అంపశయ్యపై అన్నదాత!
cm Jagan is downplaying the drought in Andhra Pradesh
అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ నేడు అన్నమో రామచంద్రా అనే పరిస్థితికి వచ్చింది. వర్షాభావం వల్ల ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 31 లక్షల ఎకరాల్లో విత్తనం వేయలేదు. సాగునీటి ప్రాజెక్టులు నీటికళ తప్పి వెలవెలపోతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల కింద ఈ సంవత్సరం సాగు చతికిలపడింది. ఈ పరిస్థితులకు ప్రకృతి కారణమంటూ ప్రభుత్వ పెద్దలు చేతులు దులుపుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వెయ్యక పోవడం, వేసిన పంటలు కూడా ఎండిపోవడాన్ని కొద్దిపాటి కరువుగా కొట్టి పారేశారు సీఎం జగన్ రెడ్డి. 440 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా కరువు లేదనే బుకాయించడం విడ్డూరం. రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, ప్రణాళిక శాఖ కరువు పై మౌనం వహిస్తుంది. రబీ లోనూ కరువు వెంటాడుతున్నా, లక్షల ఎకరాల్లో పంటలు వెయ్యక పోయినా ముందస్తు కరువు ప్రకటనే లేదు. అత్యధిక మందికి ఉపాధిని చూపే వ్యవసాయరంగాన్ని గాలికి వదిలేసి రానున్న ఎన్నికల్లో గెలవడానికి ఏ విల్లంబులు ఎక్కుపెట్టాలో జగన్ సిద్ధం చేసుకుంటున్నారు.
వలస పోతున్న రైతులు..
రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా అన్నదాతని పట్టించుకొనే దిక్కు లేదు. మొత్తం విస్తీర్ణంలో ఆహార పంటల సాగు 8.20 లక్షల తగ్గింది. 6.20 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడలేదు. నూనె గింజల పంటలు 46 శాతం విస్తీర్ణంలోనే వేశారు. రబీలోనూ వానలు లేక సాగుకు అవకాశం అంతంత మాత్రమే. ఖరీఫ్‌లో ఇంత భారీ మొత్తంలో విస్తీర్ణం తగ్గిపోవడం గత కొన్నేళ్లలో ఎన్నడూ జరగలేదు. ఈ పరిస్థితుల్లో మనసు, మానవత్వం ఉన్న ఏ ప్రభుత్వం అయినా రైతులను, రైతు కూలీలను ఎలా ఆదుకోవాలని ఆలోచన చేస్తుంది. కానీ జగన్ ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు. కనీసం మంత్రివర్గ సమావేశంలో కూడా రాష్ట్రంలో ఏర్పడ్డ దుర్భిక్ష పరిస్థితులపై చర్చించ లేదంటే రైతుల పట్ల జగన్ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో రైతులు అర్థం చేసుకోవాలి.
ఓవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కళ్లెదుటే వరిపైరు ఎండిపోతుంటే రైతులు రోదిస్తున్నారు. ఇప్పటికే వరిసాగు నిమిత్తం ఎకరాకు రూ.30 వేల వరకూ పెట్టుబడి పెట్టిన రైతులు పొట్ట, ఈత దశలో ఉన్న కీలక సమయంలో సాగునీరు అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ ఖరీఫ్‌లో నైరుతి రుతుపవనాల కాలంలో వరుణుడు ముఖం చాటేయగా, ఈశాన్య రుతుపవనాల సమయంలోనైనా వర్షాలు కురుస్తాయనే ఆశ కనపడటం లేదు. పోనీ పాలకులైన ఆదుకుంటారనుకుంటే అది కూడా లేకుండా పోయింది. ఎండుతున్న పంటలు, నీటి నిల్వల్లేక అడుగంటిన ప్రాజెక్టులు, తేమ లేక నెర్రెలిచ్చిన భూములు. బతుకు లేక ఊళ్లకు, ఊళ్ళు ఖాళీ అయి వలస పోతున్న దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి.
ఎంతసేపూ బటన్ నొక్కుడేనా?
