బీఆర్ఎస్ ఎట్టకేలకు తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ ఇప్పటికీ కసరత్తు చేస్తూనే ఉన్నది. మేనిఫెస్టో తయారీలో బీజేపీ కమిటీ నిమగ్నమై ఉంది. అయితే ఎన్నికల కోసం ఇచ్చే ఈ పార్టీల హామీలు చూస్తే హర్రాస్ పాటలా కనిపిస్తున్నాయి. ఒకరు మహాలక్ష్మి పేరుతో నెలకు రూ. 2500 ఇస్తామంటే.. మరొకరు సౌభాగ్య లక్ష్మి పేరుతో రూ. 3000 మహిళలకు జీవన భృతి కింద ఇస్తామంటున్నారు. ఒకరు రూ. 500కే గ్యాస్ అందజేస్తామంటే.. ఇంకొకరు రూ.400కే మీ ఇంటికి చేరుస్తామంటున్నారు. దీంతో ఉచితాలు, సబ్సిడీలు, సంక్షేమ పథకాల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉండాల్సిన అవసరముందనే చర్చ మళ్లీ మొదలైంది. అంతేకాకుండా ఉచితాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్‌పై ఇటీవలే సుప్రీం కోర్టు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతోపాటు ఆర్బీఐ, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. మరో రెండు వారాల్లో ఈ పిటిషన్ పై విచారణ జరగనున్నది. ఎన్నికలకు ముందే దీనిపై తీర్పు వస్తే ఆ ప్రభావం రాజకీయ పార్టీలపై పడే అవకాశముంది.
‘లక్ష్మణరేఖ’ అవసరమేనా?
ఓట్ల కోసం ఉచిత పథకాలను అమలు చేయాలనుకోవడం దేశానికి ప్రమాదకరమని ప్రధాని మోడీ గతేడాది హెచ్చరించిన తర్వాత దేశవ్యాప్తంగా ఉచితాలు, సంక్షేమ పథకాలపై చర్చ మొదలైంది. సెమీ ఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పార్టీలు విడుదల చేస్తున్న మేనిఫెస్టోలతో ఈ చర్చ మరింత ఎక్కువగా జరుగుతున్నది. అయితే అసమానతలను తగ్గించేందుకు ప్రవేశపెట్టే పథకాలను ఉచితాలుగా చూడవద్దని కొన్ని పార్టీలు వాదిస్తుండగా, ప్రభుత్వ నిధులను ఇష్టమొచ్చినట్లు పంచేయడం సరికాదని మరికొందరు అంటున్నారు. మరోవైపు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు ప్రభుత్వం పన్ను రాయితీలు, రుణ మాఫీలు ఇస్తున్నప్పుడు.. పేదలకు ఇచ్చే సబ్సిడీలను మాత్రమే ఉచిత పథకాలని ఎందుకంటారనే ప్రశ్న సైతం ఉన్నది. దీంతో ఉచితాలకు, సంక్షేమాలకు లక్ష్మణరేఖ ఎవరు గీస్తారనే చర్చ ప్రసుత్తం దేశంలో జరుగుతున్నది.
ఓటర్లపై ప్రభావం చూపిస్తాయా?
ఉచిత పథకాలు ఓటర్ల ఆలోచనా తీరుపై కొంతమేరకైనా ప్రభావం చూపిస్తాయనడం కాదనలేని వాస్తవం. అయితే కొందరు సంక్షేమ పథకాలను సైతం ఉచితాల జాబితాలో చేరుస్తుండడం ‘సంక్షేమం’పై ప్రభావం చూపిస్తుందని వాదించే వారూ ఉన్నారు. మరోవైపు ఇష్టానుసారంగా హామీలు ఇచ్చిన పార్టీలు అనేక ఎన్నికల్లో ఓటమి చవి చూడడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని ఏ మేరకు పార్టీలు వాటిని అమలు చేస్తాయో ఓటరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడనడానికి ఇది నిదర్శనం.
అన్ని పార్టీలదీ అదే దారి..!
ఏ పార్టీ ఎన్ని రకాల అభిప్రాయాలు వ్యక్తం చేసినా... అన్ని పార్టీలు సంక్షేమం పేరుతో ఉచిత పథకాల వైపే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీస్‌ను ప్రకటించింది. ఇందులో మహాలక్ష్మి, చేయూత, రైతు భరోసా పథకాలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేసేవే. బీఆర్ఎస్ ఇప్పుడు ప్రకటించిన, మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన రైతుబంధు, ఆసరా, సౌభాగ్యలక్ష్మీ పథకాలు సైతం నేరుగా నగదు బదిలీ రూపంలో అందే ప్రోత్సాహకమే. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ కాకపోయినా.. వివిధ రాష్ట్రాల్లో బీజేపీని చూసినా ఉచిత, సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే కేంద్రం రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేస్తున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక సబ్సిడీలు అందుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సైతం ఇలాంటి పథకాలనే అమలు చేసి చూపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు సైతం అనేక ఉచిత హామీలను ఇస్తున్నాయి. అయితే ఇందులో ఏవి చట్టబద్ధమైన సంక్షేమ పథకాలు? ఏవి ఉచితాలు? అనేది చెప్పడం చాలా కష్టం. అయితే వ్యక్తి ప్రయోజనం కంటే సమాజానికి ప్రయోజనాన్ని చేకూర్చే విద్య, ఆరోగ్యం వంటి ప్రోత్సహించేలా చేపట్టే చర్యలు మంచి ఫలితాలు ఇస్తాయని ఆర్థిక వేత్తలు చెబుతున్న మాట. అయితే సంక్షేమం పేరిట అమలు చేసే పథకాలు ఆ రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించవద్దనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతున్నది.
సబ్సిడీలే బెటర్!
నగదును నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో వేసే బదులు.. వారికి జీవనోపాధి చూపిస్తూ.. సబ్సిడీల ద్వారా లాభం చేకూర్చడం మంచి విషయమవుతుందని కొందరు ఆర్థికవేత్తల మాట. రైతుబంధు పేరుతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల అకౌంట్లలో ఏడాదికి ఎకరాకు రూ. 10వేలను జమ చేస్తున్నది. అయితే ఇది అమలు చేసినప్పటి నుంచి గిట్టుబాటు ధర, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, వివిధ రకాల సబ్సిడీలకు మంగళం పాడింది. ఈ పెట్టుబడి సాయం చిన్న, సన్న కారు రైతులకు మంచిగానే మేలు చేస్తున్నది. అయితే ప్రభుత్వాలకు పన్ను కడుతూ, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ, కోట్లు సంపాదిస్తున్న వారు, వ్యవసాయం చేయనివారు సైతం దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. అదే సమయంలో వివిధ సబ్సిడీలకు అర్హులు దూరమవుతున్నారు. దీంతో నేరుగా నగదు బదిలీ చేయడం కంటే ఉచిత విద్యుత్, ఎరువులు, వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ వంటివి పెంచితే అర్హులైన వారికి ఎక్కువ లాభం చేకూరుతుంది. వృద్ధులకు ఆసరా కోసం ఇచ్చే పింఛన్లను వ్యతిరేకించే వారు ఎవరూ ఉండరు. అయితే మహాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి పేరుతో కొందరికి నేరుగా నగదు బదిలీ చేసే బదులు, గ్యాస్, కరెంట్, పెట్రోల్ వంటి వాటిపై సబ్సిడీలు పెంచితే కుటుంబం మొత్తానికి ప్రయోజనం చేకూరే అవకాశముంటుంది.
-ఫిరోజ్ ఖాన్,
సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,
96404 66464