మళ్లీ నల్లధనంపైనే ఓట్లా? - వెంకట్ నాయక్
మళ్లీ నల్లధనంపైనే ఓట్లా అంటూ ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడు వెంకట్ నాయక్ ప్రశ్నించారు.
2014లో యూపీఏ దశకం ముగిసిన తరువాత "నల్లధనం" అనే అంశాన్ని అందంగా ఆవిష్కరించి ఎన్నికలకు వాడుకున్న నరేంద్రమోదీ, తన పది సంవత్సరాల పరిపాలన తర్వాత తిరిగి అదే అంశంపై ఎన్నికలలో ఓట్లు అడగడం దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు అనేక అనుమానాలకు తావు ఇచ్చినట్టు అవుతుంది. లేని గుజరాత్ మోడల్‌ను మీడియాలో ఉన్నట్లుగా భ్రమింపచేసి ప్రధాని కావాలన్న ఆకాంక్షను నెరవేర్చుకొని, ప్రజాస్వామ్య ప్రధాని నుంచి నియంతృత్వ రాజులాగా మారిపోతున్న మోదీని చూస్తుంటే చంద్రముఖి సినిమాలో గంగ కాస్త చంద్రముఖిగా మారే పరిణామక్రమం గుర్తుకు వస్తుంది. ఇక విషయానికి వస్తే 'నల్లధనం' అలియాస్ "కాలాధన్"మోదీ ఉచ్చరించి ఆచరించని ఒక అద్భుతం.
దశాబ్ద కాలం క్రితం మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని హోదాలో పెట్టిన తొలి సంతకం నల్లధనం మీదనే. దానికి ఒక కమిటీని (ఎం.బి.షా కమిటీ) ఏర్పాటు చేస్తే ఆ కమిటీ వెలికితీసిన మొదటి పేరు గౌతమ్ ఆదాని, కానీ ఇప్పటి వరకు ఆదాని నుంచి నల్లధనాన్ని రికవరీ చేయకపోగా మోదీ స్వతహాగా అతనికి అండగా వుండి ప్రపంచంలోనే అగ్రగామి ధనవంతుడుగా తీర్చిదిద్దారు. మత భావోద్వేగాలేమో ప్రజల మెదడులోకి- దేశ ప్రజల సంపదేమో ఆదానీ, అంబానీల జేబులోకి అన్నట్టుగా దేశ స్థితిని దిగజార్చిన తర్వాత ఇప్పుడు రాజకీయాల్లో ఒక వికృత సంస్కృతిని తెచ్చిపెట్టారు. అదే "బలవంతపు వసూళ్లు-బెదిరింపు రాజకీయాలు". దీనికోసం ఎలక్ట్రోల్ బాండ్లను తెచ్చి రాజ్యాంగబద్ధ సంస్థలైన సీబీఐ,ఈడీలను, ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తమ రాజకీయ అవసరాల కోసం వాడుకొని ఆర్థిక నేరగాళ్లకు రాజకీయ కోర్టులో క్లీన్ చీట్ ఇస్తున్నారు.
విరాళమివ్వు.. లేదా జైలుకు పో...
అది ఎంతలా అంటే నువ్వు వ్యాపారస్తుడైవైతే బీజేపీ పార్టీకి బాండ్ రూపంలో విరాళాలు ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకులు అయితే పార్టీలో నైనా చేరాలి, కాదు అంటే జైల్లో వుండాలి. బీజేపీ రాజకీయానికి ఒక మెండైన ఉదాహరణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న ప్రతిపక్ష పార్టీల పెద్ద తలకాయలు జైల్లో వుంటే, ఇదే కేసులో నోటీసులు అందుకున్న కీలక వ్యక్తి అయిన శరత్ చంద్రా రెడ్డి వెంటనే ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో బీజేపీకి విరాళం ఇవ్వగానే సేఫ్ జోన్‌లో పడిపోయారు. ఒకే కేసులో ఇన్ని వైరుధ్యాలను చూస్తుంటే బీజేపీ ఈ ప్రక్రియ అంతా నల్లధనాన్ని తీయడానికి చేస్తున్నదా ..? లేక బెదిరించి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఆర్ధికంగా లాభపడి రాజకీయ కక్షను తీర్చుకుంటుందా..? అనే అనుమానాలు దేశ ప్రజలకు రాక మానదు. ఈ మధ్య కాలంలో "వాషింగ్ పౌడర్ మోదీ" అనే నినాదం ప్రజల్లో బాగా వ్యాప్తి చెందుతోంది. ఈ నినాదం ప్రకారం ఎంత అవినీతి పరుడైనా సరే, బీజేపీలో చేరితే పతిత పావనం అయిపోయి పరిశుద్ధులుగా మారిపోతారు అని అర్థం.
