అంబేడ్కర్‌ని మీరు అర్థం చేసుకోలే..!

వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో అనేక ఆర్థిక రాజకీయ పోరాటాలు చేసింది. ఇందుకోసం ఎందరో నాయకులు తమ జీవితాలను త్యాగం

Update: 2024-08-29 01:15 GMT

వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో అనేక ఆర్థిక రాజకీయ పోరాటాలు చేసింది. ఇందుకోసం ఎందరో నాయకులు తమ జీవితాలను త్యాగం చేశారు. అయితే భారతదేశంలో అస్పృశ్యత నివారణ విషయంలో, కుల నిర్మూలన విషయంలో వారు నిర్దిష్టమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్లలేకపోయారు. కారణం.. కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రధానంగా అగ్రకుల, అగ్రవర్ణ ఆధిపత్యం కొనసాగుతూ రావడం. ముఖ్యంగా కమ్యూనిస్టులు హిందూ మతోన్మాదాన్ని ఎదిరిస్తున్నారు. కానీ హిందువులుగా జీవిస్తున్నారు. కులాన్ని నిర్మూలించకుండా వర్గ విప్లవం విజయవంతం కాదని డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆనాడే చెప్పాడు. 

కులభావం పోతేనే వర్గ విముక్తి!

అంబేడ్కర్‌ సామాజిక, ఆర్థిక శాస్త్రంలో అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన మేధావి. ఆయన భారత దేశంలో కార్మిక వర్గం, కర్షక వర్గం ఒక వర్గంగా రూపొందాలి అంటే వారిలోని కులభావం హిందూమత భావం తప్పక ముందు నిర్మూలించాలి. అంటే ఆర్థిక పోరాటానికి ప్రతి అడుగులో కులం, మతం, వర్ణం, ఆచారం, సంప్రదాయం, మూఢత్వం అడ్డు వస్తాయని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలలోని నాయక వర్గం హిందూమత భావ జాలంలో ఉన్నంతకాలం వారు భారతదేశంలో ఏ రకమైన పరిణామాన్నీ తీసుకురాలేరని అంబేడ్కర్‌ స్పష్టంగా చెప్పారు. భారతదేశంలో హిందూ వాదానికి ప్రత్యామ్నాయంగా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాలని కూడా చెప్పారు. ఈ విషయాన్ని కమ్యూనిస్టులు పట్టించుకోలేదు. ఈ విషయంగా అంబేడ్కర్‌ కమ్యూనిస్టులతో, సోషలిస్టులతో వాదిస్తూ ఇలా అన్నారు.

కులం ఉంటే ప్రజలు ఏకమవుతారా?

నా ఉద్దేశాన్ని మీకు ఇంకా విపులంగా చెప్పాలంటే సోషలిజాన్ని సాధించడంలో సాధక బాధకాలు అన్నిటినీ పూర్తిగా వివరించవలసి ఉంది. సోషలిస్టులు ఉద్దేశించిన ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు ఎలా సాధ్యపడుతుంది? విప్లవం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకుంటేనే గాని అది సాధ్యం కాదన్నది స్పష్టమే కదా. ఆ అధికారాన్ని చేజిక్కించుకొనేవాళ్లు కార్మికవర్గం (ప్రొలిటేరియట్‌) ప్రజలై ఉండాలి. అయితే ఇక్కడ నేను అడిగే మొదటి ప్రశ్న విప్లవం తేవడానికి ఇండియాలోని కార్మికవర్గ ప్రజలంతా ఏకం అవుతారా? ఆ విప్లవానికి ప్రజల్ని ప్రేరేపించే శక్తి ఏది? నా దృష్టిలో అట్టి శక్తి ఒక్కటే. అది ఏదంటే తనతో పాటు విప్లవంలో పాల్గొంటున్న మరొక వ్యక్తి పట్ల సంపూర్ణ విశ్వాసం. తక్కిన విషయాలన్నీ మామూలుగా ఉన్నప్పుడు ఒక మనిషి తాను ఏ వ్యక్తితో కలసి విప్లవంలో పాల్గొంటున్నాడో ఆ వ్యక్తితో సమానత్వం, సౌభ్రాతృత్వం, అన్నిటినీ మించి న్యాయం అనే భావాల సహజ ప్రేరణతో పోరాడగలడనే ప్రగాఢ విశ్వాసం ఆ మనిషికి ఉండవలసి ఉంది. కార్మిక వర్గం అంతా కలిసి ఏకం కాకపోతే, ఏకముఖంగా పోరాడడానికి ఉద్యమించకపోతే విప్లవం ఎలా రాగలదు?

కుల వ్యవస్థ మహా కందకం!

