అల్పాహారం అందరికీ అందించండి..
cm sir Continue Chief minister breakfast scheme
ప్రభుత్వ బడులలో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు, హాజరు శాతాన్ని పెంచడానికి గత పాలకులు ప్రవేశపెట్టిన అల్పాహార పథకం అన్ని పాఠశాలల్లో అమలుకు నోచుకోకపోవడం శోచనీయం. అక్టోబర్‌లో ప్రారంభించబడిన ఈ పథకం మండలంలో ఒకటి రెండు పాఠశాలలకే పరిమితమవ్వడంతో అందరి విద్యార్థులకు సమన్యాయం జరగడం లేదు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు. వారి పిల్లలకు ఉదయాన్నే అల్పాహారం అందించే స్థోమత వారికి ఉండదు. అందువల్ల ఏమీ తినకుండానే విద్యార్థులు బడికి వస్తారు తద్వారా ఆకలితో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వారికి అర్థం కాదు. అంతేకాకుండా విద్యార్థులు తరచుగా పౌష్టికాహార లోపం, రక్తహీనతకు గురవుతున్నారు. ఈ క్రమంలో బడుల్లో ప్రవేశపెట్టిన ఈ పథకం పట్ల తల్లిదండ్రులు సర్వత్రా హర్షం వ్యక్తంచేశారు. అయితే ప్రారంభించే సమయంలో ఈ పథకానికి స్పష్టమైన విధివిధానాలు రూపొందించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కేవలం మండలంలో ఒకటి, రెండు పాఠశాలల్లోనే అమలౌతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్న అంశం. దీనిని అన్ని పాఠశాలల్లో అమలు చేస్తారో చేయరో తెలియని సందిగ్ధంలో వారున్నారు. పైగా గత ప్రభుత్వం ఎన్నికల ముంగిట ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ తల్లిదండ్రులు మాత్రం మెనూలో కొద్దిపాటి మార్పులు చేస్తూ ఈ పథకాన్ని కొనసాగించాల్సిందిగా అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి.
బోధనకు సమయమివ్వండి..
ప్రస్తుతం పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనాన్ని తయారుచేసే ఏజెన్సీ మహిళలకే ఈ టిఫిన్లు రూపొందించమని చెప్పడం, మధ్యాహ్న భోజన బిల్లులే సక్రమంగా చెల్లించకపోవడంతో వారు ఈ పథకం అమలుకు ముందుకు రావడం లేదు. పట్టణ ప్రాంతాల్లో లాగా ఏవైనా సంస్థలకు అప్పగిస్తే పథకం సక్రమంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరిగిన ధరలకనుగుణంగా అల్పాహార పథకానికి అందించే రేట్లు కూడా పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, రాగి జావ, మధ్యాహ్న భోజనం వంటి పథకాల అమలుకు ఒక సమాంతర వ్యవస్థ రూపొందించాలి. హెడ్మాస్టర్లకు, ఉపాధ్యాయులకు ఇటువంటి పథకాలను అమలు చేయడం తలకు మించిన భారంగా మారిందని బియ్యం లెక్కలు, భోజన బిల్లులు, రుచి, రిజిస్టరు తదితర రికార్డులతోనే సరిపోతుందని, మాకు బోధనకు సమయమివ్వండని ఎన్నిసార్లు ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు ఈ పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించి అల్పాహార పథకం అమలుకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించే విధంగా అధికారులకు అదేశాలివ్వాలి. మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలకే ఈ పథకాన్ని అప్పగించి వారికి శిక్షణనిచ్చి గిట్టుబాటు ధర అందించాలి. టీచర్లను కేవలం బోధనకే పరిమితం చేస్తూ ఈ పథకాన్ని అమలు చేసే చర్యలు చేపట్టాలి. ప్రజాపాలనలో అటూ తల్లిదండ్రుల, ఇటు ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేరుస్తూ విద్యార్థుల ఆకలిని తీర్చే ఈ పథకాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సజావుగా కొనసాగిస్తారని ఆశిద్దాం...
- సుధాకర్.ఏ.వి
రాష్ట్ర కార్యదర్శి, STUTS
90006 74747