్ఎస్‌కు 45 నుంచి 55 మధ్యలో వస్తాయని తేలిందని సమాచారం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఫస్ట్ ఆప్షన్‌గా ఎంఐఎంను, సెకండ్ ఆప్షన్‌గా కాంగ్రెస్‌ను ఎంచుకోనున్నారని తెలుస్తోంది. పీసీసీ అగ్రనేతల్లో ఒకరితో ఆయన ఈ మేరకు ఒక రహస్య అవగాహన కూడా కుదుర్చుకున్నట్లు ఒక వార్త ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాల్లో బీఆర్ఎస్, బీఆర్ఎస్ గెలుస్తుందన్న చోట కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను నిలబెట్టే విషయమై అవగాహన కుదిరిందని అంటున్నారు. ఈ విషయం తెలిసిన ఢిల్లీ అధిష్టానం ఆ అగ్రనేతపై ఆగ్రహించి మందలించినట్లుగా ప్రచారం సాగుతోంది.
కొసమెరుపు
ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కళ్లు తెరవాలి. హుజూరాబాద్ ఉపఎన్నిక నుంచి రోజురోజుకు మసకబారుతున్న పార్టీ ప్రతిష్టను పునరుద్దరించడానికి కృషి చేయాలి. పరస్పర దూషణల ఫలితంగా ప్రజల్లో అభాసు పాలవుతున్నారని గుర్తించాలి. ప్రత్యర్థి నేత పరువు తీసినా చివరకు పోయేది తమందరి పరువేనన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. నోటి దూల తగ్గించుకోవాలి. రోజుకో కొత్త వ్యూహంతో దూసుకుపోతున్న బీజేపీకి దీటుగా ప్రజల్లోకి వెళ్లాలి. కనీసం అధికారం దక్కేవరకైనా అంతర్గత కలహాలు మానాలి.
- డి మార్కండేయ
editor@dishadaily.com
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672