14 ఏళ్ల నాటి వ్యాఖ్యలపై.. నేడు విచారణా?
దాదాపు 14 ఏళ్ల కిందట 2010 అక్టోబర్ నెలలో, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఢిల్లీలో నిర్వహించిన సభలో అరుంధతి రాయ్ మాట్లాడుతూ ‘కశ్మీర్ అనేది
దాదాపు 14 ఏళ్ల కిందట 2010 అక్టోబర్ నెలలో, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఢిల్లీలో నిర్వహించిన సభలో అరుంధతి రాయ్ మాట్లాడుతూ ‘కశ్మీర్ అనేది ఎప్పుడూ కూడా భారత దేశంలో భాగం కాదు. అది చారిత్రక వాస్తవం. భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో ఒప్పుకున్నది’ అని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలకు ఆ క్షణమే హాల్లో అరుపులు కేకలు వినపడ్డప్పటికీ “మేము న్యాయం కోసం పోరాడుతున్నాం అది అందరి కోసం” అని ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు.
దీనిని అందరిపై దాడిగా చూడాలి!
ఆర్టికల్ 370 ఉండడం వల్లనే కాశ్మీర్ సమస్య ఉత్పన్నమవుతున్నదనీ, దాన్ని రద్దు చేస్తే సరిపోతుందనే వాదన అప్పుడూ, ఆర్టికల్ 370 రద్దు అయిన ఇప్పుడూ చర్చనీయాంశమై ఉంది.
దీనిపై మాట్లాడడం రాయడం దేశద్రోహమా..? ఈ దేశంలో అణచివేయబడ్డ, మైనారిటీ, దళిత, ఆదివాసీ, అంబేద్కర్, మావోయిస్టుల గురించి అరుంధతి రాయ్ తాను గొంతుకై వినిపిస్తున్నది పాలకులను ప్రశ్నిస్తున్నందునే, రాయ్, వరవరరావు తదితరులపై దేశద్రోహం వంటి అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేక ఉపా వంటి చట్టాలను ప్రయోగిస్తున్నారు. దీన్ని కేవలం అరుంధతి రాయ్ పైనో, షేక్ షౌకత్ హుస్సేన్ పైనో దాడిగానో చూడవద్దు. ఇది మైనారిటీ ప్రజల వారి అభిప్రాయాలపై, దళితులపై, ఆదివాసులపై, అంబేడ్కరిస్టులపై, మావోయిస్టులపై, అణిచివేతకు గురైన వారిపై దాడిగానే చూడాలి.
అందుకే వారిపై దాడి
ఎందుకు మోడీ ప్రభుత్వం 14 ఏళ్ల తర్వాత అరుంధతి రాయ్ లాంటి వారిపై ఈ చర్యలకు పాల్పడుతోంది? ఎందుకంటే, ఈ పాలకులు కార్పొరేట్ల ప్రయోజనం కోసం ఉంటున్నారు. వారి ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగా ప్రచారం చేసే ప్రచార ప్రసార సాధనాలను కలిగి ఉన్నవారు. ఎవరైతే వీరిని ధిక్కరిస్తారో.. అంటే రాజ్యాంగబద్ధ పాలన కోరుకుంటారో.. వారిని కేసులతో ఇబ్బందుల పాలు చేస్తారు. ఈ దేశ అడవుల్లో కార్పొరేట్ కంపెనీలతో వందల కోట్ల ఎంఓయూలు అమలుపరచడానికి ఆదివాసీలను కట్టు బానిసలుగా చేసుకొని వారి ఆచార సంప్రదాయాలపై దాడి చేస్తూ ప్రపంచమే మార్కెట్టుగా మార్చే వారిని ఎదిరిస్తారో వారిపై వారి పక్షాన మాట్లాడే కొట్లాడే వాళ్లపై ఈ ఫాసిస్టు పాలకులు దాడి చేస్తున్నారు. అట్టడుగు వర్గాల ఆలోచనలపై, సంస్కృతిపై, ఆచారాలపై, భాషా జీవనంపై పాలకులు చేస్తున్న అప్రజాస్వామిక దాడిని తిప్పికొట్టవలసి ఉన్నది. ఆ గొంతుకలను నులిమే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది అసాధ్యం. ఉపా చట్టం ఉపసంహరణకు, రాజకీయ ఖైదీల విడుదలకై గొంతేత్తుదాం.
(అరుంధతి రాయ్, షేక్ షౌకత్ హుస్సేన్ తదితరులపై ఉపా చట్టం కింద విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడాన్ని నిరసిస్తూ..)
స్టాలిన్
ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు, హనుమకొండ
74164 20830