రాష్ట్ర వ్యాప్తంగా 440 మండలాల్లో తీవ్ర దుర్భిక్షం తాండవిస్తుంటే జగన్ ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా గుర్తించి చేతులు దులుపుకోవడం బాధ్యతా రాహిత్యం. పనులు లేక బతుకు భారమై ఊళ్లకు, వూళ్లు వలసలు పోతూ ఖాళీ అవుతున్నాయి. ఈ ఏడాది ఏర్పడిన కరువు కొన్ని దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని విధంగా ఉంది. రాష్ట్రంలో ఏర్పడ్డ దుర్భిక్షంపై మీడియా, పత్రికలు ఘోషిస్తున్న ప్రభుత్వం కరువు బారిన పడిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ముందుకు రాలేదు. రైతుల ఆందోళనల కారణంగా అరకొరగా హడావుడిగా కరువు మండలాలను ప్రకటించి మొక్కు తీర్చుకొన్నది ప్రభుత్వం. ఖరీఫ్ సీజన్ ముగిసి, రబీ సీజన్‌కు వచ్చినా నీటి జాడ లేక, వర్షాలు పడక అన్నదాతకు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రూ 50 వేల రూపాయల పెట్టుబడి పెట్టి మిర్చి, పత్తి, మొక్కజొన్నవంటి అనేక పంటలు వేయగా అవి కళ్ల ఎదుటే ఎండిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అన్నదాత తీవ్ర నైరాశ్యంలో ఉంటే ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకు గ్రామాల్లో పర్యటించిన దాఖలాలు లేవు. ఎంతసేపూ ఏ బటన్ నొక్కి ఏ వర్గాన్ని మాయ చేద్దామా, అబద్దాలతో ప్రజల్ని ఏ విధంగా ప్రజలను మోసం చేద్దామా అన్న ధ్యాస తప్ప రైతు సమస్యలు పట్టించుకొనే తీరిక లేదు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై కేంద్రానికి వివరించలేదు. కేంద్ర బృందం తక్షణమే రాష్ట్రంలో పర్యటించాలని, కరువును అంచనా వేసి కరువు జిల్లాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చెయ్యలేదు. కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆల్మట్టి డ్యామ్ నుంచి నీటి విడుదలకు ప్రయత్నించాలి అన్న ఆలోచన కూడా సీఎం చేయడం లేదు. పంట నష్టం అంచనా వేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం దారుణం.
కరువు మండలాలనూ ప్రకటించలే..!
రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో కరువు తీవ్రత దారుణంగా ఉన్నా జిల్లాలలో కరువు మండలాలను ప్రకటించకపోవడం దురదృష్టకరం. కృష్ణా డెల్టాతో సహా వివిధ ప్రాజెక్టుల కింద సాగైన వరి పంటకు నీరు అందక నెర్రెలతో పంట భూములు దర్శనమిస్తున్న, వేసిన పంటలు ఎండిపోతున్నా, దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని రైతుల ఆవేదన ప్రభుత్వానికి పట్టడం లేదు. ప్రకటించిన కరువు మండలాలతోపాటు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కరువు నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.
గ్రామీణ ప్రాంతాల్లో రైతుకూలీలు పెద్దఎత్తున వలసలు పోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యవసాయ, ఉద్యాన, జలవనరుల, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. తక్షణం రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల నుండి రైతాంగాన్ని, గ్రామీణ పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వద్ద ప్రణాళిక లేదు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించాలని, ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించి ఖరీఫ్‌లో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, రబీ పంట కాలానికి అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కరువును తక్కువ చేసి కరువు మండలాలను ప్రకటించకపోవడం ఇప్పుడే చూస్తున్నాం. కరువు మండలాలను ప్రకటిస్తే ప్రభుత్వ కిరీటం పడిపోతుందన్న విధంగా గిల్టీగా ఫీలవడం వల్ల నష్టపోతున్నది రైతులే. ప్రకటించిన అరకొర కరువు మండలాలు ప్రకటించడంతో సరిపోదు. సముచిత స్థాయిలో రైతులకు పంట నష్టపరిహారం, బీమా, పశుగ్రాసం, పశువులకు తాగునీరు, ప్రజలకు తాగునీరు, రైతు రుణాల వాయిదా, వడ్డీ మాఫీ, కొత్త రుణాలు, పండిన పంటలకు ధరలు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి పనులు వంటి అన్ని సహాయక చర్యలనూ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. కేంద్రంపై ఒత్తిడి చేసి నిధులు రాబట్టాలి.ఏది ఏమైనా అన్నపూర్ణగా కీర్తించబడిన ఆంధ్రప్రదేశ్ నేడు అన్నమో రామచంద్రా,అనే పరిస్థితికి చేరుకున్నది.
నీరుకొండ ప్రసాద్
98496 25610