ప్రజల ఆశలు నెరవేర్చాలి!
Congress government should fulfill people's hopes!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు ప్రజా సంఘాలు కీలక పాత్ర వహించినట్టుగా ఏఐసీసీ ప్రతినిధి దీపా మున్షీ ప్రకటించడంతో ఆలస్యంగానైనా సత్యం ప్రకటించినట్లయింది. అయితే ఆ సత్యంలో కాస్తా సమగ్రత లోపించింది.
నాడు ఉద్యమకారులను పక్కకు పెట్టి..
సోషల్ మీడియా యూట్యూబ్ చానల్స్ నిరంతరం కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక విమర్శలు చేయడం ఉపయోగపడింది. ఈ మొత్తంలో లెఫ్ట్ పార్టీలు, సంస్థలు, అభిమానులు కనుక కాంగ్రెస్‌కు మద్దతు చేయకుండా కాంగ్రెస్ పాత చరిత్రను కూడా విమర్శిస్తే కాంగ్రెస్ గెలుపు ఊహకు అందనిది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడం కాంగ్రెస్‌ను గెలిపించడంలో లెఫ్ట్ పార్టీలు వివిధ ప్రజా సంఘాలు ఒక్కో సమయంలో ఒక్కో పాత్ర వహించాయి. అయితే, గెలుపునకు సహకరించిన వివిధ రకాల లెఫ్ట్ పార్టీలకు ఇతర సంస్థలకు, కాంగ్రెస్‌కు మధ్య ముందస్తు ఒప్పందాలు ఏమైనా ఉన్నాయో లేదో కానీ గెలిచిన తర్వాత ఆ పార్టీల, ఆ సంస్థల డిమాండ్స్‌ని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నెరవెర్చే దిశలో ఉన్నదా లేదా అని ప్రశ్నించుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమ కారులను పక్కన పెట్టి ఉద్యమ వ్యతిరేకులకు తన అనుచరులకు పదవుల పంపకం చేసిండు అనే విమర్శలు కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపు నుండే విమర్శలు మొదలైనాయి. సీట్ల కేటాయింపులు, వివిధ పదవుల పంపకాలలో అగ్రకులాలకు, కోటీశ్వరులకు ప్రాధాన్యత ఇస్తున్న విషయం నగ్నంగా బహిర్గత మవుతున్నది. విమర్శలు పెరుగుతున్నాయి.
ప్రజలు గమనిస్తున్నారు..
ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రజాస్వామిక స్ఫూర్తిని కొనసాగించకుండా వున్న పరిస్థితిలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఉద్యమకారులు కాంగ్రెస్‌కు పట్టం కట్టినారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు కానప్పటికీ, ఆర్థిక నిల్వలు లేనప్పటికీ కొత్త ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగాలు, అవినీతి నిర్మూలన, ప్రజాస్వామ్యం, వెనుకబడిన పేద వర్గాలకు ఆర్థిక, రాజకీయ అవకాశాలు మొదలైన విషయాలపై ప్రాధాన్యత ఇస్తుందా లేదా చిన్న చిన్న మార్పులతో ప్రజలను మభ్య పెడుతూ పాత ప్రభుత్వ అడుగు జాడల్లోనే నడుస్తుందా? అని ప్రజలు గమనిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, బీజేపీ కేంద్ర పరిపాలన పట్ల వ్యతిరేకత కొనసాగుతున్న పరిస్థితిలో కమ్యునిస్ట్, మావోయిస్టు, పార్టీలు వాటి ప్రజా సంఘాలు, వివిధ ప్రజాస్వామిక వాదులు ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చాయి. ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా అనుకూలంగా ఉపయోగపడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల వరకు చిన్న చిన్న మార్పులతో సరిపుచ్చుతూ కాలం గడపడం కాకుండా ప్రజల ఆశలు నెరవేర్చే దిశగా దృష్టి కేంద్రీకరించాలి.
జంపన్న
76710 97523