కామన్ మ్యాన్ డైరీ:రియల్ క్రుయల్టీ

ఉదయం 9 గంటలు. బడికి వెళ్లే పిల్లల కోసం వచ్చే బస్సులు, ఆటోలతో రోడ్డంతా హడావుడిగా ఉంది. చైతన్య బడికి రెడీ అయ్యాడు. ఎప్పటిలాగే గిరీశ్​ఇంటికి

Update: 2022-07-18 18:45 GMT

ఉదయం 9 గంటలు. బడికి వెళ్లే పిల్లల కోసం వచ్చే బస్సులు, ఆటోలతో రోడ్డంతా హడావుడిగా ఉంది. చైతన్య బడికి రెడీ అయ్యాడు. ఎప్పటిలాగే గిరీశ్​ఇంటికి వెళ్లాడు. రోజూ కనిపించే సందడి ఆ ఇంటిలో కనిపించ లేదు. ఆ ఇంటికి ఇంకా తెలవార లేదు. తలుపులు తెరవలేదు. లోపలి నుంచి ఎలాంటి చప్పుడూ వినిపించడం లేదు. తాను వచ్చే సమయానికే రెడీగా ఉండే హరీశ్, గిరీశ్ జాడ లేదు. ఊరికి వెళ్లారని అనుకుందామంటే, ఇంటికి తాళం లేదు. లోపలి నుంచి తలుపు గడియ పెట్టి ఉంది. తలుపు కొట్టాడు చైతన్య. 'గిరీశ్' అని పిలిచాడు​లోపలి నుంచి జవాబు రాలేదు. భయంతో ఇంటికి పరుగులు తీశాడు. అమ్మానాన్నకు విషయం చెప్పాడు. వాళ్లు గబగబా వచ్చి తలుపులు బాదారు. అయినా స్పందన లేకపోవడంతో కిటికీ అద్దాలను పగులగొట్టి లోపలికి చూశారు. గిరీశ్ తండ్రి సురేశ్, తల్లి సుమ విగత జీవులుగా పడి ఉన్నారు. బాత్ రూమ్ డోర్ దగ్గర గిరీశ్, కిచెన్ దగ్గర హరీశ్ పడి ఉన్నారు. వారికి నోట మాట రావడం లేదు. వెంటనే మియాపూర్‌లో ఉంటున్న సురేశ్ అన్నకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అంతలోనే ఇరుగూపొరుగూ జమయ్యారు. పోలీసులు వచ్చారు. తలుపులు బద్దలు కొట్టారు. నలుగురి శవాలను పోస్టుమార్టానికి తరలించారు.

*

నల్లగొండ జిల్లాకు చెందిన సురేశ్ పదేండ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. ఓ ఎంఎన్‌సీలో ఉద్యోగంతో జీవితం ప్రారంభించాడు. జీతం కూడా బాగానే వచ్చేది. సుమ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవితం సాఫీగా సాగిపోతున్నది. కూకట్‌పల్లిలో ఉండే సురేశ్​చెల్లెలి భర్త కిషోర్‌ది రియల్ ఎస్టేట్ వ్యాపారం. లక్షల సంపాదన ఉండటంతో విలాసవంత జీవితం గడుపుతున్నాడు. ఎప్పుడు అతడి ఇంటికి వెళ్లినా 'నెల జీతంతో ఏం బతుకుతారు? జీతం అంటే బకెట్‌తో నీళ్లు మోసుకున్నట్టు. వ్యాపారం చేయడమంటే నేరుగా ఇంటిలోకే పైప్ లైన్ వేసుకున్నట్టు. కొద్ది రోజుల పాటు రిస్క్ తీసుకుంటే భారీగా లాభాలు గడించొచ్చు' అనేవాడు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంటరైపోదామని డిసైడయ్యాడు సురేశ్. భార్య సుమ అంగీకరించలేదు. 'మన దగ్గర పెట్టుబడి లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే కోట్ల మాట వద్దు' అని వారించింది. 'మన దగ్గర లేకున్నా ఇచ్చే వాళ్లుంటారు. మనకు పరిచయాలూ ఎక్కువే. బాగా రాణించగలం' అంటూ భార్యకు నచ్చజెప్పి ఉద్యోగం మానేశాడు సురేశ్.

*

మిత్రుల దగ్గర రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 200 గజాల స్థలాన్ని 60 లక్షలకు స్థలం కొన్నాడు. అడ్వాన్సుగా రూ. 20 లక్షలు చెల్లించాడు. తనకు తెలిసిన సర్కిల్స్‌లో అమ్మకానికి పెట్టాడు. కోటి రూపాయలకు అమ్మేశాడు. 40 లక్షల రూపాయల లాభం వచ్చింది. కూకట్‌పల్లి నుంచి సంగారెడ్డి శివారులోని అమీన్‌పూర్ (పేరు మార్చాం)కు మకాం మార్చాడు. ఇదంతా కేవలం నెల రోజులలోనే. బావ చెప్పినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే నిజంగా ఇంటికి డబ్బుల పైప్ లైన్ వేసుకోవడమే అనుకున్నాడు. జీవితం సంతోషంగా సాగిపోతున్నది. 500 చదరపు గజాల స్థలంలో సువిశాలంగా ఇంటిని నిర్మించుకున్నాడు. స్కోడా కారు మెయింటేన్ చేస్తున్నాడు. ఆయన దశే మారిపోయింది. సుమ కూడా ఉద్యోగం మానేసింది. ఓ సాధారణ ఐటీ ఉద్యోగి కుటుంబం ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్లాట్ల స్థాయిలో మొదలైన సురేశ్​వ్యాపారం ఏకంగా వెంచర్లు వేసే దాకా వెళ్లింది.