కుల వ్యవస్థ రక్షణార్థం కొందరు జీవశాస్త్రాధారమైన ఒక మహా కందకాన్ని నిర్మించారు. వాళ్లు చెప్పేదేమిటంటే జాతి, రక్తం స్వచ్ఛతను కాపాడటం కోసం కుల వ్యవస్థ ఏర్పాటు చేయబడిందని చెప్పారు. ఈ వాదం ఎంత హాస్యాస్పదమో ఎత్నాలజిస్టులు (నరసంతతి శాస్త్రజ్ఞులు) చెప్పేదాన్ని గమనిస్తే తెలుస్తుంది. ప్రపంచంలో ఏ మూల చూసినా అన్ని జాతులలోనూ సాంకర్యం జరుగుతూనే వచ్చిందనీ ఈ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇండియాలోని ప్రజల విషయంలో ఇది పరమ యధార్థం. కులం మూలాలు అర్థం కావాలంటే డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ని ముందు అంగీకరించాలి. ఆయన ఆలోచన విధానమే మనకు కులనిర్మూలన మార్గాన్ని, కుల నిర్మూలన సిద్ధాంతాన్ని, కుల నిర్మూలన ఆచరణను పరిపుష్టం చేస్తున్నాయి. అందుకే ఇంతవరకు కమ్యూనిస్టు పార్టీలు అంబేడ్కర్‌ ఫోటోనే వారి కార్యాలయంలో ఆవిష్కరించనంతా సిద్ధాంత అస్పృశ్యతను పాటిస్తున్నారు. వారికి చందాలిచ్చే రైతుల పేరుతో వున్న భూస్వాములు, లక్షల జీతాన్ని ఇచ్చే టీచర్ల తరుపునే ఎక్కువ పోరాడుతున్నారు. అందుకే ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించుకోలేకపోతున్నారు.

ఇప్పటికీ దళిత కార్మికులు అక్కడ వెట్టి చాకిరిలోనే వున్నారు. వారికి నాయకత్వాన్ని ఇవ్వడం లేదు. వారిలో గుణాత్మకమైన మార్పు రావాలి. వారు ఏమి చెప్తున్నారో అది చేయాలి. మన పిల్లలు, కుటుంబాలను ఉద్యమంలో ఏకీకరించకుండా మనం వృద్ధులం అయిపోతున్నా నాయకత్వాలు వదలకుండా ఉండే స్వభావం నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. మనకు సిద్ధాంత బలం లేకపోతే హిందూ భావజాలం నుంచి బయటపడకపోతే కుల నిర్మూలన సమాజాన్ని నిర్మించలేమని వారు తెలుసుకోవాలి. వారు విశ్లేషణను కూడా విమర్శగా తీసుకొని 100 నోళ్లతో సమాధానాన్ని చెప్పే విధానాన్ని కూడా మార్చుకోవాలి.

సకాల మరణాలు, త్యాగాల మరణాలు..

కమ్యూనిస్టులలో వున్న బ్రాహ్మణులంతా సకాల మర ణాన్నే చెందుతున్నారు. దళితులు బహుజనులు మాత్రమే త్యాగాలతో మరణిస్తున్నారు. అయితే భారత కమ్యూనిస్టు ఉద్యమం కులానికి భారత సమాజంలో ఉండే పట్టు విషయంలో సరైన అంచనాతో ఉద్యమాన్ని నడపలేదు. తెలంగాణా, శ్రీకాకుళం పోరాటాలు జరిగిన ప్రాంతాల్లో కులం వేళ్లు తెగలేదు. అస్పృశ్యత భావం రూపుమాయలేదు. అనేక సందర్భాల్లో కమ్యూనిస్టు ఉద్యమకారుల రచనల్లో దళితుల పరిస్థితులను గూర్చి విశ్లేషించడం జరిగింది. తరిమెల నాగిరెడ్డి గారి ‘తాకట్టులో భారతదేశం’లోను, పుచ్చలపల్లి సుందరయ్య గారి, దేవులపల్లి గారి ‘‘తెలంగాణా పోరాట చరిత్ర’’ల్లోను దళితుల స్థితిగతులపై కొన్ని భాగాలు వ్రాశారు.

పార్టీలకు మిగిలిన నాయకులు..

అయితే ఈ అస్పృశ్యత, కులం నిర్మూలనలను ఒక పాలసీగా తీసుకొని పని చేయకపోవడం వలన సొంత కుటుంబాల్లో, సొంత కులాల్లోనే పెళ్లిళ్లూ జరుగుతూ రావడంతో నాయకులు పార్టీలకు మిగిలిపోయారు. అందుకే ఈనాడు కమ్యూనిస్టు ఉద్యమం తమకు తాము పునశ్చరణ చేసుకున్నది. అస్పృశ్యత నిర్మూలనా, కుల నిర్మూలనా సిద్ధాంతాలను, కార్యక్రమాల ప్రధాన వైవిధ్యంగా స్వీకరించి అంబేడ్కర్‌ని ఆధునిక సిద్ధాంతకర్తగా అన్వయించుకుంది. పునర్‌ వివేచనతో ముందుకు నడిస్తే లక్షలాది మంది క్యాడర్‌ కార్యకర్తలున్న కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశ సాంఘీక, సాంస్కృతిక విభాగాల్లో రాబోయే దశలలో పెనుమార్పులు తీసుకురావడానికి చారిత్రక చోదక శక్తి అవుతుందని దళిత ఉద్యమం, అంబేడ్కర్‌ ఉద్యమం బలంగా నమ్ముతున్నాయి. అలాగే లౌకికవాదులు, ప్రజాస్వా మ్య వాదులు కూడా బలంగా నమ్ముతున్నారు. చరిత్రలో పునర్‌ వివేచనే పునర్‌ జీవనోధ్యాయానికి నిర్దిష్టమైన మార్గాన్ని రూపొందిస్తుంది అని డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆలోచనలో కమ్యూనిస్టు ఉద్యమం నడవాలని ఈ చారిత్రక సందర్భంలో సహృదయంతో, సముత్తేజంతో, సమన్వయ దృష్టితో కోరుతున్నాం. చరిత్రను మార్చేది ప్రజలే.

డా. కత్తి పద్మారావు.

98497 41695

Tags:    

Similar News