వాషింగ్ మిషన్‌లో ఉతికితే చాలు...
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా బీజేపీ పార్టీని ఒక "వాషింగ్ మిషన్"లాంటిదని అభివర్ణించారు. అక్రమంగా దేశ సంపదను దోచుకొని లక్షల కోట్ల నల్లధనాన్ని"దేశం దాటిస్తున్న దేశద్రోహులను బీజేపీలో చేర్చుకొని వారికి ఎంఎల్ఏ, ఎంపీలుగా టిక్కెట్లు ఇచ్చి చట్టసభల్లోకి పంపిస్తున్న మోదీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేస్తుందని ఇంకా ఎన్ని రోజులు ఈ దేశ ప్రజలు భ్రమలో బ్రతకాలి..? పరోక్షంగా మోదీ చేస్తున్న చర్యలను చూస్తుంటే ఆర్థిక నేరగాళ్లు దోచుకున్న సొమ్ము విదేశాల్లో వుండాలి, ఆర్థిక నేరస్థుడు ఏమో ప్రజా ప్రతినిదిగా చట్ట సభల్లో మోదీ ప్రక్కన వుండాలి అనేలా కనబడుతున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం అయిన అశోక్ చవాన్‌ను 2014 లో అప్పటి ప్రధాని అభ్యర్థిగా వున్న నరేంద్రమోదీ రాజకీయ ప్రసంగంలో భాగంగా ఆదర్శ్ చవాన్ (ఆదర్శ కుంభకోణంలో ప్రధాన నిందితుడు) అని నామకరణం చేసి ఆ కుంభకోణాన్ని ప్రధాన ఎన్నికల అస్త్రంగా వాడుకున్న విషయం దేశం ఇంకా మర్చిపోలేదు. కానీ ఇప్పుడు అదే అశోక్ చవాన్‌ను బీజేపీలోకి చేర్చుకొని రాజ్యసభ ఎంపీని చేసి 2024లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్టార్ కాంఫెయినర్ పదవిని కట్టబెట్టారు.
మాట వింటే రక్ష లేకుంటే కక్ష
ఇలా చాలామంది ఆర్థిక నేరగాళ్లను కాషాయమనే వాషింగ్ పౌడర్‌తో కడిగేసి ప్రజాస్వామ్యంలో మచ్చలేని నేతలుగా తీర్చిదిద్దుతున్న ఘనత మోదీ ప్రభుత్వానీకే దక్కుతుంది."మాట వింటే రక్ష లేకుంటే కక్ష"అన్నట్లు దేశ రాజకీయలను మార్చేసి దేశ వనరులను భవిష్యత్ తరాలకు దక్కకుండా చేసి, ఆర్థిక అసమానతలకు సృష్టిస్తున్న బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి ...? బీజేపీ పార్టీ ఆడుతున్న ఈ జగన్నాటకంలో ప్రజలు అమాయకులు అవ్వడం తప్ప మరేమీ లేదు. ఒక అబద్ధాన్ని పది సార్లు చెపితే నిజం అయ్యిపోతుంది అనే భ్రమలో మోదీ ఉన్నారనే అనడంలో సందేహం లేదు దానికి ఉదాహరణ కొద్దీ రోజుల క్రితం నాగర్ కర్నూలు ఎన్నికల సభలో 2G స్పెక్ట్రమ్ స్కామ్‌ను కాంగ్రెస్ చేసిందని చెప్పుకుంటూ వచ్చారు. అసలు 2G స్పెక్ట్రమ్ కేసులో నేరం జరిగినట్టు ఆధారాలను చూపించడంలో సీబీఐ ఫెయిల్ అయ్యినట్టు ట్రయల్ కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చి కేసును కొట్టివేసింది. ప్రధాని స్థాయిలో వున్న వ్యక్తి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు. ఇలా ప్రజలను బహిరంగంగా మోసం చేస్తున్న బీజేపీ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పక మానరు.
వెంకట్ నాయక్
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులు,
ఉస్మానియా యూనివర్సిటీ.
90140 12381