*

మెదక్ జిల్లా తూప్రాన్ శివారులో ఎకరాకు నాలుగు కోట్ల రూపాయల చొప్పున పదెకరాల స్థలం కొన్నాడు సురేశ్. ఆ స్థలం నలుగురు అన్నదమ్ములది. అందరూ ఓకే చెప్పారు. అడ్వాన్సుగా రూ. 20 కోట్లు చెల్లించాడు. ఆ అన్నదమ్ములకు సంబంధించిన వారసులు కోర్టుకెక్కారు. రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. రొటేషన్ లో తెచ్చిన రూ.20 కోట్లు స్ట్రక్ అయిపోయాయి. ఇచ్చినవాళ్లు అడుగుతున్నారు. ఇంటి దగ్గర ఉన్న రెండెకరాల పొలం అమ్మేసి వారికి వడ్డీ డబ్బులు ముట్టజెప్పాడు. అడ్వాన్సు తీసుకున్న వారి మీద ఒత్తిడి తెచ్చాడు. 'మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. కోర్టు తీర్పు రాగానే స్థలం మీకే ఇస్తామని, చిల్లి గవ్వ కూడా అదనంగా అడుగబోమని' అంటున్నారు. నెల గడిచింది. డబ్బులు ఇచ్చినవారి ఒత్తిడి తీవ్రమైంది. దాంతో చేసేదేమీ లేక అమీన్‌పూర్‌లో ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని రూ. ఐదు కోట్లకు అమ్మేశాడు. వడ్డీ కింద కోటి చెల్లించాడు. వేరేచోటికి మకాం మార్చాడు. రెండు కోట్లతో ఇస్నాపూర్‌లో ఓ ప్లాట్ కొన్నాడు. అడ్వాన్సుగా కోటి రూపాయలు చెల్లించాడు. సిటీ అవుట్ స్కర్ట్ కావడంతో నెల రోజులో దానిని అమ్మేయొచ్చనుకున్నాడు. అదీ వర్కవుట్ కాలేదు. డబ్బులన్నీ ఇరుక్కుపోయాయి. కరోనా కారణంగా రియల్ భూం పడిపోయింది. అప్పులు ఇచ్చినవాళ్లు ఇంటి మీదకు వస్తున్నారు.

*

ఓ ఆదివారం ఉదయం పది మంది సురేశ్​ ఇంటికి వచ్చారు. బూతులు తిడుతూ నానా హంగామా చేశారు. అప్పటి వరకు వీధిలో పెద్దమనిషిలా కనిపించిన సురేశ్ ముఖం వాడిపోయింది. కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. 'జాగలు ఉన్నయి తీసుకోండి' అంటూ ప్రాధేయపడ్డాడు. 'మాకెందుకురా జాగాలు?' అంటూ దబాయించారు. 'తెల్లారేసరికి పైసలు కట్టకుంటే లేకుంటే నీ సంగతి తేలుస్తం' అంటూ అరిచారు. పోతూపోతూ స్కోడా కారును తీసుకెళ్లారు. టెన్షన్ పెరుగుతున్నది. 'బంధువులను అడుగుదామంటే వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు! అడిగినా ఇస్తారా? ఇద్దరం ఉద్యోగం చేసినా తీర్చగలమా? అయినా, ఇప్పటికిప్పుడు ఉద్యోగం మనకెవరిస్తారు?' అంటూ మదనపడ్డారు భార్యాభర్తలు. చావు తప్ప వేరే మార్గం కనిపించలేదు. పెళ్లయ్యాక మూడేండ్లకు పుట్టిన కవల పిల్లలు గిరీశ్, హరీశ్‌ను​చూస్తుంటే సుమకు దు:ఖం తన్నుకు వచ్చింది. 'మనం చచ్చిపోతే వీళ్ల బాగోగులు ఎవరు చూస్తారు?' అంటూ బోరున ఏడ్చింది. ఆ రాత్రికి చికెన్ ఫ్రై చేసుకున్నారు. కూల్ డ్రింక్ తెచ్చుకున్నారు. అందులో విషం కలుపుకొని అందరూ తాగేశారు. ఎంతో మంది దశ మార్చేసిన 'రియల్' వ్యాపారం ఓ విద్యాధికుల కుటుంబాన్ని ఈ లోకంలో లేకుండా చేసింది.

 ఎంఎస్‌ఎన్ చారి

79950 47580

Tags:    

Similar News